Saturday, November 8, 2014

Cinema: Best Performances of Kamal Hassan

నడిచే నట పాఠశాల

భారతీయ చిత్రసీమలోని సమకాలీన నటుల్లో కమల్‌హాసన్ చేసినన్ని విలక్షణమైన, వైవిధ్యమైన పాత్రలు మరే నటుడూ చేయలేదనేది నిర్వివాదం. ఆయన వయసు అరవై అయితే, ఆయన సినీ కెరీర్ వయసు యాభై నాలుగేళ్లు. బాలనటునిగా కేవలం ఆరేళ్ల వయసులో నటించిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్న ఘన చరిత్ర ఆయనది. అప్పట్నించీ ఇప్పటిదాకా ఆయన పోషించిన ఎన్నో పాత్రలు మన హృదయల్లో సుస్థిర స్థానాన్ని పొందాయి. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమంటే ఏమిటో ఇప్పటి నటులు ఆయనను చూసే నేర్చుకోవాలి. దక్షిణాదిన కానీ, ఉత్తరాదిన కానీ సూపర్‌స్టార్లు ఎంతోమంది ఉండోచ్చు కానీ, కమల్ వంటి గ్రేట్ యాక్టర్లు ఒకరిద్దరు కంటే కనిపించరు. నిజానికి కమల్‌కు సాటిరాగల నటుడు ఈ కాలంలో ఎవరున్నారనీ!

జాతీయ ఉత్తమ నటుడు 

1960లో వచ్చిన తమిళ చిత్రం 'కళత్తూర్ కన్నమ్మ' సినిమాతో ఆరేళ్ల వయసులో బాలనటునిగా పరిచయమయ్యారు కమల్. అందులో జంటగా నటించిన జెమినీ గణేశన్, సావిత్రి కొడుకు పాత్రను ఆయన పోషించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడిగా ఉన్నత స్థాయి నటనను ప్రదర్శించి ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డు అందుకున్నారు కమల్. కథానాయకుడిగా ఎదిగాక ఆయన మరో మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పొందారు. వాటిలో మొదటిది 'మూండ్రం పిరై' (1982). బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'వసంత కోకిల'గా అనువాదమైంది. రెండు భాషల ప్రేక్షకుల హృదయాలనూ పిండేసింది ఈ సినిమా. మతిస్థిమితం కోల్పోయిన శ్రీదేవికి అండగా నిలిచి, ఆమెకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడి, ఆమె మామూలు మనిషయ్యాక తనను గుర్తుపట్టకపోతే విలవిల్లాడిపోయిన స్కూల్ టీచర్‌గా కమల్ ప్రదర్శించిన అభినయం అపూర్వం. రైల్వే స్టేషన్‌లో శ్రీదేవికి తానెవరో స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో ఆమెకు ఇష్టమైన కోతి చేష్టలన్నీ చేస్తే, అతను మానసిక రోగి అయిన భిక్షగాడేమోనని ఆమె భావించే క్లైమాక్స్ సీన్ ఎంతటి కఠిన హృదయులనైనా కదిలించి వేస్తుంది. ఆ సన్నివేశం చూసి దు:ఖపడని వాళ్లు ఒక్కరూ లేరు. భారతీయ సినిమాలో ఓ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న 'నాయకన్' (1987 - తెలుగులో 'నాయకుడు') ఆల్‌టైం 20 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఒకప్పటి బొంబాయి చీకటి సామ్రాజ్య చక్రవర్తి వరదరాజ మొదలియార్ జీవితం ప్రేరణతో మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో కథానాయకుడు వేలు నాయకర్ పాత్రలో కమల్ నటనా విన్యాసాలు చూసి తీరాల్సిందే. ఈ పాత్రతో ఆయన మరోసారి ఉత్తమ నటునిగా జాతీయ అవార్డు అందుకునారు. ఆ అవార్డును ఆయన చివరిసారి అందుకున్న చిత్రం 'ఇండియన్' (1996 - తెలుగులో 'భారతీయుడు'). దేశంలో అన్ని రంగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు కమల్. ప్రధానంగా స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన సేనాపతి అనే డెబ్భై ఏళ్ల వృద్ధుడి పాత్రను ఆయన పోషించిన తీరు అనన్యసామాన్యం.

అమావాస్య చంద్రుడు 

కథానాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన తర్వాత కూడా ఇమేజ్ అనేదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు కమల్. ప్రధానంగా కె. బాలచందర్, కె. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకులు ఆయనలోని నటుణ్ణి ప్రపంచం ముందు గొప్పగా ప్రదర్శింపజేశారు. వందో చిత్రమంటే ఏ నటుడికైనా మైలురాయే. అలాంటి వందో చిత్రంలో ఏ హీరో గుడ్డివాని పాత్రతో రిస్క్ చేస్తాడు, కమల్ తప్ప! ఆ సినిమా 'రాజా పార్వై' (1981 - తెలుగులో 'అమావాస్య చంద్రుడు'). సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రంలో ఓ అందమైన క్రిస్టియన్ యువతి (మాధవి) ప్రేమలో పడిన అంధ వయొలినిస్ట్‌గా నటించి, మెప్పించారు కమల్. ఇక అదే దర్శకుడు తీసిన 'పుష్పక విమానం' (1987) గురించి చెప్పేదేముంది. 1930ల కాలంలోని మూకీ సినిమాల తరహాలో ఎలాంటి సంభాషణలూ లేకుండా పాత్రల సైగలతోటే నడిచే నిశ్శబ్ద చిత్రమిది. ఇందులో కమల్ ప్రదర్శించే హావభావాలు ఔత్సాహిక నటులకు పాఠాలు. సీఎన్ఎన్-ఐబీఎన్ రూపొందించిన వంద గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది ఈ చిత్రం. సింగీతమే రూపొందించిన 'అపూర్వ సహోదరగళ్' (1989 - తెలుగులో 'విచిత్ర సోదరులు') బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తను స్వయంగా నిర్మించిన ఇందులో తండ్రిగా, ఆయన ఇద్దరు కవల పిల్లలుగా త్రిపాత్రలు చేశారు  కమల్. ముఖ్యంగా తండ్రి మరణానికి కారకులైన వాళ్లపై పగతీర్చుకునే మరుగుజ్జు అప్పు పాత్రను ఆయన పోషించిన తీరు సినిమాకు హైలైట్. ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా మరుగుజ్జుగా కనిపిస్తూ నటించడానికి ఆయన పడిన విపరీతమైన కష్టం అనితర సాధ్యం.

సాగర ముత్యం 

కె. విశ్వనాథ్, కమల్ కాంబినేషన్ గొప్పగా రాణించింది. అందుకు చక్కని ఉదాహరణలు 'సాగర సంగమం' (1983), 'స్వాతిముత్యం' (1986). సంగీత నృత్య దృశ్యకావ్యంగా రూపొందిన 'సాగర సంగమం' సీఎన్ఎన్-ఐబీఎన్ వంద గొప్ప భారతీయ చిత్రాల్లో స్థానం పొందింది. శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతుడైన బాలకృష్ణగా కమల్ అభినయం అసామాన్యం. నీళ్లబావిపై నిల్చుని ఆయన చేసే నాట్యం సినిమాకే హైలైట్. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చొని స్టేజిపై శైలజ నృత్యాన్ని చూస్తూ ఆయన చనిపోయే సన్నివేశం గుండెను బరువు చేసేస్తుంది. ఇక వయసు పెరిగినా, మెదడు ఎదగని శివయ్య అనే అమాయక గ్రామీణ యువకునిగా కమల్ నటించిన చిత్రం 'స్వాతిముత్యం'. దేశంలోనే తానెందుకు అత్యుత్తమ నటుడో మరోసారి ఆయన ప్రపంచానికి నిరూపించిన పాత్ర శివయ్య. ఈ సినిమా తర్వాత నిష్కల్మష హృదయుణ్ణి 'వాడు స్వాతిముత్యంరా' అనడం పరిపాటి అయ్యింది. అది ఆ పాత్ర, ఆ పాత్ర పోషణలో కమల్ సాధించిన విజయం.

మరో చరిత్ర 

కె. బాలచందర్ రూపొందించిన ప్రేమకావ్యం 'మరో చరిత్ర' (1978) టైటిల్‌కు న్యాయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్రను సృష్టించింది. ఆ కాలం కుర్రకారు ఈ సినిమాను ఎన్నిసార్లు చూశారో! ఒక క్రిస్టియన్ మతానికి చెందిన తెలుగమ్మాయి ప్రేమలోపడ్డ తమిళ బ్రాహ్మణ యువకుడు బాలు పాత్రలో యువతరానికి ప్రతినిథిగా కమల్ అత్యుత్తమ నటన ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఇదే సినిమాను కమల్‌తోటే 'ఏక్ దూజే కే లియే'గా హిందీలో రీమేక్ చేశారు బాలచందర్. ఈ రెండు చిత్రాలూ సీఎన్ఎన్-ఐబీఎన్ జాబితాలో స్థానం పొందడం విశేషం. మహాకవి శ్రీశ్రీ అభిమానిగా కమల్ కనిపించే చిత్రం 'ఆకలి రాజ్యం' (1981). డెబ్భైల చివరి నాళ్లనుంచీ, ఎనిమిదో దశకం వరకు దేశంలోని యువతను నిరుద్యోగం ఎంతగా బాధించిందనే దానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలనుకుని భంగపడే నిరుద్యోగిగా కమల్ ప్రదర్శించిన అభినయాన్ని మరచిపోవడం కష్టం. అదివరకు కమల్‌తో తనే తీసిన తమిళ చిత్రం 'వారుమయిన్ నీరం శివప్పు'కు రీమేక్‌గా దీన్ని రూపొందించారు బాలచందర్. 

మహానది 

నటునిగా కమల్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో 'మహానది' (1994)ని ప్రస్తావించకపోతే ఈ వ్యాసం అసమగ్రం అవుతుంది. ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేసిన '25 గ్రేటెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమా'లో ఈ చిత్రంలో కమల్ పోషించిన పాత్ర చోటు పొందిందంటేనే, ఆ పాత్రను ఆయన ఏ రీతిలో పోషించారో అర్థం చేసుకోవచ్చు. బీభత్స రస ప్రధానంగా దర్శకుడు సంతాన భారతి రూపొందించిన ఈ చిత్రంలో భార్యను కోల్పోయిన ఇద్దరు పిల్లల తండ్రి కృష్ణస్వామిగా కనిపిస్తారు కమల్. స్నేహితుని వంచనకు గురై జైలుపాలై, బయటకు వచ్చాక కనిపించకుండా పోయిన పిల్లల కోసం అన్వేషించే తండ్రిగా కమల్ ప్రదర్శించిన నటన వర్ణనలకు అందనిది. ముఖ్యంగా కలకత్తాలోని వ్యభిచారవాడ సోనాగచ్చిలో ఉన్న కూతురిని వెతుక్కుంటూ, అక్కడకు వెళ్లి మొదటిసారి ఆమెను కమల్ చూసే సన్నివేశం భారతీయ సినిమాలోని అత్యంత హృదయ విదారక సన్నివేశాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. దానితో పాటు మరికొన్ని సన్నివేశాలు, ఆ సన్నివేశాల్లో కమల్ అభినయం మనల్ని చాలా కాలం వెంటాడుతూనే ఉంటాయి.
ఇవే కాకుండా తమిళ చిత్రాలు 'అవల అప్పడిదన్' (1978), 'మైఖేల్ మదన కామ రాజన్' (1990), 'గుణ' (1991), 'అన్బే శివం' (2003), 'విరుమాండి' (2004), 'దశావతారం' (2008), తెలుగు చిత్రాలు 'ఇంద్రుడు చంద్రుడు' (1989), 'శుభసంకల్పం' (1995), హిందీ చిత్రాలు 'సాగర్' (1985), 'హే రాం' (2000) వంటివి కూడా కమల్ విలక్షణ నటనా సామర్థ్యానికి మెచ్చు తునకలు.

(నవంబర్ 7 కమల్‌హాసన్ షష్టి పూర్తి సందర్భంగా)

No comments: