Wednesday, April 9, 2014

Movie Review: Saradala Samsaram (1997)

ఇదెక్కడి సరదా? ఇదెక్కడి సంసారం?

దర్శకత్వం: సాయిప్రకాశ్
నిర్మాత: ఉషశ్రీ మారెడ్డి
తారాగణం: సురేశ్, రుచిత, నరసింహరాజు, గోకిన రామారావు, ప్రసాద్‌బాబు, సుబ్బరాయశర్మ

మంచి పనులు చేయడానికి గూండాగిరీ, రౌడీయిజం చేయడంలో తప్పులేదనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రేక్షకులపై బలవంతాన రుద్దే ప్రయత్నం చేసింది 'సరదాల సంసారం' చిత్రం. 'అమ్మ' చిత్రాల సెంటిమెంటుని వదిలించుకుని 'సంసారం' గొడవలో పడ్డ దర్శకుడు సాయిప్రకాశ్ అసహజమైన కథాంశాన్ని తీసుకుని పొరపాటు చేశాడని అనిపిస్తుంది.
మిత్ర చతుష్టయం అనే సూర్య (సురేశ్) అండ్ కో గూండాయిజం చేసి డబ్బు సంపాదించడమే 'సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్' కింద పెట్టుకున్నారు. వాళ్లకో ఆఫీస్ సైతం ఉంది. ఒకానొకరోజు ఓ రోమియో బారినపడ్డ జయ (రుచిత) తారసపడ్తుంది సూర్యకి. రోమియో ఫోన్లమీద ఫోన్లు చేస్తూ జయని చికాకు పెడ్తుంటాడు. సూర్య ఆ రోమియోకి తన మిత్ర బృందంతో తన్నుల సన్మానం చేశాక సూర్య ప్రేమని అంగీకరించి తన లాయర్ అన్నయ్య (నరసింహరాజు) ఇష్టానికి వ్యతిరేకంగా అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది జయ. సూర్య తమ్ముడు చంద్రం (కొత్త నటుడు) ఎం.ఎ. ఫస్ట్ క్లాస్‌లో పాసవుతాడు. డబ్బు సంపాదించడానికి తన అన్న అనుసరించే మార్గాన్ని చంద్రం అసహ్యించుకుంటూ ఉంటాడు. నిజాయితీగా ఉద్యోగం సంపాదించాలని భావిస్తాడు. ఆ క్రమంలో సూర్య రికమెండ్ చేసిన ఉద్యోగాన్ని కూడా తిరస్కరిస్తాడు. అయితే అతడు ఎక్కడికి వెళ్లినా 'నో వేకన్సీ' బోర్డు దర్శనమిస్తుంటుంది. లేదంటే లంచం ఇవ్వమనైనా అడుగుతుంటారు. ఆఖరికి విసిగిపోయిన చంద్రం వదిన జయ ఇచ్చిన నగలతో ఉద్యోగం సంపాదించాలని వాటిని తనకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపిన బ్రోకర్ (సుబ్బరాయశర్మ) చేతిలో పెడతాడు. అయినా ఆ ఉద్యోగం అతడికి రాదు. బ్రోకర్ చేతిలో తను మోసపోయానని అర్థమైన చంద్రం కుమిలిపోయి అన్నా వదినలకి తన ముఖం చూపలేక ఫ్యానుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తమ్ముడి చావు, జయ మాటలతో పరివర్తన చెందిన సూర్య మారిపోతాడు. మెకానిక్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆఖరుకి కంపెనీ ఎండీ మృదుల అతణ్ణి పార్టనర్‌గా కూడా చేర్చుకుంటుంది. జయ మరదల్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారని తెలియడంతో సూర్య ఆ రౌడీల్ని చితకతన్ని వేశ్యాగృహంలో ఉన్న జయ మరదల్ని రక్షించి ఆ వేశ్యాగృహంలోనే తన మిత్రబృందంలోని రాజుతో ఆమె పెళ్లి చేస్తాడు. గతంలో సూర్య చేతిలో దెబ్బలు తిన్నవాళ్లంతా అతడి అంతు చూడాలని ఓ 'ఇంటర్నేషనల్' గూండా (ప్రసాద్‌బాబు)కి డబ్బు చెల్లిస్తారు. అయితే అతణ్ణి కూడా మిత్ర చతుష్టయం చిత్తుగా చావగొడ్తుంది. మరోపక్క జయ మృదులతో తన భర్త సరస సల్లాపాలు సాగిస్తున్నాడనే భ్రమలోపడి విషం తాగుతుంది. ఆఖరికి ఎట్లాగో బతికి సూర్యని అతడి పూర్వపు మార్గాన్నే అంటే గూండాగిరినే కొనసాగించమనడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలచింది సుస్పష్టమే. గూండాల్లోనూ మంచి గూండాలుంటారనీ, రౌడీయిజం తప్పుకాదనీ ఆయన చెప్పదలచుకున్నాడు. ఈ నేపథ్యంలో కథంతా అసహజంగా తయారయింది. మనకి ఎక్కడా కనిపించని కొత్త తరహా గూండా సూర్య పాత్రలో మనకి దర్శనమిస్తాడు. అతడికి మనుషుల్ని చావగోట్టడమే కాకుండా తెగ జోకులు వేయడం, సరసం చేయడం కూడా బాగా తెలుసు. భార్యని ప్రేమగా "బుజ్జిముండా ఇంతందంగా ఎందుకు పుట్టావే" అంటూ ఉంటాడు. ఇంట్లో ఉన్నంతసేపూ ఆమెని క్షణం వదలడు. ఆమెని సుఖపెట్టడం కోసం తాపత్రయపడిపోతుంటాడు. గూండాకి ఉండని అసహజమైన ప్రత్యేకతలెన్నో కలిగి ఉన్న సూర్య పాత్రని సురేశ్ తనదైన శైలిలో బాగా పోషించాడు. శృంగారం, హాస్యం మేళవించిన సన్నివేశాల్లో బాగా రాణించాడు. రుచిత ఓ వైపు గ్లామర్‌ని కురిపించి, మరోవైపు నటననీ ప్రదర్శించింది. శృంగారం వొలికించడానికి కూడా ఆమె పాత్ర పనికొచ్చింది. సూర్య తమ్ముడు చంద్రంగా నటించిన కొత్త నటుడు మంచి నటననే చూపించాడు. మిగతా నటులంతా సోసోగానే అనిపించారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. దుగ్గిరాల సంగీతం ఫర్వాలేదు. సంభాషణల విషయంలో రచయిత దురికి మోహనరావు శృంగార సన్నివేశాల్లో అత్యుత్సాహం ప్రదర్శించాడని చెప్పాలి. కామెడీ సంభాషణల్లో కొన్ని బిట్లు ఆకట్టుకున్నాయి. నిర్మాత ఉషశ్రీ మారెడ్డి పాటలకి సాహిత్యాన్ని కూడా అందించారు. అయితే కథలో పట్టు లేకపోవడం, కథనంలో లోపాలు, పేరున్న నటులు లేకపోవడం మైనస్ పాయింట్లు. గూండాగిరీని అంగీకరించడం చిత్రం మొత్తం మీద పెద్ద తప్పు. సమాజంపై ప్రభావం చూపే వాటిలో సినిమా మాధ్యమం ఒకటి. ఈ విషయాన్ని సినిమా వాళ్లు విస్మరిస్తూ ఉండటం మన అనుభవంలోనిదే. 'ప్రేక్షకులు చూస్తున్నారు (ఆదరిస్తున్నారు) కాబట్టే మేం తీస్తున్నాం' టైపు చిత్రంగా 'సరదాల సంసారం'ని పేర్కొనవచ్చు. అయితే ఈ చిత్రానికి ఆదరణ ఉంటుందా అంటే ఉండదనేదే జవాబు.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 1 ఆగస్ట్ 1997

No comments: