Wednesday, January 4, 2012

చూడాల్సిన సినిమా: అపోకలిప్స్ నౌ (1979)


1970వ దశకం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పొలాది. ఆ దశాబ్దంలో వచ్చిన గొప్ప సినిమాల్లో ఆయన పాత్ర ఉంది. 'పేటన్' స్క్రీన్‌రైటర్, 'అమెరికన్ గ్రాఫిటి' నిర్మాత, 'గాడ్‌ఫాదర్' తొలి రెండు సినిమాలు, 'ద కన్వర్‌జేషన్' దర్శకుడు ఆయనే. ఆ తర్వాత 1979లో ఆయన దర్శకత్వం నుంచి వచ్చిన మరో ఆణిముత్యం 'అపోకలిప్స్ నౌ'. అది వియత్నాం అనుభవం నుంచి పుట్టిన గొప్ప సినిమా మాత్రమే కాదు, మన కాలపు క్రూరత్వం ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పిన మాస్టర్‌పీస్ కూడా.
ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'అపోకలిప్స్ నౌ' ప్రీమియర్ అయ్యాక జరిగిన ప్రెస్ కాన్‌ఫరెన్స్‌లో "నాది వియత్నాం గురించి తీసిన సినిమా కాదు. నా సినిమాయే వియత్నాం" అని చెప్పాడు కొప్పోలా. వలసవాద క్రూరత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జోసఫ్ కాన్రాడ్ విశిష్ట నవల 'హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్' ఆధారంగా ఆయన ఈ సినిమాని ఒళ్లు జలదరింపజేసే విధంగా సెల్యులాయిడ్‌పై చిత్రించాడు. అమెరికన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ బెంజమిన్ విల్లార్డ్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఒకప్పుడు అమెరికన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ సభ్యుడై, తర్వాత క్రూరుడిగా మారి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కంబోడియాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న కల్నల్ వాల్టర్‌ని పట్టుకునే పనిని చేపట్టిన విల్లార్డ్ అందులో విజయం సాధించాడా, లేదా అన్నది కథ. 
విల్లార్డ్‌గా మార్టిన్ షీన్, వాల్టర్‌గా మార్లన్ బ్రాండో పోటాపోటీగా నటించిన ఈ సినిమాలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ బిల్ కిల్‌గోర్ పాత్రలో రాబర్ట్ డువాల్ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించాడు. లారెన్స్ ఫిష్‌బర్న్, డెన్నిస్ హాపర్, హారిసన్ ఫోర్డ్, ఫ్రెడరిక్ ఫారెస్ట్, శాం బాటమ్స్ నటించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ డాలర్లను ఆర్జించింది. 
ఆ యేడాది ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండింగ్ అకాడమీ (ఆస్కార్) అవార్డుల్ని పొందిన ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పాం డీఓర్ అవార్డును చేజిక్కించుకుంది. 

No comments: