Saturday, November 24, 2012

ఆడది గడప దాటితే (1980) - సమీక్ష


మన సమాజంలో పురుషునికి లేకుండా స్త్రీకి మాత్రమే కొన్ని కట్టుబాట్లు నిర్దేశించారు. గడప దాటిన స్త్రీకి అగచాట్లు, నగుబాట్లు తప్పవని చెప్పే కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. గడప దాటిన స్త్రీని సమాజం ఎంతగా హింసిస్తుందో చలం సైతం తన రచనల్లో ఎంతో సహజంగా చిత్రించాడు. ఫలానా అమ్మాయి ఇంట్లోంచి వెళ్లిపోయిందని హేళన చేయడం తేలికే. కానీ అలా వెళ్లిందంటే దాని వెనక ఎంతటి బలీయమైన కారణం ఉండి ఉంటుందని ఆలోచించేవాళ్లు బహు అరుదు. ఇదే పాయింటుతో దర్శకుడు బి.ఎస్. నారాయణ రూపొందించిన సినిమా 'ఆడది గడప దాటితే'.
కోటీశ్వరుడు రఘునందనరావు ఏకైక కుమార్తె కరుణ. రాహుల్ అనే యువకుడు, కరుణ గాఢంగా ప్రేమించుకుంటారు. కరుణ వెనకున్న ఆస్తిని చూసే ఆమెని రాహుల్ ప్రేమిస్తున్నాడనేది రఘునందనరావు నమ్మకం. రాహుల్‌ను ఇంటికి పిలిపించి అవమానిస్తాడు. అయినా కరుణ, రాహుల్ జంకరు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం తేదీ నిర్ణయించుకుంటారు. ఇంట్లోంచి వచ్చేసిన కరుణకు చిల్లిగవ్వ ఆస్తి రాదని తెలిసిన రాహుల్ మాయమైపోతాడు. రోడ్డునపడిన కరుణను ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఆదుకుంటాడు. ఆమెని నమ్మించి గుళ్లో పెళ్లి చేసుకుంటాడు. కరుణకు నెలలు నిండిన సందర్భంలో కృష్ణకు అదివరకే పెళ్లయిందనే సంగతి తెలుస్తుంది. కరుణను ఆస్పత్రిలో చేర్పించి, ఆ ఊరినుంచి బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడు కృష్ణ. మగబిడ్డను కన్న కరుణకు ఆర్టిస్ట్ మధుబాబు ఆశ్రయమిస్తాడు. తన చిత్రాలకు ఆమెను మోడల్‌గా తీసుకుంటాడు. ఆమెపై అతను ప్రేమ పెంచుకుంటున్న సమయంలోనే అతని స్నేహితుడు, కోటీశ్వరుడు ఆయిన ఆనంద్ రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నది పతాక సన్నివేశం.
కరుణగా కన్నడ మంజుల సమర్థవంతంగా నటించింది. రాహుల్‌గా నరసింహరాజు, మధుబాబుగా మురళీమోహన్, ఆనంద్‌గా శ్రీధర్ రాణించారు. జగ్గయ్య, శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్ ఇతర ప్రధాన పాత్రధారులు. యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాయగా, దాశరథి, సినారె, కోపల్లె పాటలు రాశారు. ఎం.బి. శ్రీనివాస్ కూర్చిన బాణీలు శ్రవణానందకరం. చక్కటి డ్రామాతో బి.ఎస్. నారాయణ ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారు. శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్ పతాకంపై బి. రామచంద్రరావు, ఎం.ఎం. రాజా, సి. సుబ్బారాయుడు ఈ సినిమా నిర్మించారు.

No comments: