Friday, November 24, 2023

రివ్యూలతో బెంబేలెత్తుతున్న నిర్మాతలు?!

సినిమా బాగుంటే, కాలం కలిస్తొస్తే బాక్సాఫీస్ దగ్గర దాని విజయాన్ని ఎవరూ ఆపలేరు. మౌత్ టాక్‌తోటే వాటికి కాసుల వర్షం కురుస్తుంది. అయితే, ఇటీవలి కాలంలో వెబ్‌సైట్లలో, యూట్యూబ్ చానళ్లలో వచ్చే రివ్యూస్ వల్ల తమ సినిమాలు నష్టపోతున్నాయని కొంతమంది నిర్మాతలు తలలు బాదుకుంటున్నారు. రివ్యూలు తమ సినిమాల కలెక్షన్ రాతల్ని మార్చేస్తున్నాయని వారు వాపోతున్నారు. 

రీసెంట్‌గా జరిగిన సినిమాల ఈవెంట్లలో ఈ రివ్యూల గురించిన డిబేట్ జర్నలిస్టులకు, దర్శక నిర్మాతలకు మధ్య చోటుచేసుకుంటూ వస్తోంది. 'కోటబొమ్మాళి పి.ఎస్.' మూవీ ఈవెంట్‌లో కొంతమంది జర్నలిస్టులను స్టేజి మీద కూర్చోబెట్టి కింద నుంచి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, బన్నీ వాస్, డైరెక్టర్ సాయిరాజేశ్ ఈ రివ్యూల విషయంలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. సినిమా రిలీజైన వెంటనే ఇస్తున్న నెగటివ్ రివ్యూల వల్ల వాటి కలెక్షన్లు ఎఫెక్ట్ అవుతున్నాయని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సినిమాలకు కూడా 4 పైన రేటింగ్ ఎందుకు ఇవ్వట్లేదని సాయిరాజేశ్ అడిగారు. రిలీజైన మూడు రోజుల తర్వాత రివ్యూ ఇస్తే ఈలోపు తమ సినిమాకు రావాల్సిన కలెక్షన్లు వస్తాయని, ఆ తర్వాత రివ్యూ ఇచ్చినా తమకు పెద్ద బాధ ఉండదనీ రాజు చెప్పుకొచ్చారు.

అలాగే 'ఆదికేశవ' సినిమా ఈవెంట్‌లో ఆ మూవీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సినిమా రిలీజైన రోజునే రివ్యూ ఇవ్వకుండా ఆ తర్వాత రోజు ఇస్తే బాగుంటుందని జర్నలిస్టులకు సూచించాడు. సినిమా బాగాలేదని ఇచ్చే రివ్యూల వల్ల వాటిని చూసిన సినీప్రియులు ప్రభావితమవుతున్నారనీ, తద్వారా థియేటర్లకు రావట్లేదనేది ఆయన ఆవేదన. 

అంటే రివ్యూల ఎఫెక్ట్ నిర్మాతల్నీ, దర్శకుల్నీ బాధపెడుతోందని, భయపెడుతోందని స్పష్టమవుతోంది. నిజానికి రివ్యూ ఉద్దేశం, లేదా ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది. సినిమా చూసిన సమీక్షకుడు ఆ సినిమా ఎలా ఉందో తన కోణం నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కథా కథనాలు ఎలా ఉన్నాయి, ప్రధాన పాత్రలను ఎలా చూపించారు, సన్నివేశాలు ఎలా ఉన్నాయి, టెక్నికల్‌గా సినిమా ఎలా ఉంది? అంతిమంగా దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాడు? సినిమాలో మంచి ఎక్కువ ఉందా? చెడు ఎక్కువ ఉందా?.. అనే అంశాల్ని తన రివ్యూ ద్వారా సమీక్షకుడు విశ్లేషిస్తాడు. వాటిని బట్టి ప్రేక్షకుడు ఆ సినిమాకి వెళ్లవచ్చా, లేదా అనేది నిర్ణయించుకుంటాడు. ప్రేక్షకుల అభిరుచిని పెంపొందింపజేయడం కూడా ఇక్కడ సమీక్షకుడి బాధ్యత. మితిమీరిన హింస, సెక్స్‌తో కూడిన సినిమాని దర్శకుడు భావోద్వేగాలతో, బావోద్రేకాలతో నింపి తీయవచ్చు. ఇలాంటి సినిమాకి కాసుల వర్షం కురియవచ్చు. కానీ ఈ తరహా సినిమాల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత రివ్యూయర్‌కు ఉంటుంది. సినిమాని బాధ్యతారాహిత్యంతో తీశారని రివ్యూయర్ రాసినప్పటికీ, ఆ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టవచ్చు. బాక్సాఫీస్ ఫలితానికీ, రివ్యూయర్ చెప్పిన దానికీ పొంతన లేకపోవచ్చు. అంతమాత్రాన రివ్యూయర్ చెప్పింది తప్పైపోదు.

సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుందనేది అందరికీ తెలిసిన నిజమే. ఎన్నో మంచి కథలతో వచ్చిన సినిమాలను జనం ఆదరించకపోవడం మన చూశాం. స్టార్ హీరోలు చేసిన సినిమాలను కూడా జనం రిజెక్ట్ చేశారు. మంచి కథలతో చిరంజీవి చేసిన 'ఆరాధన', 'ఆపద్బాంధవుడు' లాంటి సినిమాల్ని జనం ఎందుకు చూడలేదు? ఒక్క చిరంజీవే కాదు, చాలామంది స్టార్ల మంచి సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినంతమాత్రాన అవి చెడ్డ సినిమాలు కావని అందరూ ఒప్పుకుంటారు. అలాగే కథపరంగా గొప్పగాలేని సినిమాలెన్నో హిట్టయ్యాయి. కారణం, వాటిలోని భావోద్వేగాల్ని రేకెత్తించే సన్నివేశాలు. 'దొంగ' అనే నెగటివ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలెన్ని సక్సెస్ కాలేదు! 'ఇడియెట్', 'పోకిరి' లాంటి టైటిల్స్‌తో వచ్చిన సినిమాల్ని బ్లాక్‌బస్టర్స్ చేశారు జనం. ఆ టైటిల్స్‌ని రివ్యూయర్స్ ఆక్షేపించినా వాటి కలెక్షన్లు అదిరిపోయాయి.

కొన్నేసి సినిమాలను విడుదలైనప్పుడు పట్టించుకోని జనం, వాటి రివ్యూస్‌ను చూసి థియేటర్లకు వెళ్లిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలోనే రైటర్ పద్మభూషణ్, బలగం, సామజవరగమన, మేం ఫేమస్, మ్యాడ్ లాంటి సినిమాలు ఆడటానికి రివ్యూలు దోహదం చేశాయనేది ఇండస్ట్రీ వాళ్లకు తెలియని విషయం కాదు కదా! అలా అని రివ్యూయర్స్ మెచ్చుకున్న అన్ని సినిమాలూ ఆడతాయనేది కూడా నిజం కాదు. అలా ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

ఒక విషయం మాత్రం స్పష్టం. సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే, అది ప్రజలది అయిపోయినట్లే. దాని మీద రివ్యూ చెప్పే, రాసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఫలానా సమయంలోనే రివ్యూ ఇవ్వాలని చెప్పే అధికారం ఎవరికీ ఉండదు. సోషల్ మీడియా యుగంలో అసలుకే ఉండదు. సినిమా కానీ, ఇంకేదైనా కానీ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే, దానిపై తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు దానంతట అదే వస్తుంది. సినిమా తియ్యడం దర్శక నిర్మాతల పని ఎలాగో, రివ్యూ ఇవ్వడం సమీక్షకుడి పని. ఒక సినిమా ఎలా ఉందో చెప్పి, ఆడియెన్స్‌ను అలెర్ట్ చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు రివ్యూయర్.ఈ విషయాన్ని సినీ దర్శక నిర్మాతలు గుర్తించి, రివ్యూల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా తమ సినిమాల క్వాలిటీపై మరింత దృష్టిపెడితే బాగుంటుంది. అప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ రేటూ పెరుగుతుంది.

No comments: