Saturday, June 3, 2017

Profile of writer Veeturi

వీటూరి పూర్తి పేరు వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి. 1933 జనవరి 3న విజయనగరం దగ్గరలోని రెల్లివలస గ్రామంలో జన్మించారు. తొలిగా శోభన్‌బాబు సినిమా 'భక్త శబరి' చిత్రంలో కొన్ని పద్యాలు రాశారు. వై.ఆర్. స్వామి దర్శకత్వం వహించిన 'స్వర్ణగౌరి' సినిమాకు పూర్తి స్థాయి రచయితగా కథ, మాటలు, పాటలు రాశారు. ఆయనకు మంచి పేరునిచ్చి వెలుగులోకి తెచ్చిన సినిమాలు 'బంగారు తిమ్మరాజు', 'తోటలో పిల్ల కోటలో రాణి'. వీటిలో మొదటి సినిమాలో రాసిన 'నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన' పాట పెద్ద హిట్. 'దేవత', 'శ్రీరామకథ', 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న', 'పొట్టి ప్లీడరు', 'మల్లమ్మ కథ' తదితర చిత్రాల్లో పాటలు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన తొలిపాట 'ఏమీ ఈ వింత మోహం' (మర్యాదరామన్న) గీత రచయిత వీటూరే. 'చిక్కడు దొరకడు', 'కదలడు వదలడు', 'సప్తస్వరాలు', 'గుండెలు తీసిన మొనగాడు', 'రాజసింహ', 'రాజయోగం', 'కత్తికి కంకణం', 'వీరపూజ', 'ఆకాశరామన్న', 'భక్త తుకారాం', 'వినాయక విజయం', 'మంగళగౌరి' చిత్రాలకు రచన చేశారు. 'దేవత' చిత్రంలో ఒక పాటకు వీటూరి పల్లవి రాస్తే, చరణాలను శ్రీ శ్రీ రాశారు. అది - 'బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక' పాట. విజయలలిత పిక్చర్స్ పతాకంపై కాంతారావు హీరోగా 'అదృష్టదేవత' చిత్రాన్ని నిర్మించి చేతులు కాల్చుకున్నారు. కృష్ణంరాజు, భారతి జంటగా 'భారతి' చిత్రానికి దర్శకత్వం వహించి విఫలమయ్యారు. 1984లో వీటూరి కన్నుమూశారు.

No comments: