Thursday, June 9, 2011

ఇంటర్వ్యూ: చిన్నికృష్ణ

"ఇది బాగా పులిసిపోయిన పాత చింతకాయ పచ్చడి తరహా కథ కాదు. నాకు తెలిసి భారతదేశంలోని ఏ భాషలోనూ ఇంతవరకు ఈ కథలోని 'సంఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్)తో సినిమా రాలేదు'' అని 'బద్రినాథ్' గురించి చెప్పారు కథా రచయిత చిన్నికృష్ణ. అల్లు అర్జున్, తమన్నా జంటగా వి.వి. వినాయక్ రూపొందించిన చిత్రం 'బద్రినాథ్'. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ కథ తన మనసులో ఎలా పుట్టిందనే సంగతితో పాటు ఆ సినిమాకి సంబంధించిన అనేక అంశాల గురించీ తన కార్యాలయంలో ప్రత్యేకంగా సంభాషించారు చిన్నికృష్ణ. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
'ఇంద్ర' తర్వాత మొక్కు తీర్చుకునేందుకు కాశీకి నన్ను కూడా తీసుకెళ్లారు నిర్మాత అశ్వనీదత్‌గారు. అప్పుడు గంగని చూసిన ఆనందంలో పుట్టిన కథే 'గంగోత్రి'. పెట్టుబడికి నాలుగు రెట్లు వసూలు చేసింది. ఆ సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ ఈ రోజు స్టార్‌గా ఎదగడం హ్యాపీ. ఆ సినిమా సాధించిన విజయంతో గంగమ్మ తల్లి రుణం తీర్చుకోవాలని గంగోత్రి వెళ్లా. అక్కణ్ణించి తిరుగు ప్రయాణమైనప్పుడు తల్లిని వదిలేసి వస్తున్న బాధ కలిగింది. ఆ ప్రయాణంలో అనుకోకుండా 'బద్రినాథ్' అనే పుస్తకం చదివా. హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌కి సంబంధించిన పుస్తకం అది. అందులోని ఓ విశేషం నన్ను విపరీతంగా ఆకర్షించింది. అదేమంటే అక్కడ గుడిని ఆర్నెల్లు తెరచి, ఇంకో ఆర్నెల్లు మూసి ఉంచుతారు. మూసేప్పుడు వెలిగించిన జ్యోతి తిరిగి గుడి తెరిచే దాకా ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే ఆర్నెల్ల పాటు నిరంతరాయంగా వెలుగుతుంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడాలేని అద్భుతమైన వింత! దాంట్లో నిజమెంతో తెలుసుకోవాలని తోచింది. బద్రినాథ్ వెళ్లా. ఆ గుడి మూసే సమయంలోనూ, ఆర్నెల్ల తర్వాత మళ్లీ తెరిచే సమయంలోనూ వెళ్లా. జ్యోతి వెలుగుతూ ఉంది. నిజం! అప్పుడు తట్టిన ఆలోచనతో పుట్టిన కథే 'బద్రినాథ్'.
స్వచ్ఛమైన ప్రేమకథ
హీరో బద్రినాథ్‌కి ఎందుకెళ్లాడు, హీరోయిన్ ఎందుకెళ్లింది అన్నది కథలోని భాగం. అందరూ భావిస్తున్నట్లు ఇది యాక్షన్ సినిమానో, రెండు వర్గాల మధ్య గొడవల కథనో, పక్కా మాస్ సినిమానో కాదు. ఇది అందమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ ప్రేమకథలో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అవసరం మేరకు ఉంటాయి. 'నమ్మకం' అనే ఎమోషన్‌ని ప్రధానం చేసుకుని అల్లిన కథ ఇది. నేను మొదట స్క్రిప్టులోని చివరి పేజీ రాసి, చివరగా మొదటి పేజీ రాస్తా. స్క్రిప్టు రచనలో ఇదో పద్ధతి. మొదట కేరక్టర్ అనుకుని, ఆ కేరక్టర్ చుట్టూ సన్నివేశాలల్లడం నాకు తెలీదు. మొదట విషయం నిర్ణయించుకుని, ఆ తర్వాత పాత్రల్ని సృష్టిస్తా.
వినాయక్ సరైన దర్శకుడు
నిజానికి ఈ కథ రెండు, మూడు ఆఫీసులకెళ్లి తిరిగొచ్చింది. ఒకప్పుడు నా దర్శకత్వంలోనే దీన్ని తీయాలనుకున్నా. వీలు పడలేదు. దాంతో నేను దర్శకత్వం చేయడం ముఖ్యం కాదనీ, 'బద్రినాథ్' కథ త్వరగా జనంలోకి వెళ్లడమే ముఖ్యమనీ రియలైజ్ అయ్యా. అలా వినాయక్ దర్శకత్వంలో ఇప్పుడు జనంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని మూడు సార్లు చూశా. వినాయక్ తీసినంత బాగా నేను తీసేవాణ్ణి కాదేమోననీ, వినాయక్ సరైన డైరెక్టర్ అనీ అనిపించింది. ప్రేక్షకుడికి ఓ సినిమా చూస్తున్న ఫీలింగ్ కాక, బద్రినాథ్‌లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. అంత బ్రహ్మాండంగా తీశాడు.
అర్జున్‌కి ఆకాశమే హద్దు
అర్జున్ హీరో కావడంలో చిన్నికృష్ణ పాత్ర ఎంతో ఉందని 'గంగోత్రి'ని దృష్టిలో పెట్టుకుని అంటుంటారు అల్లు అరవింద్. అర్జున్‌కి అన్ని భాషల్లోనూ స్నేహితులైన హీరోలున్నారు. ఈ సినిమా చూస్తే, వాళ్లంతా అతన్ని విపరీతంగా మెచ్చుకుంటారు. సిక్స్ ప్యాక్ శరీరాన్ని ప్రదర్శించడమే కాదు, సంకట స్థితుల్లో, భావోద్వేగ సన్నివేశాల్లో, త్యాగాన్ని ప్రదర్శించే సందర్భాల్లో, యాక్షన్ సీన్లలో 'ఆకాశమే హద్దు' అన్నట్లు చెలరేగిపోయాడు అర్జున్. పతాక సన్నివేశాల్లో అలకనంద పాత్రలో తమన్నా చేసిన అభినయం అపూర్వం. ఇప్పుడున్న వాళ్లలో ఆ పాత్రకి సరిగ్గా సరిపోయే నటి ఆమె మాత్రమే.
సమస్యా, పరిష్కారమూ...
ఇది బాగా పులిసిపోయిన పాత చింతకాయ పచ్చడి తరహా కథ కాదు. నాకు తెలిసి భారతదేశంలోని ఏ భాషలోనూ ఇంతవరకు ఈ కథలోని 'సంఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్)తో సినిమా రాలేదు. అయితే ఆ సంఘర్షణ కూడా అంతర్లీనంగానే ఉంటుంది. అంతర్జాతీయ చిత్రానువాద పద్ధతులకి (ఇంటర్నేషనల్ స్క్రీన్‌ప్లే మెథడ్స్) తగ్గట్లు నేను, వినాయక్ కలిసి స్క్రీన్‌ప్లే చేశాం. సన్నివేశాలన్నీ కొత్తగా ఉంటాయి. ఓ కొత్త సమస్యా, దానికి పరిష్కారమూ ఈ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకులు స్క్రిప్టుతో పాటు ప్రయాణిస్తారా, లేదా.. అన్న సంగతిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేశాం.
ఎన్నెన్నో విశేషాలు
ఇందులో ఎన్నో విశేషాలున్నాయి. వాటిలో ఒకటి సరస్వతి నదిని చిత్రీకరించడం. మిగతా నదులన్నీ ఎంతో దూరం నేలమీద పారుతుంటాయి. కానీ సరస్వతి నది మాత్రం భూగర్భంలో పారుతూ, భూ ఉపరితలం మీదికొచ్చి, కొద్ది దూరం తర్వాత మళ్లీ భూగర్భంలోకి వెళ్లిపోతుంది. ఈ సినిమా ఇంత గొప్పగా రావడంలో అరవింద్ బాగా ఎఫర్ట్ పెట్టారు. ఈ సినిమా ఎట్లాగైనా చెయ్యాల్సిందేనని గట్టిగా పట్టుబట్టిన వ్యక్తి మాత్రం (ఠాగూర్) మధు. స్క్రిప్టుని గట్టిగా నమ్మి ఖర్చు పెట్టారు. పెట్టిన డబ్బంతా వస్తుందనే నమ్మకం ఉంది.
దర్శకత్వం మీద దృష్టి లేదు
'నందీశ్వరుడు' నా డ్రీమ్ ప్రాజెక్టు. దాన్ని బాలకృష్ణ చెయ్యాలనేది నా కోరిక. దాన్ని నేను డైరెక్ట్ చెయ్యాలని అనుకోవట్లేదు. ఇప్పుడు నా దృష్టి డైరెక్షన్ మీద లేదు. కథలు ఇవ్వడం మీదే. 'జీనియస్' పూర్తి స్క్రిప్టుని దర్శక నిర్మాతలకి అప్పగించా. ఎప్పుడు తీస్తారనేది వాళ్ల చేతుల్లో ఉంది.

No comments: