Sunday, January 8, 2012

అలనాటి చిత్రం: సీతా కల్యాణం (1934)

సీత కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతా కల్యాణం'. మచిలీపట్నంలోని 'మినర్వా సినిమా' థియేటర్ యజమాని అయిన పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్‌ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది. 
కథ: లోక కల్యాణం కోసం విశ్వామిత్ర మహర్షి ఓ గొప్ప యాగాన్ని చేయ సంకల్పించి, అందరు ఋషులకూ ఆహ్వానం పంపాడు. ఆ యాగానికి రావణాసురుని అనుయాయులైన రాక్షసుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో, యాగ రక్షణకు శ్రీరాముడు ఎలా తోడ్పడగలడో యోగదృష్టితో తెలుసుకొని రాముని కోసం అయోధ్యకు వెళ్లాడు. అదే సమయంలో రామునికి వివాహం చేయాలని దశరథుడు సంకల్పించాడు. యాగ రక్షణ నిమిత్తం రాముని తనతో పంపమని దశరథుని కోరాడు విశ్వామిత్రుడు. పుత్రుని మీద అతి ప్రేమతో దశరథుడు వెనుకాడుతుంటే వశిష్టుడు అభయమిచ్చాడు. దశరథుడు అంగీకరించక తప్పలేదు. రామునితో లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుని వెంట వెళ్లాడు. మార్గ మధ్యమున వారికి అస్త్రశస్త్రాల్ని ఉపదేశించాడు విశ్వామిత్రుడు. ఆయన ఆజ్ఞతో సోదరులిరువురు రాక్షసి అయిన తాటకిని సంహరించారు. 
మరోవైపు మిథిలలో సీతకు యుక్తవయసు వచ్చిందని గ్రహించి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు జనక మహారాజు. బాల్యంలోనే శివ ధనువును సీత ఎత్తడంతో ఆ ధనస్సును వంచినవానికే ఆమెనిచ్చి వివాహం చేస్తానని స్వయంవరం చాటాడు. 
విశ్వామిత్రుడు యాగాన్ని ఆరంభించాడు. దానిని నాశనం చేయడానికి వచ్చిన మారీచ సుబాహులనే రాక్షసుల్ని సంహరించాడు రాముడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తవడంతో రామలక్ష్మణులను తీసుకొని మిథిలకు పయనమయ్యాడు విశ్వామిత్రుడు. మార్గమధ్యంలో రాముని పాదము సోకి రాయిలా పడివున్న అహల్యకు శాప విమోచనమయ్యింది. 
సీతా స్వయంవరానికి అనేకమంది రాజులు వచ్చారు. రావణుని సహా ఒక్కరూ శివ ధనస్సును ఎత్తలేకపోయారు. రాముడు సునాయాసంగా ధనువునెత్తి దాని విరిచి, సీతను పరిణయమాడాడు. విషయము తెలిసి అయోధ్యా నగర ప్రజ సీతారామ కల్యాణమును తిలకించుటకు మిథిలకు వెళ్లింది. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులకు సీత, ఊర్మిళ, మాండవ, శ్రుతకీర్తులనిచ్చి వైభవంగా వివాహం చేశాడు జనకుడు.
తారాగణం: మాస్టర్ కల్యాణి (శ్రీరాముడు), రాజారత్నం (సీత), మాధవపెద్ది వెంకట్రామయ్య (విశ్వామిత్రుడు), నెల్లూరు నాగ రాజారావు (దశరథుడు), గోవిందరాజుల వెంకట్రామయ్య (జనకుడు), తీగల వెంకటేశ్వర్లు (రావణుడు), నాగేశ్వరరావు (లక్ష్మణుడు), కమలకుమారి (అహల్య), సూరిబాబు (గౌతముడు), కృత్తివెంటి వెంకట సుబ్బారావు (మారీచుడు), లంక కృష్ణమూర్తి (సుబాహుడు), శ్రీహరి (కౌసల్య), రామతిలకం (కైకేయి), కోకిలామణి (సుమిత్ర)
పాటలు, సంగీతం: గాలిపెంచల నరసింహారావు
సినిమాటోగ్రఫీ: కె. రామనాథ్
సెట్టింగ్స్ (ఆర్ట్): శేఖర్
నిర్మాత: పినపాల వెంకటదాసు
దర్శకుడు: చిత్రపు నరసింహారావు
బేనర్: వేల్ పిక్చర్స్ 

No comments: