Friday, October 30, 2015

All Eyes on BRAHMOTSAVAM

అందరి కళ్లూ 'బ్రహ్మోత్సవం' పైనే!

'శ్రీమంతుడు' వంటి కెరీర్ టాప్ ఫిల్మ్ తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా అంటే, అందరి కళ్లూ దానిపై ఉండటం సహజం. అందుకే ఇప్పుడందరూ 'బ్రహ్మోత్సవం' వైపు చూస్తున్నారు. సెట్స్‌పై వెళ్లడానికి చాలా ముందుగానే టైటిల్ పెట్టేయడం, దానికి అనూహ్యమైన పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆరంభానికి ముందే సినిమా సూపర్‌హిట్ అనే భావన ఇండస్ట్రీలోని వాళ్లలోనే కాకుండా, బయటివాళ్లలోనూ వచ్చేసింది. ఇప్పటికే మహేశ్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి కుటుంబ కథా చిత్రం వచ్చి రూ. 50 కోట్లు పైగా వసూలు చేసింది. వ్యక్తిగత జీవితంలో శ్రీకాంత్ ఆటుపోట్లు ఎదుర్కోవడం గమనించిన మహేశ్, అతనికి నైతిక మద్దతునూ, ఆత్మస్థైర్యాన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరో సినిమా చేస్తానని, మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకొమ్మని చెప్పడం కొద్దిమందికే తెలిసిన నిజం. మహేశ్ చూపించిన అభిమానంతో, ఇనుమడించిన ఉత్సాహంతో 'బ్రహ్మోత్సవం' స్క్రిప్టును సిద్ధం చేసుకొని వినిపించాడు శ్రీకాంత్. ఫస్ట్ సిట్టింగ్‌లోనే దాన్ని ఓకే చేశాడు మహేశ్. శ్రీకాంత్ మునుపటి సినిమా 'ముకుంద' ఫ్లాపైనా దానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు మహేశ్. 'బ్రహ్మోత్సవం' సబ్జెక్టును అంతగా అతను ఇష్టపడ్డాడు. ఇప్పుడు దాని షూటింగ్ లాంఛనంగా మొదలైంది. టైటిల్‌కు తగ్గట్లే ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా, కన్నుల పండువగా ఉంటుందని సమాచారం. రెండు వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్ కావడంతో, 'బ్రహ్మోత్సవం' కూడా ఘన విజయం సాధిస్తే.. రెండు వరుస విజయాలు సాధించినట్లవుతుందనీ, ఆ తర్వాత రెండో హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టొచ్చనీ మహేశ్ అభిమానులు ఆశిస్తున్నారు.

గమనిక: మహేశ్ మొదటి హ్యాట్రిక్ - 'దూకుడు' (2011), 'బిజినెస్‌మేన్' (2012), 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (2013)

No comments: