Friday, April 1, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఆది

తారాగణం: ఎన్‌టీఆర్, కీర్తి చావ్లా, రాజన్ పి. దేవ్, చలపతిరావు, రఘుబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, రాజీవ్ కనకాల, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, నారాయణరావు, సంగీత, హరిత, బెంగుళూరు పద్మ, రమ్యశ్రీ, మాస్టర్ నందన్, విజయ్, ప్రసన్నకుమార్, చిత్రం శ్రీను
మాటలు: పరుచూరి బ్రదర్స్
పాటలు: చంద్రబోస్, భువనచంద్ర, పోతుల రవికిరణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
కూర్పు: గౌతంరాజు
స్టంట్స్: విక్రం ధర్మా
నృత్యాలు: రాఘవేంద్ర లారెన్స్, అమ్మ రాజశేఖర్, ప్రదీప్ ఆంథోని
కళ: పార్థసారథి వర్మ
డీటీఎస్ మిక్సింగ్: మధుసూదన్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
నిర్మాత: పి. నాగలక్ష్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి. వినాయక్
బేనర్: శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
నిడివి: 2.30 గంటలు
విడుదల తేది: 28 మార్చి 2002

కేవలం పద్దెనిమిదేళ్ల కుర్రాడు సినిమానంతా తన భుజాల మీద మోసి. 'ఆది'గా బాక్సాఫీసు వద్ద చెలరేగిన తీరు చూసి ముక్కుమీద వేలేసుకుని ఆశ్చర్యపడని వాళ్లు లేరు. ఆ కుర్రాడు జూనియర్ ఎన్‌టీఆర్. తాత నందమూరి తారక రామారావు పేరునే పెట్టుకున్న అతను మొదట 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయమై, పరాజయాన్ని పొందాడు. కానీ రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1'తో ప్రేక్షకుల మన్ననల్ని పొందడంలో విజయం సాధించాడు. ఇక మూడో సినిమా 'ఆది'తో స్టార్ హీరో అయిపోయాడు (గుణశేఖర్ రూపొందించిన 'రామాయణం'ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే అప్పటికి ఎన్‌టీఆర్ బాలనటుడు). వి.వి. వినాయక్ అనే ఇరవై ఆరేళ్ల కొత్త దర్శకుడు ఎలా గమనించాడో ఏమో కానీ, ఎన్‌టీఆర్‌లోని మాస్ పొటెన్షియాలిటీని వెలికితీసి, ప్రపంచానికి తొలిగా రుచి చూపించాడు. అందుకే 2002 మార్చిలో విడుదలైన ఆ చిత్రం ఆ ఇద్దరి కెరీర్‌కి బంగారు బాట వేసింది. 105 కేంద్రాల్లో విడుదలైన 'ఆది' అన్ని కేంద్రాల్లోనూ యాభై రోజులు, 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం విశేషం కాక మరేమిటి! కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో రూపొందించిన ఆ చిత్రం ఏకంగా పాతిక కోట్ల రూపాయల్ని వసూలు చేసి, ఆ ఘనతని సాధించిన తొలి తెలుగు చిత్రంగా బాక్సాఫీసు చరిత్రకెక్కింది! అంటే వ్యయానికి పది రెట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాడు 'ఆది'.
అలాంటి 'ఆది'కి బీజం ఎలా పడింది? "నేను 'చెప్పాలని ఉంది' సినిమాకి కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరైన బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) నన్ను కథ చెప్పమన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శివుని బొమ్మ దగ్గర కూర్చొని ఓ కథ చెప్పా. అది ఆయనకి బాగా నచ్చింది. అప్పట్లో సినీ పాత్రికేయుడిగా ఉన్న నేటి సినీ గేయ రచయిత భాస్కరభట్ల రవికుమర్‌ని పిలిచి 'మా బేనర్‌లో తర్వాతి సినిమాని వినయ్‌తో చేస్తున్నామ'ని చెప్పాడు బుజ్జి. నేను భాస్కరభట్లతో నా పేరుని వి.వి. వినాయక్‌గా రాయమని చెప్పా. నేను బుజ్జికి కథ చెప్పింది 'ఆనందం' హీరో ఆకాశ్‌ని దృష్టిలో పెట్టుకుని. మేం 'చెప్పాలని వుంది' పాటల కోసం స్విట్జర్లాడ్ వెళ్లినప్పుడు అప్పటికే 'స్టూడెంట్ నెం.1' పాటల కోసం అక్కడ ఉన్నాడు ఎన్‌టీఆర్. బుజ్జి అతనితో నా గురించి చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక నా కథ విన్నాడు. నచ్చిందని చెప్పాడు. అయితే తర్వాత లవ్ స్టోరీ కాకుండా మంచి మాస్ కథ ఉంటే చెప్పమన్నాడు. మాస్ స్టోరీకి సంబంధించి, నా మనసులో రెండు సీన్లు మాత్రమే ఉన్నాయి. కానీ వచ్చిన అవకాశం పోతుందేమోననే టెన్షన్‌లోనే రెండంటే రెండు రోజుల్లో అరవై సీన్లతో కథ తయారుచేశా. ఆ కథ చెప్పగానే ఉద్వేగానికి గురయ్యాడు ఎన్‌టీఆర్. 'అన్నా. ఈ కథతో మనం సినిమా చేస్తున్నాం' అన్నాడు. అలా 'ఆది' తెరమీదకి వచ్చింది" అని చెప్పుకొచ్చారు వి.వి. వినాయక్.
తన తల్లిదండ్రుల్ని తలనరికి కిరాతకంగా హత్య చేసిన నాగిరెడ్డి అనే ఫ్యాక్షనిస్టుపై ప్రతీకారం తీర్చుకునే 'ఆది'కేశవరెడ్డి అనే రాయలసీమ కుర్రాడిగా ఎన్‌టీఆర్ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాడు. 'పిట్ట కొంచెం కూత ఘనం' నానుడిని నిజంచేస్తూ ఆ సినిమాతో అతను అగ్ర యువ కథానాయకుల్లో ఒకడిగా పేరుపొందాడు. ఒక కొత్త దర్శకుడిలోని కసికీ, మాస్ హీరోగా తాత పేరుని నిలబెట్టాలనే ఓ కుర్రాడి తాపత్రయానికీ దక్కిన ఈ విజయంలో అప్పట్లో 'పీక్ స్టేజ్'లో ఉన్న మణిశర్మ సంగీతానికీ ప్రధాన భాగముంది. అతని సినీ జీవితంలో ఎన్నదగిన పాటల్లో ఒకటైన 'నీ నవ్వుల తెల్లదనాన్నీ నాగమల్లీ అప్పడిగిందీ ఇవ్వొద్దూ ఇవ్వొద్దూ' పాట ఈ చిత్రంలోనిదే. ఆ పాట జాలువారింది చంద్రబోస్ కలం నుంచి. ఈ చిత్రంలోని భావోద్వేగపూరిత డైలాగులు కూడా బాగా పాపులర్. ఎన్‌టీఆర్ నోట పలికిన 'తలదించే వంశంలో పుట్టలేదురా. తొడగొట్టే వంశంలో పుట్టా', 'అరవకు. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా' వంటి డైలాగులకి థియేటర్లలో మోగిన చప్పట్లు చాలామందికి జ్ఞాపకముండే ఉంటాయ్.
కథాసంగ్రహం
అమెరికా నుంచి కడపకు వచ్చిన వీరారెడ్డి (ఆహుతి ప్రసాద్)తో అతనికి చెందిన భూములన్నింటినీ నాగిరెడ్డి (రాజన్ పి. దేవ్) ఆక్రమించేశాడనీ, ఈ వేల ఎకరాల బంజరు భూమిని పేదలకిస్తే తమ చెమటని చిందించి, ఈ నేలను తడిపి, నాలుగు మెతుకులు తింటారనీ చెబుతాడు ఎర్రన్న (చలపతిరావు). సరేనంటాడు వీరారెడ్డి. అయితే ఈ భూముల్ని పేదోళ్లకి పంచిపెడితే, రాజకీయంగా తనకు పుట్టగతులు వుండవని భావించిన నాగిరెడ్డి ఓ రాత్రివేళ దాడిచేసి వీరారెడ్డినీ, అతని భార్యనీ తలనరికి చంపేస్తాడు. పిల్లవాడైన ఆదికేశవరెడ్డిని తీసుకుని హైదరాబాద్ పారిపోతాడు ఎర్రన్న. హత్యానేరాన్ని వీరారెడ్డి మనుషులపైనే మోపి, వాళ్లని జైలుపాలు చేస్తాడు నాగిరెడ్డి.
పన్నెండేళ్లు గడిచిపోతాయి. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆది (ఎన్‌టీఆర్), నందిని (కీర్తి చావ్లా) ప్రేమలో పడతారు. కడప జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ మనుషుల వద్దకు ఆదిని తీసుకుపోతాడు ఎర్రన్న. అతడి తల్లిదండ్రుల్ని నాగిరెడ్డి ఎట్లా చంపి, తమ మీద నెరం మోపి, జైలుపాలు చేశాడో చెబుతారు వాళ్లు. నాగిరెడ్డిని అప్పుడే చంపాలన్నంత ఆవేశానికి గురవుతాడు ఆది. నందిని ఎవరో కాదు, నాగిరెడ్డి కూతురనే సంగతి తెలిసి, బాధపడతాడు. ఆమెని మరచిపోదామనుకుంటాడు. కానీ ఏ పాపమూ తెలీని ఆమె ప్రేమని వొదలొద్దని చెబుతాడు ఎర్రన్న.
తండ్రికి ఆదితో తన ప్రేమ సంగతి చెబుతుంది నందిని. అతణ్ణి రమ్మనమనీ, తనకి నచ్చితే పెళ్లి చేస్తాననీ అంటాడు నాగిరెడ్డి. నందిని చెప్పడంతో కడపకు వస్తాడు ఆది. అతణ్ణి తండ్రికి పరిచయం చేస్తుంది నందిని. "వాహ్. ఏం తేజస్సు బిడ్డా. కోహినూర్ వజ్రం గురించి వినడమే కానీ ఎప్పుడూ చూళ్లేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. బాగా నచ్చావ్" అంటాడు నాగిరెడ్డి. అప్పుడు "నా పేరు ఆదికేశవరెడ్డి" అంటాడు ఆది. అతడి తాత పేరు కూడా అదే. తనెవరో తెలిసిన నాగిరెడ్డితో "నేనెవరో తెలిశాక నీ పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా, చెయ్యకపోయినా నీ పరువుకి తాళికట్టేది నేనే" అంటాడు ధైర్యంగా. విజయదశమి వరకు టైమిస్తున్నాననీ, ఈలోపు తన ఆస్తులు మొత్తం తనకు అప్పగించమనీ, లేదంటే ఎనిమిదేళ్ల వయసులోనే బాంబులు వేసిన తనకు ఇప్పుడెయ్యడం పెద్ద కష్టం కాదనీ హెచ్చరిస్తాడు. పాడుబడిపోయిన తమ ఇంటికి వెళ్తాడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి తామంతా అతని వెనకాల ఉంటామని చెబుతారు.
నందినికి పులివెందుల నుంచి ఓ సంబంధం మాట్లాడుకుని వస్తాడు నాగిరెడ్డి. ఆది వద్దకు రాత్రి పూట వస్తుంది నందిని. అది తెలిసి అక్కడకు వస్తాడు నాగిరెడ్డి. అతడి ముందే ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకుంటాడు ఆది. ఇంటికెళ్లాక తనని చంపినా ఆది మీద ప్రేమపోదని తండ్రితో అంటుంది నందిని. ఆమె రమ్మంటున్నదని తప్పుడు సమాచారమిచ్చి, ఒక్కణ్ణే రప్పించి, ఎర్రన్నని చంపుతారు నాగిరెడ్డి ప్రధాన అనుచరుడైన గంగిరెడ్డి (రఘుబాబు), అతని మనుషులు. తను బాబాయ్‌గా పిలుచుకునే తన సర్వస్వమైన ఎర్రన్నని చంపడంతో మహోగ్రుడవుతాడు ఆది. తల్లిని తండ్రి మెడకొరికి చంపబోతుండటంతో అతడు చూసిన సంబంధం చేసుకుంటానని ఏడుస్తుంది నందిని. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు నాగిరెడ్డి. పెళ్లి వేదిక వద్దకు వస్తాడు ఆది. పెళ్లికొడుకు తాళి తీసుకుని వచ్చి, ఆదికి ఇస్తాడు. ఆదిని పిస్టల్‌తో పొట్టమీద కాలుస్తాడు నాగిరెడ్డి. కానీ చలించని ఆది అతణ్ణి బతికుండగానే అప్పటికే అతడి కోసమే తవ్వించిన గుంటలో పడేస్తాడు. మొదటగా నాగిరెడ్డి భార్యాకొడుకులే అతడి మీద మట్టిపోస్తారు. జనమంతా అతణ్ణి సజీవ సమాధి చేసేస్తారు.

శతదినోత్సవం చెయ్యకపోవడం వెలితి
-నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
దివంగత ఎన్‌టీ రామారావు అంటే నాకు విపరీత అభిమానం. అదే పేరున్న ఆయన మనవడు నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' విడుదలైనప్పుడు మనోడు కదా, ఎలా చేశాడో చూద్దామని వెళ్లా. క్లైమాక్సులోని ఎమోషనల్ సీన్‌ని అతడు చేసిన తీరుకి చాలా ఆశ్చర్యమేసింది. అతడితో సినిమా తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మేం తీసిన 'చెప్పాలని ఉంది' సినిమాకి వినయ్ (వి.వి. వినాయక్) కో-డైరెక్టరుగా పనిచేశాడు. చాలా తక్కువ కాలంలో నాకు సన్నిహితమయ్యాడు. అతడు చెప్పిన కథ నచ్చి, దాన్ని ఎన్‌టీఆర్‌కి చెప్పించా. అది అతనికి నచ్చింది కానీ మాస్ కథ కావాలన్నాడు. అప్పుడు వినయ్ 'ఆది' కథ చెప్పాడు. వెంటనే ఓకే అనేశాడు ఎన్‌టీఆర్.
క్లైమాక్స్ సీన్ చేసేప్పుడు గాజు ముక్క కోసుకుని ఎన్‌టీఆర్ కుడి చేతికి పెద్ద గాయమైంది. చాలా రక్తం పోయింది. అతను మొండోడు. చేతికి కట్టు కట్టుకుని మిగతా సీన్లు చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్టయి, దీని మీద ఆధారపడిన చాలా మంది జీవితాల్ని నిలబెట్టింది. ఎన్‌టీఆర్ స్టామినా ఏమిటో లోకానికి తెలిపింది. 98 సెంటర్లలో వంద రోజులు నడిచింది. వినయ్‌కీ, బెల్లంకొండ సురేశ్‌కీ, నాకూ మంచి బ్రేక్‌నిచ్చింది. అయితే శతదినోత్సవం జరపకపోవడం ఇప్పటికీ నా జీవితంలో వెలితిగానే అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో యాక్టర్లు గానీ, టెక్నీషియన్లు గానీ వినయ్ కోరుకున్నవాళ్లే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వినయ్ సినిమా. మొత్తం స్క్రిప్టు అతనిదే. పరుచూరి బ్రదర్స్‌కి డైలాగ్ రైటర్స్‌గా క్రెడిట్ ఇచ్చినా, డైలాగ్ వెర్షన్ సహా అంతా తనే తయారుచేసుకున్నాడు. అందుకే ఈ సినిమా క్రెడిట్ అంతా అతనిదే. ఎన్‌టీఆర్‌తో అతని కాంబినేషన్‌ని కుదిర్చిన ఘనత మాత్రం నాది.
అల్లరి చేసే పద్దెనిమిదేళ్ల వయసులో ఎన్‌టీఆర్ 'ఆది'గా ఏం చేశాడండీ! అతను పెద్దాయన (దివంగత ఎన్‌టీఆర్) అంశతోనే పుట్టాడని అనిపిస్తుంటుంది. అన్ని సీన్లూ సింగిల్ టేక్‌లో చేసేవాడు. 'ఆది'కి పనిచేయడం 'ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్'.
(వచ్చే వారం 'ఆది' విజయానికి దోహదం చేసిన అంశాలు)

No comments: