Tuesday, October 20, 2015

Bad Phase of Telugu Film Music

అథమ స్థాయిలో మన సినిమా సంగీతం

ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ప్రజల వైజ్ఞానిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక జీవితాభివృద్ధి కోసం జరిగే ప్రయత్నాల్లో ప్రముఖ స్థానంలో ఉంటున్నది సినిమాయే. ఏ యేటికాయేడు సినిమా కొత్తపుంతలు తొక్కుతూ ప్రజల్ని ప్రభావితం చేస్తూ వస్తోంది. అయితే ఎలాంటి మనుషులనైనా పరవశింపజేయగల సంగీతం విషయానికొస్తే తెలుగు సినిమా పాటిస్తున్న ప్రమాణాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మనిషికి భౌతిక, మానసిక బాధల నుండి ఉపశమనాన్నిచ్చే శక్తి సంగీతానికుందని ఇదివరకే రుజువైంది. తెలుగు సినిమాల్లో 'ఆ పాత మధురాలు' తప్ప  మనసును రంజింపజేసే, తన్మయత్వానికి గురిచేసే పాటలు నేడు మచ్చుకైనా కనిపిస్తున్నాయా? మన శాస్త్రీయ సంగీతానికున్న విశిష్టతనూ, శక్తినీ గాలికొదిలేసి 'బీట్' పేరుతో నేటి సంగీత దర్శకులు కడుతున్న బాణీలు ఎంత ఘోరంగా వుంటున్నాయో చెప్పనలవి కాదు. ఇవాళ వస్తున్న పాటల్లో నాలుగు కాలాలపాటు వినిపించే సత్తా ఉన్న వాటిని వేళ్ల మీద లెక్కిద్దామన్నా కనిపించడం లేదు. ఇళయరాజా తర్వాత కర్నాటక సంగీతాన్ని మేళవించి రాగాలు కడుతున్న సంగీత దర్శకులే లేకుండా పోయారు. కీరవాణిలాంటి వాళ్లు ఎప్పుడో ఓసారికానీ దాని జోలికి వెళ్లడం లేదు. ఈ విషయంలో మనకంటే తమిళ సినిమాలే ఉత్తమంగా కనిపిస్తున్నాయి. అడపాదడపా అయినా వారి సినిమాలు రాగయుక్తమైన పాటల్ని వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మనం రాగయుక్తమైన పాటలంటే 'శంకరాభరణం', 'సాగరసంగమం' వంటి పాతికేళ్ల కిందటి సినిమాల్నే ఉదాహరణలుగా చూపించుకోవాల్సిన దుస్థితి.
మన సంగీత శాస్త్రంలో 72 జనక రాగాలు, వాటి భేదాలతో పుట్టిన 34,848 జన్య రాగాలు ఉన్నాయంటారు. అయితే వాటిలో అత్యధిక భాగం పుస్తకాల్లోనే ఉండిపోయాయి కానీ, ఆచరణలో కనిపించవు. హనుమత్తోడి, మాయా మాళవగౌళ, వఠభైరవి, ఖరహరప్రియ, హరికాంభోజి, ధీర శంకరాభరణం, శుభపంతువరాళి, కామవర్థని, గమనశ్రమ, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమం, మేచకల్యాణి వంటి పేరుపొందిన జనక రాగాల్ని సందర్భానుసారం మన సినిమా పాటల్లో ఉపయోగించవచ్చు. జ్యోతిస్వరూపిణి రాగంతో త్యాగయ్య, మేఘరంజని రాగంతో ముద్దుస్వామి దీక్షితులు, నాగవరాళి రాగంతో చిన్నస్వామి దీక్షితులు తమ విశిష్టతను  చాటుకున్నారు. నాగయ్య 'త్యాగయ్య' సినిమా అంత గొప్ప పేరు సంపాదించుకోడానికి అందులోని పాటలు అమితంగా దోహదం చేశాయనేది నిజం. విశ్వనాథ్ 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'సిరివెన్నెల', 'శ్రుతిలయలు' వంటి చిత్రాలు జన బాహుళ్యంలోకి అంతగా వెళ్లడానికి శాస్త్రీయ సంగీతాన్ని సందర్భోచితంగా ఉపయోగించుకోవడమే ప్రధాన కారణం. ఈనాటికీ వాటిలోని పాటలు జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి కదా.
నేటి నిర్మాతలకు గానీ, దర్శకులకు గానీ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి లేకపోవడం వల్ల బీట్, వెస్ట్రన్ సంగీతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాళ్లేం అడిగితే అదివ్వడమే తమ పని కాబట్టి సంగీత దర్శకులూ ఫాస్ట్ బీట్‌లతోటే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఫలితంగా మిగతా భాషల పాటలతో పోలిస్తే తెలుగు సినిమా పాటలు నాణ్యతా ప్రమాణాలపరంగా తీసికట్టుగా ఉంటున్నాయి. ఇప్పటివరకూ సినిమా పాటల్ని పరిశీలిస్తే మెలోడీలే కలకాలం గుర్తుండిపోతున్నాయనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకులకు, నిర్మాతలకు అర్థమయ్యేట్లు చెప్పాల్సిన బాధ్యత సంగీత దర్శకుల మీద ఉంది. సినిమాలో కనీసం ఒక పాటైనా శాస్త్రీయ బాణీలతో కూడిన మేలోడీగా ఉండేట్లు ఒప్పించాలి. ఆ తర్వాత నెమ్మదిగానైనా మెలోడీలే సినిమాల్లో రాజ్యం చేసే రోజులు వస్తాయి. చెవులకు వీనుల విందుగా ఉండే ఆ పాటల వల్ల జన హృదయాలు ఉల్లాసాన్ని పొందుతాయి.

No comments: