Tuesday, November 4, 2014

General: Reforms Means Selling Assets?

సంస్కరణలంటే ఆస్తులు అమ్ముకోవడమేనా?

భారత్‌లో వ్యవసాయాభివృద్ధి కుంటుపడటంతో పారిశ్రామికాభివృద్ధి కూడా బాగా తగ్గింది. ఈ యేడాది ఫిబ్రవరిలో పారిశ్రామికాభివృద్ధి 0.2 శాతం మాత్రమే నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయి ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తూ వడ్డీరేట్లను తగ్గిస్తుందనుకున్న వారికి రిజర్వ్‌బ్యాంక్ నిరాశను మిగిల్చింది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాతి సంవత్సరంలో పారిశ్రామికాభివృద్ధి 2.4 శాతం దాటకపోవడంతో, సరళీకృత విధానాలకు పరిశ్రమలు ఇంకా అలవాటు పడలేదని ప్రభుత్వం భావించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా పరిస్థితి అంతగా మెరుగుపడలేదంటే ఆ విధానాల్నే శంకించాల్సి వుంది.
ఆధునిక పరిశ్రమలకు భారత్‌లో సుమారు 1850-1870 మధ్యకాలంలోనే పునాదులు పడ్డాయి. 1890 నాటికి భారీ పరిశ్రమలు స్థాపితమయ్యాయి. అప్పటి నుండి మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేదాకా అన్ని రంగాల్లోనూ ప్రగతి ఓ క్రమ పద్ధతిలో సాగింది. నూలు కదుళ్ల ఉత్పత్తి రెట్టింపు పైగా పెరిగింది. విద్యుచ్ఛక్తితో నడిచే మరమగ్గాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. జనపనార యంత్రాల సంఖ్య కూడా నాలుగు రెట్లు పెరగితే, బొగ్గు తవ్వకం ఆరు రెట్లు పెరిగింది.
ఏడాదికి సగటున 800 మైళ్ల పొడవుగల రైలు మార్గాలు నిర్మితమయ్యాయి. బెంగాల్‌తో పాటే దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిశ్రమలు వృద్ధిచెందాయి. భారతీయ పెట్టుబడిదారుల గుత్తాధిపత్యం కింద 19వ శతాబ్దం మధ్యకాలంలోనే నూలు బట్టల పరిశ్రమ ముఖ్యంగా బొంబాయిలో అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దం ఆరంభంలో పరిశ్రమలు మరింత అభివృద్ధిని సాధించాయి. 1886లో 95 మిల్లులు ఉంటే, 1905 నాటికి వాటి సంఖ్య 197కు పెరిగింది. అంటే ఇరవై ఏళ్ల కాలంలో పరిశ్రమలు రెట్టింపు అయ్యాయన్న మాట. ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సి ఉంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అంతర్భాగమైన భారతీయ పెట్టుబడిదారీ సంస్థలు స్వదేశంలోనే బ్రిటీష్ పెట్టుబడిదారీ సంస్థలతో సమాన స్థాయినీ, హోదానీ ఎన్నడూ అనుభవించలేదు. భారతీయ సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడానికి బదులుగా వలస పాలకులు బ్రిటీష్ పెట్టుబడిదారుల ఆదేశాల మేరకు దేశంలోని పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. అంతేకాక అనేక సంస్థల అభివృద్ధిని కుంటుపరిచారు. ఆంగ్ల-భారతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాల మధ్య స్పష్టమైన వైరుధ్యాలున్నప్పటికీ, బ్రిటన్‌లోని ప్రైవేటు పెట్టుబడిదారుల విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం బహిరంగంగానే పక్షపాత వైఖరి అవలంబించినప్పటికీ, వివిధ రంగాల్లో పరిశ్రమల అభివృద్ధి జరుగుతూనే ఉంది. రైలుమార్గాలు, రోడ్డు రవాణా, నౌకామార్గాలు వృద్ధిచెందాయి. స్వదేశీ, విదేశీ రవాణా సౌకర్యాలు మెరుగవడంతో భారతీయ ఆర్థిక, సామాజిక జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
ఇదంతా చెప్పడం ఎందుకంటే అప్పటి బ్రిటీష్‌వాళ్లు తమ అవసరాల నిమిత్తం ఇక్కడ ఎట్లా అయితే పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తూనే బ్రిటీష్, భారతీయ పారిశ్రామికులకు మధ్య పక్షపాతం చూపించారో, ఇప్పటి మన పాలకులు సైతం అదే రకమైన పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నామంటూనే ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల మధ్య పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారు. చిత్రమేమంటే అప్పుడు బ్రిటీష్ వాళ్లు తమ కంపెనీలను ప్రమోట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే ఇప్పుడు పాలకులు ప్రభుత్వ కంపెనీలను మూసేస్తున్నారు, లేదంటే  వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు! ఈ రాజకీయ నాయకుల పునరావాసానికీ, అధికారుల అక్రమాలకూ ఈ ప్రభుత్వ సంస్థలే పనికివచ్చాయి. ఫలితంగా నిలువెత్తు నష్టాల్లో కూరుకుపోయి ఆర్థిక వ్యవస్థకు అడ్డంకులుగా తయారయ్యాయి. కేంద్రానికి చెందిన 236 సంస్థల్లో పెట్టుబడి రూ. 2,30,000 కోట్లు కాగా 1998-99లో వచ్చిన లాభం రూ. 19,473 కోట్లు మాత్రమే. వీటిలో 118 సంస్థలు రూ. 5,856 కోట్ల నష్టం చూపాయి. ఖాయిలాపడిన 67 సంస్థలు ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిణమించాయి. వీటిలో 23 సంస్థల పునరుద్ధరణకు గత తొమ్మిదేళ్లుగా రూ. 34,000 కోట్లు వెచ్చించారని అంచనా. రూ. 13 వేల కోట్లతో ప్రస్తుతం మరో 14 సంస్థల మరమ్మతు కార్యక్రమం నడుస్తోంది.
ప్రభుత్వపు పెట్టుబడుల్ని క్రమంగా ప్రభుత్వ సంస్థల నుండి ఉపసంహరింప చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆదేశాలపై ప్రభుత్వమే నియమించిన 'డిజిన్వెస్ట్‌మెంట్ కమీషన్' 1997లో ఒక సలహా ఇచ్చింది. దాని ప్రకారమే 'బాల్కో' (భారత్ అల్యూమినియం కంపెనీ) షేర్లను విక్రయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన వంద శాతం వాటాను 50 శాతం కన్నా తగ్గించుకోవడం అన్నది బాల్కో షేర్ల విక్రయంతోనే మొదలయ్యింది. ఇలా ప్రభుత్వరంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరించే అంశంలో రెండు రకాల సమర్ధనలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేదుకు గాను ప్రైవేటు భాగస్వామ్యాన్నీ, యాజమాన్యాన్నీ చొప్పించడం తప్పనిసరి అనేది వీటిలో మొదటిది. ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ ఖజానాకు పెనుభారం అవుతున్నాయి కాబట్టి వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రైవేటీకరించాలనేది రెండో వాదన. నష్టాలతో నడుస్తున్న, ఆర్థిక భారంగా మారిన ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవీటీకరించడం తన లక్ష్యమనీ, లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం తన విధానమనీ మొదట తెలిపింది ప్రభుత్వం. అట్లాగే మనదేశంలోనూ అంతర్జాతీయ స్థాయి బహుళ జాతి సంస్థల్ని అభివృద్ధి చెయ్యడం తన లక్ష్యమంది. అయితే ఆచరణలో ఇవేమీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు  సంబంధించిన ఆర్థిక వ్యయ భారాన్ని తగ్గించడం గానీ, బాగా నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని దృఢపరచడంగానీ చెయ్యలేకపోతున్నాయి ప్రభుత్వ విధానాలు.
బడ్జెట్ లోటును పూడ్చుకోడానికి లాభాల బాటలో నడుస్తున్న సంస్థల వాటాలను అమ్మివేయడమే ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అంతర్జాతీయ స్థాయికి ఎదగనీయడం అనేది కేవలం వట్టిమాట అనడానికి - గత ఎనిమిదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మడమే నిదర్శనం. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కీలక స్థానాల్లోకి ప్రమోట్ చెయ్యడానికి బదులుగా ఆ సంస్థల్ని జాతీయ, అంతర్జాతీయ పోటీదారులకు కుదువబెడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తాల్ని అందించిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఒసి, ఓఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్, భారత్ పెట్రోలియం, సెయిల్, మద్రాస్ రిఫైనరీస్, బిహెచ్ఇఎల్, కొచ్చిన రిఫైనరీస్, ఐపిసిఎల్, ఎంటిఎన్ఎల్ వంటి వాటిని బడ్జెట్ లోటును పూడ్చుకునే మిషతో ప్రైవేట్‌పరం చెయ్యాలని ప్రభుత్వం చూస్తోంది. యాజమాన్య సంస్కరణలంటూ, స్వచ్ఛంద పదవీ విరమణలంటూ, ప్రభుత్వరంగ సంస్థలకు మరింత స్వయం ప్రతిపత్తి అంటూ పెద్ద పెద్ద ఆదర్శాల్ని - ప్రైవీటీకరణకు సాకుగా చెబుతోంది. నిజ లక్ష్యం మాత్రం ఆ సంస్థల ఆస్తులను అమ్మివేయడమే. 1991-92 సంవత్సరంలో ప్రైవీటీకరణ ద్వారా రూ.2,500 కోట్ల రూపాయల ఆర్జనను లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం 1999-2000 నాటికి దాన్ని రూ.పదివేల కోట్లకు పెంచింది.
నిజానికి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు దేశంలో బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాయి. విదేశీ బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు 'గిఫ్ట్'గా తక్కువ ధరలకు అమ్మివేస్తున్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని పెట్టుబడులు అనేక సంవత్సరాల పాటు చెమటోడ్చి కష్టపడిన శ్రమజీవుల కష్టఫలాలే. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్‌పరం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వరంగ పరిశ్రమల్లో వాటాల అమ్మకాన్ని ద్రవ్యలోటుతో ముడిపెట్టడాన్ని పునరాలోచించాలి. లాభాలు సంపాదిస్తోన్న ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాల్ని అమ్మకూడదు. ఆ సంస్థల్ని అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు కృషిచేయాలి. కనీసం 51 శాతం వాటాల్ని అమ్మకుండా యాజమాన్యాన్ని బదలాయించకూడదు. వాటాల్ని కొనుగోలుచేసే మొదటి అవకాశాన్ని వాటి ఉద్యోగులకే ఇవ్వాలి.

- వార్త దినపత్రిక, 26 జూలై 2001


No comments: