Tuesday, March 25, 2014

Classic novels rule the Hollywood

హాలీవుడ్: క్లాసిక్స్‌కి భలే మంచి కాలం
హాలీవుడ్‌లో క్లాసిక్స్‌కి ఆదరణ పెరిగిందా? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జేన్ ఆస్టిన్, షేక్‌స్పియర్, థామస్ హార్డీ, హెన్రీ జేమ్స్‌ల క్లాసిక్ నవలలు హాలీవుడ్‌లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఈ నవలల ఆధారంగా డబ్బు చేసుకోవచ్చునని భావిస్తున్న వాళ్లు సినీ పరిశ్రమలో పెరుగుతున్నారు.
ఈ ఏడాది (1997) అందరూ అత్యంత ఆసక్తితో ఎదురుచూసిన సినిమా జేన్ ఛాంపియన్ తీసిన 'ద పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ'. ఇదే పేరుతో హెన్రీ జేమ్స్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రధాన పాత్రలో నికోల్ కిడ్మన్ నటించింది. ఇటువంటిదే బీబీసి నిర్మించిన 'జ్యూడ్ ది అబ్స్‌క్యూర్'కి థామస్ హార్డీ నవల మాతృక. అత్యధిక శాతం మంది ప్రశంసలు పొందిన ఈ చిత్రంలో కథానాయికగా సౌందర్యరాశి కేట్ విన్‌స్లెట్ అద్భుతంగా నటించింది. ఇప్పుడు అందరి కళ్లూ భారీ తారాగణంతో కెన్నెత్ బ్రానా తీస్తున్న సినిమాపైనే ఉన్నాయి. షేక్‌స్పియర్ మహోన్నత నాటకం 'హామ్లెట్' ఆధారంగా రూపొందిస్తుండటమే దీనికి కారణం.
1996లో హాలీవుడ్‌లో అటు విమర్శనా పరంగా కానీ, ఇటు వ్యాపారాత్మకంగా కానీ అత్యంత ఆదరణ పొందినవి ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ సినిమాలు, సిల్వెస్టర్ స్టాలోన్ సినిమాలు కాదు. గ్వినిత్ పాల్ట్రో ప్రధాన పాత్ర ధరించగా జేన్ ఆస్టిన్ నవల ఆధారంగా తీసిన 'ఎమ్మా', ఇంగ్లీష్ రంగస్థల నటుడు ఇయాన్ మెకెల్లన్ టైటిల్ రోల్‌లో ఉత్తమంగా నటించిన 'రిచర్డ్ 3' (షేక్‌స్పియర్ నవల ఆధారం), ఫ్రాంకో జఫరెల్లి తీసిన 'జేన్ ఐర్' (చార్లెట్ బ్రాంటే నవల ఆధారం) చిత్రాలు అత్యధిక ప్రజాదరణ పొందాయి. ఇవన్నీ క్లాసిక్ సినిమాలే. ఇంట్లాంటి దృశ్యమే రెండేళ్ల కిందట కూడా మనకి కనిపించింది. ఎమ్మా థామ్సన్ అద్భుత నటనను చూసేందుకే అందరూ 'సెన్స్ అండ్ సెన్సిబిలిటీ' సినిమాని చూసేందుకు ఎగబడ్డారంటే అతిశయోక్తి కాదు. జేన్ ఆస్టిన్ నవల ఆధారంగా రూపొందిన 'పర్సుయేషన్' చిత్రాన్ని కూడా జనం బాగా ఆదరించారు. ఆ తర్వాత బీబీసి సొంతంగా నిర్మించి తన ఛానల్లో ప్రదర్శించిన 'ప్రైడ్ అండ్ ప్రెజుడీస్'ని కోట్లాది మంది ఇళ్లల్లో కూర్చునే చూశారు.
కొద్ది సంవత్సరాలుగా అనేక క్లాసిక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడాన్ని మనం గమనించవచ్చు. 'ది ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్', 'రాబ్‌రాయ్', 'హెన్రీ 4', 'మచ్ అడో అబౌట్ నథింగ్', 'హోవార్డ్స్ ఎండ్' వంటి సినిమాలు ఇందుకు నిదర్శనం. జేన్ ఆస్టిన్ తర్వాత 1997లో థామస్ హార్డీ, హెన్రీ జేమ్స్ కథలకి హాలీవుడ్‌లో సమాన స్థాయిలో ఆదరణ లభిస్తోంది.
ప్రేక్షకుల్లో ఉన్నట్లుండి క్లాసిక్స్ పట్ల ఆసక్తి ఎందుకు పెరిగింది? క్లాసిక్స్ స్క్రిప్టులు ఉత్తమంగా ఉండటం ఓ కారణమని హాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఏదైనా పుస్తకాన్ని చదవడం కంటే క్లాసిక్‌ని చూడటం హాయనిపించడం కూడా కారణం కావచ్చు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. స్పెషల్ ఎఫెక్టులూ, హింసా చూసీ చూసీ ప్రేక్షకులు అలసిపోయారు. సినిమా థియేటర్‌కి వెళ్లి టెన్షన్ ఫీలవడానికి వాళ్లిప్పుడు ఇష్టపడటం లేదు. ప్రశాంతంగా, నరాలపై ఎట్లాంటి ఒత్తిడీ లేకుండా సినిమాలు చూడాలనుకుంటున్నారు వాళ్లు. క్లాసిక్స్ వల్ల తమ పిల్లలకీ ఎంతో కొంత విజ్ఞానం చేకూరుతుందని కూడా భావిస్తున్నారు. స్టూడియో ఎగ్జిక్యూటివ్‌లు కోట్ల కొద్దీ డాలర్లు పెట్టి తీసే భారీ చిత్రాలకి పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు వాళ్ల్లు ఆఫీసుల్లో బొమ్మా, బొరుసూ వేసుకుని క్లాన్సీ సినిమాకో, బ్రాంటే సినిమాకో ఫైనాన్స్ చేయాలని ఆశిస్తున్నారు. చాలా సందర్భాల్లో నవలలకంటే కూడా వాటి ఆధారంగా తీసిన చిత్రాలే ఎక్కువ ఆదరణ పొందడం చిత్రంగా అనిపించినా వాస్తవం. జాన్ గ్రీషం నవల 'ది ఫర్మ్' కంటే దాని ఆధారంతో సిడ్నీ పొలాక్ తీసిన సినిమా ఎక్కువ ప్రశంసలు అందుకున్నది.
ఫిలిప్ నాయిస్ నవల 'క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్'ని టాం క్లాన్సీ సమర్థవంతంగా టెక్నో థ్రిల్లర్‌గా తెరకెక్కించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఫ్రాంక్ దారబంట్ తాను తీసిన చిత్రం 'ది షాషంక్ రిడెంప్షన్'ని దాని మాతృక అయిన స్టీఫెన్ కింగ్ నవలని ఇంప్రూవ్ చేసి నిర్మించాడు. జోనాథన్ డెం సినిమా 'ద సైలెన్స్ ఆఫ్ ద లాంబ్స్', రాబర్ట్ జేమ్స్ వాలర్ సినిమా 'ద బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కంట్రీ' కూడా ఇదే కోవకి చెందుతాయి.
సంవత్సరాలపాటు నవలలని నిర్లక్ష్యం చేసిన హాలీవుడ్ ఎట్టకేలకు సరైన దారిలోకి వచ్చింది. సాహిత్యానికిప్పుడక్కడ గౌరవం పెరిగింది. మంచి స్క్రిప్టుకీ, సృజనాత్మక ప్రతిభావంతుడైన స్క్రీన్ రైటర్‌కీ ప్రాముఖ్యత లభిస్తోంది. ఇవాళ క్లాసిక్స్‌ని ప్రాక్టికల్ దృష్టితో నిజాయితీగా, ప్రతిభావంతంగా స్క్రీన్ రైటర్లు సినిమాల కోసం తయారు చేస్తున్నారు. ఐతే ఇదే సమయంలో నవలలోని థీంని, పాత్రల్నీ మార్చివేయడమే కాక ముగింపుని కూడా మార్చేస్తున్నారు. కొన్ని కొన్ని పాత్రల్ని ఐతే పూర్తిగా తీసేస్తున్నారు. దీన్ని సినిమాపరమైన ఇంద్రజాలంగా పరిగణిస్తున్నారు. మిలన్ కుందేరా నవల 'ది అన్‌బీటబుల్ లైట్‌నెస్ ఆఫ్ బీయింగ్'ని సినిమాగా తీయాలనుకున్న దర్శకుడు ఫిలిప్ కాఫ్‌మన్ సినిమా కోసం చాలా మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పినప్పుడు రచయిత ఖంగుతిన్నాడు.
అయితే విమర్శకులు మాత్రం దర్శకుల్ని సమర్థిస్తున్నారు. "ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసేవాళ్లు నవలలో మార్పులు చేర్పులు చేస్తే తప్పేంలేదు" అని న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు జనెట్ మస్లిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇట్లా నవలలోని పాత్రల్ని, సన్నివేశాల్ని మార్చివేసి తీసే సినిమాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఆస్ట్రేలియన్ డైరెక్టర్ బజ్ లార్మన్ రూపొందించిన 'రోమియో అండ్ జూలియట్'పై వివాదాలు చెలరేగాయి. పాత్రల స్వభావాన్నే మార్చారనే విమర్శలు వచ్చాయి. పైగా చిత్రంలో కళ్లు మిరుమిట్లుగొలిపే భారీ సెట్టింగులు వేశారు. ఎంటీవీ తరహాలో అట్టహాసంగా ఈ సినిమాని నిర్మించారన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఈ విమర్శలూ, వివాదాలూ పక్కనపెడితే మొత్తంగా క్లాసిక్ నవలలకి ఆదరణ బాగా పెరిగిందనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు ఆదరించినంత కాలం ఈ ఆరోగ్యకర వాతావరణం హాలీవుడ్‌లో కొనసాగుతుంది.
- ఆంధ్రభూమి 'వెన్నెల', 8 ఆగస్ట్ 1997

No comments: