Saturday, December 1, 2012

అగ్నిపూలు (1981) - సమీక్ష


అత్యంత ప్రజాదరణ పొందిన యద్దనపూడి సులోచనారాణి నవల 'అగ్నిపూలు' ఆధారంగా అదే పేరుతో డి. రామానాయుడు నిర్మించిన సినిమాలో కృష్ణంరాజు, జయసుధ, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కె. బాపయ్య దర్శకుడు. 'అగ్నిపూలు' కథలో భిన్న దృక్పథాలు, భిన్న వ్యక్తిత్వాలు ఉన్న పాత్రలెన్నో ఉన్నాయి. అన్ని పాత్రలకీ ప్రాముఖ్యం ఉంది. ఏ ఒక్క పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా రెండున్నర గంటల సినిమాగా దీన్ని తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు బాపయ్య.
రాజులు, రాజ్యాలు పోయినా దర్పం వదలని జమీందారు గోవింద వల్లభరాజా. ఆయన కుమారుడు శివప్రసాద్ అమెరికాలో ఉంటూ అక్కడే మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జానీ, బాబీ అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలతో కలిసి తన ఇంటికి కొడుకు వస్తున్నాడని తెలిసి ఉగ్రుడైన వల్లభరాజా అతడికీ, తనకీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటిస్తాడు. ఆయన ఆస్తి మీద కన్నేసిన అల్లుడు విరూపాక్షి రాజా, కూతురు రాజేశ్వరి అగ్నికి ఆజ్యం పోస్తారు. ఇంటికి వచ్చిన శివప్రసాద్, మేరీలను ఔట్‌హౌస్‌లో ఉంచి అవమానిస్తారు. వల్లభరాజా చనిపోతే అతని మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించరు.
కాలం గడిచి, విరూపాక్షి రాజా కూడా చనిపోతాడు. అతని కొడుకు కృష్ణ చైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు. రుక్మిణి అనే అందాల భామను పెళ్లాడతాడు. ఒక ప్రమాదంలో రుక్మిణి అవిటిదవుతుంది. వల్లభరాజా భార్య అన్నపూర్ణ అభ్యర్థనపై శివప్రసాద్ పిల్లలు జానీ, బాబీలను ఇంటికి తీసుకొస్తారు. తన తల్లిదండ్రుల దారుణ మరణానికి కారకులైన విరూపాక్షి రాజా కుటుంబం మీద, ముఖ్యంగా కృష్ణ చైతన్య మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది జానీ. ఆమె చేష్టలు శాంత స్వభావుడైన కృష్ణ చైతన్యకు అర్థం కావు. జానీ దాచుకున్న డైరీ అతడికి దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది పతాక సన్నివేశాల్లో తెలుస్తుంది.
భిన్న దృక్పథాలు కలిగిని విరూపాక్షి రాజా, కృష్ణ చైతన్య పాత్రలు రెండింటినీ కృష్ణంరాజు ప్రశంసనీయంగా పోషించారు. ముఖ్యంగా విరూపాక్షి రాజాగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. పగతో రగిలిపోయే జానీ పాత్రలో జయసుధ మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. అవిటిదైన రుక్మిణిగా జయప్రద సమర్థవంతంగా నటించింది. ఆమె చేసిన సర్ప నృత్యం సినిమాకే హైలైట్. రాజేశ్వరిగా జయంతి పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. సుధాకర్, నిర్మల, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణ, సుమలత, సుభాషిణి, దిల్‌జిత్ వీర్ ఇతర పాత్రలు పోషించారు. శరత్‌బాబుకు మరికొన్ని డైలాగులు పెడితే బాగుండేది. అల్లు రామలింగయ్యపై చిత్రీకరించిన సన్నివేశాల ప్రయోజనం స్వల్పం.
జంధ్యాల మాటలు, ఆత్రేయ పాటలు, మహదేవన్ సంగీతం, వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకి నిండుదనం తెచ్చాయి. మైసూరు లలితమహల్‌ను దర్శకుడు బాపయ్య చక్కగా వినియోగించుకున్నాడు. మొత్తానికి చక్కని నవలా చిత్రాన్ని చూసిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

No comments: