Sunday, July 3, 2016

Poetry: Handloom

మగ్గం ఆడుతుంటే...

రోజంతా మగ్గం ఆడుతున్న చప్పుడు వింటాను
ఆ బక్కపలుచని చెక్కల నిర్మాణం ఎంత సుందరం!
నిలువుగా రెండు.. అడ్డంగా రెండు..
ఉక్కు కండల చేతులూ కాళ్లలా.. చెక్కలు!!
ఒక చేత్తో పలక, ఇంతో చేత్తో పిడి..
మగ్గంలో కూర్చున్న నాన్నని అపురూపంగా చూస్తుంటాను
లయబద్ధంగా నాట్యం చేస్తున్న నటరాజే జ్ఞాపకమొస్తాడు
పోగు పక్కన ఇంకో పోగు - పడుగు
పోగు మీద ఇంకో పోగు - పేక
సొరుగుల్లోంచి చకచకా అట్నించి ఇటు తిరిగే నాడి
వడివడిగా దూసుకొచ్చే జలతారు పోగులు
ఒక పావుచెక్క కిందికి దిగితే
ఇంకో పావుచెక్క పైకి లేస్తుంది
అచ్చులో సగం పోగులు కిందికీ
ఇంకో సగం పోగులు పైకీ
పోగులు చిక్కుబడకుండా
కచ్చిబద్దలు కాపలా కాస్తుంటాయి సైనికుల్లాగా
బట్ట బిగువు సడలిపోకుండా
చేళ్లు చేతులు చాపి పట్టుకుంటాయి రక్షకుల్లాగా
బుటా తర్వాత ఇంకో జరీ బుటా
సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు
పడుగు పైన పట్టు పాగళ్లు
గుడ్డమీద రంగుల సీతాకోకలవుతుంటాయి
నెమ్మదిగా చీకటి చిక్కనవుతుంటే
కిరసనాయిలు బుడ్డీలు
మగ్గం రెండుపక్కలా వెలుగుతాయి
మగ్గం చప్పుడు ఆగదు
పడుగు-పేక పరిమళాలు వదలవు
పదకొండు కొట్టేదాకా మగ్గం విశ్రమించదు
ఒక దోనె ఖాళీ అవుతుంటే
ఇంకో దోనె నిండు కుండవుతుంటుంది
ఒక తాను పుట్టాక
ఇంకో తాను పురుడు పోసుకోవడం మొదలవుతుంది!
టకటకమనే పలక చప్పుడులో
చెమట చుక్కల పాట సమ్మగా వినిపిస్తుంటుంది!!

-ఆంధ్రజ్యోతి 'వివిధ', 4 అక్టోబర్ 2010

No comments: