Monday, April 4, 2011

కవిత: ఓ తెలు'గోడు'!

కలత చెందమాకే అమ్మా!
క్షేమమేనే నేను
అయ్యాళ 'మాకు తప్పలేదు,
నీకెందుకురా మగ్గం గుంట?
హైద్రాబాదెళ్లి ఉద్యోగమేదన్నా చేసుకో' అంటా
బలవంతంగా తరిమావ్
ఇయ్యాళ 'నాన్నా! హైద్రాబాదులో
ఒకటే గొడవలంట కదరా
నీకేమవ్వుద్దోనని బయంగా ఉందిరా' అంటా
కలవరపడ్తున్నావ్
అప్పుడు తరిమిదీ నువ్వే
ఇప్పుడు భయపడ్తోందీ నువ్వే

అయినా నువ్వు మాత్రం కలగన్నావా
రోజులిట్లా మారతాయనీ
ఇన్నేళ్ల తర్వాత
నువ్వెందుకు వొణికిపోతున్నావో
నాకు తెలుస్తానే ఉందమ్మా
ఇయ్యాళ విగ్రహాలు పడగొట్టినోళ్లు
రేపు మనుషుల్ని కొట్టకుండా ఉంటారా?
ఇది నీ ప్రశ్న
నీలాంటి అమ్మలందరి ప్రశ్న

ఈ నగరానికొచ్చినప్పుడు
నేనున్నది తెలంగాణ అనీ
అది నాది కాదనీ తెల్వదే అమ్మా
ఈ ఆంధ్ర, తెలంగాణ
పంచాయితీ ఏందో అస్సలు తెల్వదే
'మన హైద్రాబాద్' అనుకునే
నువ్వు పంపిచ్చావు.. నేనొచ్చానే
'సీమాంధ్ర' అంటా
ఓ కొత్తమాటని పలుకుతున్నారే
నిన్న మొన్నటిదాకా
భుజం మీద చేతులేసి తిరిగిన
నా తెలంగాణ మిత్రులు
ఇయ్యాళ అదోరకంగా, అపనమ్మకంగా
నావంక చూస్తున్నారే
వాళ్లేమన్నా పడాలంటనే
నేను చేసిన తప్పేందే అమ్మా!

తెలంగాణ కోసం కొట్లాడాల్సింది
కూటి కోసం వచ్చిన
మామూలు జనంతో కాదనీ
అధికారం చేతుల్లో పెట్టుకుని
తమ లాభం మాత్రమే చూసుకునే,
మనుషుల మధ్య ప్రాంతీయ ద్వేషాలు రగిల్చే
ఓటు రాజకీయాలు చేసే వాళ్లతోననీ
తెలిసినోళ్లు కూడా
తెలీనట్లు ఊరుకుంటున్నారే

కులం ఓ మత్తు
మతం మరింత మత్తు
ఇయ్యాళ 'ప్రాంతం' లేదంటే 'స్థానికం'
మహా మహా మత్తు అయిపోతోందే
'మీరేమిట్లు?' నుంచి 'మీదే ఊరు?' కాడికి
వొస్తున్నారే జనం
'మనమంతా భారతీయులం' ఒట్టిమాట
ఇయ్యాళ ఫలానా రాష్ట్రీయులం
రేపు ఫలానా జిల్లా వాళ్లం
ఎల్లుండి ఫలానా ఊరోళ్లం
ఆవులెల్లుండి ఫలానా వీధోళ్లం
ఆ తర్వాత రోజు పక్కింటోడూ
మన శత్రువేనమ్మా

ఎవడి అస్తిత్వం వాడిదే
ఎవడి బలం వాడిదే
బలవంతుడిదే రాజ్యమమ్మా
భయపడమాకే అమ్మా
నాకు మంచితనం మీదా
మనిషితనం మీదా నమ్మకం పోలేదే
ఈ రోజుకైతే క్షేమమేనే నేను!

-ఆంధ్రజోతి డైలీ, ఏప్రిల్ 1, 2011

No comments: