Thursday, May 19, 2016

Short Story: Samskarana (Reform)


సంస్కరణ

మంచి సంబంధం ఒకటి వచ్చిందనీ, అమ్మాయిని చూసేందుకు రమ్మనీ, వచ్చే ముందు ఉత్తరం రాయమనీ తండ్రి జగన్నాథం నుంచి ఉత్తరం వచ్చింది వసంత్‌కి. శ్వేతకు చూపించాడు దాన్ని. చదివి నవ్వింది.
"చూసి రాపో."
"వేళాకోళమా" నెత్తిమీద మొట్టికాయ వేశాడు.
నాలుగు నెలల మూడు వారాల నుంచీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు. "ఆడా, మగా కలిసి జీవించడానికి పెళ్లి అవసరమా?" అంటాడు వసంత్.
"పెళ్లి కాకుండా ఎట్లా సాధ్యమవుతుంది?" అంది మొదట్లో శ్వేత. అయితే ఆమెకు నాలుగు నిమిషాల్లాగే గడిచిపోయాయి ఈ నాలుగు నెలలు. ప్రేమలో ఉండే మాధుర్యం రుచి చూస్తున్నారు, సెక్స్ తప్పించి. శ్వేత ఇంకా స్టూడెంటే.
ఒక రాత్రి బాగా టెంప్టయ్యి సెక్స్ కావాలన్నాడు వసంత్.
"తప్పదా. కనీసం పరీక్షలయిన దాకా అయినా ఆగుతావనుకున్నా" అంది అతడి అవేశానికీ, బాధకీ చలిస్తూ. ఆమె మొహం వంక చూసి కంట్రోల్ చేసుకున్నాడు.
"పరీక్షలయ్యేంత వరకూ దీనితోనే తృప్తి పడతాను" అని పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు.
రక్తం పోరు పెడుతుంది. నరాలు గిలగిలా కొట్టుకుంటాయి. దేహాలు ఏదో కావాలంటాయి. కళ్లు ఏమేమో చెప్పుకుంటాయి. అయినా ఏదో అడ్డు తగుల్తుంటుంది. ఆగిపోతారు. కావలింతలతో, ముద్దులతో తృప్తి పడుతున్నారు. ఆమె ఫైనలియర్‌లో ఉంది. ఎం.ఏ. సోషియాలజీ చేస్తోంది. ఇంకెంతకాలమనీ. రెండు నెలలు ఓపిక పడితే చాలు. కానీ ఆ రెండు నెలలు తనకు రెండు యుగాలుగా ఉంటుందనుకుంటున్నాడు వసంత్.
పెళ్లి కాకుండా ఓ ఆడదీ - ఓ మగాడూ కలిసి ఉంటున్నారంటే లోకానికి ఆ జంట పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో దిగ్భ్రాంతి పాలు ఎక్కువ. ఎక్కువవుతున్నారు వాళ్లని గమనించేవాళ్లు. ఎవర్నీ లక్ష్యపెట్టకుండా గొప్ప సంతోషంతో రోజులు గడుపుతున్నారు ఇద్దరూ.
ఇప్పుడు జగన్నాథం నుంచి ఉత్తరం.
రెండు రోజులు డ్యూటికి సెలవుపెట్టి ఊరెళ్లాడు. దాపరికం ఇష్టంలేదు. తల్లి వరలక్ష్మితో చెప్పాడు శ్వేత అనే అమ్మాయీ, తనూ కలిసి ఉంటున్నట్లు.
వరలక్ష్మి బిత్తరపోయింది. కంగారు పడిపోయింది. లోకం సంగతి జ్ఞాపకం వచ్చి భయపడింది. ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆ అమ్మాయిది ఏ కులమో? తమ కులమైతే కొంతలో కొంత నయం. కలిసి ఉంటున్నారంటే ఆ పిల్ల తనకేమవుతుంది? కోడలనొచ్చా? పెళ్లయితేనే కదా కోడలయ్యేది. ఓవేళ ఆ పిల్ల ఇక్కడకొస్తే చుట్టుపక్కల అమ్మలక్కలకు ఏమని పరిచయం చేస్తుంది? కొడుక్కి ఏమవుతుందని చెప్పాలి? స్నేహితురాలనా, ప్రియురాలనా? అదేంది.. ఆ.. రూమ్మేట్ అనా?
కొడుకుపై ఆమెకు కోపం వచ్చింది పీకల దాకా. ఎట్లా ప్రదర్శించాలో తెలీలేదు చప్పున. రోజులు మారిపోతున్నాయి. తరానికీ తరానికీ మార్పు వస్తోంది, వేగంగా. స్పీడు ఎక్కువవుతోంది జీవనంలో. ఒక్కటొక్కటే తెగిపోతున్నాయి కట్టుబాట్ల సంకెళ్లు. ఇవేవీ అర్థం చేసుకోగల పరిజ్ఞానం లేదు వరలక్ష్మికి.
"పెళ్లి కాకుండా ఎవరో అమ్మాయితో కలిసి ఉండటమేమిట్రా?" అంది వరలక్ష్మి.
"మేం ప్రేమించుకున్నామమ్మా. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం."
"ఆ పిల్లకి ఎవరూ లేరా?"
"ఎందుకు లేరు? అమ్మా, నాన్నా.. అంతా ఉన్నారు."
"మరా పిల్ల ఇట్లాంటి పనిచేస్తే ఊరుకున్నారా?"
"ఇట్లాంటి పనంటే - ఇది ఘోరమైన పనా. వాళ్లు ఊరుకున్నారో లేదో అక్కడికి వచ్చి శ్వేతనే అడుగు."
"తప్పు కదరా అట్లా ఉండటం. నలుగురూ ఏమనుకుంటారు. ఎంత ఎగతాళి అయిపోతాం అందరిలో. గౌరవం, మర్యాదా ఉంటాయా మనకి."
"గౌరవం, మర్యాదా అనేవి మనం ఊహించుకునే దాన్నిబట్టి ఉంటాయమ్మా. నా దృష్టిలో మేం చేసిన పని ఎంత మాత్రమూ తప్పుకాదు. మా ఇద్దరికీ అది ఇష్టమైన పని ఐనప్పుడు ఇంకొకరు మా విషయంలో ఎందుకు తలదూర్చాలి?" అన్నాడు ప్రశాంతంగానే.
అప్పుడే వచ్చాడు జగన్నాథం ఇంట్లోకి. సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడతాడతను.
"విన్నారా.. వీడూ, ఇంకో అమ్మాయీ కలిసి ఉంటున్నారట" చెప్పింది వరలక్ష్మి.
"నిజమా! ఏరా, అద్దె కలిసి వస్తుందనా?"
వచ్చే నవ్వును ఆపుకున్నాడు వసంత్. "లేదు మేం ప్రేమించుకున్నాం."
"అదేంట్రా. నేను ఉత్తరం రాశాను కదా సంబంధం వచ్చిందనీ, అమ్మాయిని చూసేందుకు రమ్మనీ. అందలేదా?"
"అందింది. అందుకే అట్లాంటి ప్రయత్నాలేవీ అవసరం లేదని చెప్పేందుకే వచ్చాను."
"ఏవిటీ? ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నావా?"
"ఇంకా మేం పెళ్లి గురించి ఏం అనుకోలేదు."
బిత్తరపోయాడు జగన్నాథం. నోటెంట వెంటనే మాట రాలేదు. కలిసి ఉంటున్నామని చెప్తున్నాడు. మళ్లీ పెళ్లి మాట మాత్రం అనుకోలేదంటున్నాడు. ఈ రెంటికీ లంకె ఎట్లా కుదురుతుంది?
"నువ్వంటే మగాడివి. ఎట్లా చేసినా చెల్లుతుంది. పాపం ఆడపిల్ల. ఆ అమ్మాయి బతుకుతో ఆటలాడాలనుకుంటున్నావా?" - బాగా అడిగాననుకున్నాడు.
"ఎవరం ఎవరితో ఆటలాడుకోటం లేదు. ఇద్దరం ప్రేమించుకున్నాం. కలిసి ఉండాలనుకున్నాం. నాలుగు నెల్ల నుంచీ ఉంటున్నాం."
"పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేదేంట్రా. ఫలానా జగన్నాథం కొడుకు హైద్రాబాద్‌లో ఎవరో పిల్లని పెట్టుకొని ఉంటున్నాడని జనం అనుకుంటే మనకి ఎంత అప్రతిష్ఠగా ఉంటుందో ఆలోచించావా?"
"ఇందులో ఆలోచించడానికేమీ లేదు నాన్నా. నేను మీతో గొడవ పెట్టుకునేందుకు రాలేదు. ఉత్తరంలోనే రాసేవాడిని ఈ సంగతి. స్వయంగా చెబితేనే బాగుంటుందని శ్వేత అంటే వచ్చాను."
మళ్లీ గట్టిగా వసంత్‌ని అనేందుకు జంకాడు జగన్నాథం. గొణుక్కుంటూ ఉండిపోయాడు. కొడుకుతో మాట్లాడేందుకు మనస్కరించలేదు వరలక్ష్మికి కూడా. కొడుకు ఘోరమైన తప్పుపని చేశాడని ఆమె నమ్ముతోంది. బరితెగించినవాళ్లు తప్ప ఇట్లాంటి పనులు చేయరని ఆమె అభిప్రాయం.
మరో రోజు సెలవు ఉన్నా, ఉండబుద్ధికాక వసంత్ ఆ రోజు రాత్రే బయలుదేరి వచ్చేశాడు హైద్రాబాద్.
* * *
బాత్‌రూంలోకి పోబోతూ ఇంటి ముందు ఆటో శబ్దం వినపడ్డంతో ఆగి చూశాడు వసంత్. ముందు జగన్నాథం, తర్వాత వరలక్షీ దిగారు ఆటోలోంచి. ఆశ్చర్యపడ్తూ అమ్మానాన్నలకు ఎదురువెళ్లాడు. ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి వచ్చారు.
"నువ్వు అట్లా వచ్చేశాక ఉండబట్టలేక మేం వచ్చేశాం" చెప్పింది వరలక్ష్మి. ఇంట్లోకి అడుగుపెడ్తూనే చుట్టూ కలియజూసింది. గతంలో తను వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది.
కొత్త మనుషుల్ని చూడ్డంతోటే వాళ్లెవరై ఉంటారో ఊహించింది శ్వేత.
"మా అమ్మా నాన్నా.. ఈమే శ్వేత" - పరిచయం చేశాడు వసంత్. అప్పటిదాకా మనసులో ఎంతో కోపం ఉన్నా, అందమైన శ్వేత నవ్వూ, చొరవగా వచ్చి తన చేతులు పట్టుకోవడం.. వరలక్ష్మి కోపం తగ్గించాయి.
"నీకు టైమవుతోంది వసంత్. స్నానానికి వెళ్లిరా" అంది శ్వేత, కళ్లతోనే ఏం ఫర్వాలేదని చెప్తూ.
'వసంత్‌ని అట్లా పేరుపెట్టి పిలుస్తోందేమిటి ఈ పిల్ల, బొత్తిగా మర్యాద లేకుండా. రోజులిట్లా తయారవుతున్నాయేమిటో?' అనుకుంది వరలక్ష్మి.
"మీరు కూర్చోండి. టీ కలుపుకొని తెస్తాను" అని వంటగదిలోకి వెళ్లింది శ్వేత. తనూ వెళ్లింది వెనకాలే - వరలక్ష్మి.
"నువ్వు కాలేజీకి వెళ్తున్నావంట గదమ్మా. అబ్బాయి చెప్పాడు."
"అవునండి. నన్ను కాలేజీ వద్ద దింపి తను ఆఫీసుకి వెళ్తాడు."
"అమ్మాయ్. నాకు తెలీకడుగుతాను. పెళ్లి చేసుకోకుండా ఇట్లా ఒకే ఇంట్లో ఉండటం ఏవన్నా బాగుందా?"
"ఒక ఆడా, మగా ప్రేమించుకొని కలిసి ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు పెళ్లి అవసరం లేదని వసంత్ అభిప్రాయం. మీలాగే మొదట్లో నాకూ అది కష్టమనిపించింది. ఇప్పుడయితే నా అభిప్రాయం మార్చుకున్నాను."
"మా కుటుంబాల్లో ఏ ఒక్క మగాడికీ ఇట్లాంటి ఆలోచనలు లేవు. వీడికే ఇట్లాంటివి ఎందుకు వస్తాయో అర్థం కాదు. చిన్నప్పట్నించీ అంతే. పాలచెట్టు పేరు ఎప్పుడన్నా విన్నావమ్మాయ్. మా ఇంటిపక్క ఉండేది ఓ చెట్టు. చాలా రుచిగా ఉంటాయ్ పాలపళ్లు. ఆ స్థలం కలవాళ్లు వాళ్లవసరం కోసం చెట్టు కొట్టేస్తుంటే అక్కడున్న పిల్లలంతా సంతోషంగా కొమ్మలకి ఉన్న పళ్లు తెంపుకు తింటుంటే వీడు భోరున ఏడ్చేశాడు చెట్టు కొట్టేస్తున్నారని. పైగా చెట్టు కొట్టేస్తున్నవాళ్లతో పోట్లాట పెట్టుకున్నాడు. వీడు ఏడుస్తూ అడిగే మాటలకి వాళ్లు తెల్లముఖం వేశారనుకో. అట్లా ఉంటుంది వీడి వరస. సరే, ఇంతకీ మీది ఏ కులం అమ్మాయ్?"
ఆమె నోటినుంచి ఈ ప్రశ్న తప్పకుండా వస్తుందని ముందే గ్రహించింది శ్వేత. తనేం చెప్పినా ఆమె అర్థం చేసుకోగలదన్న నమ్మకం లేదు. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న కుల వ్యవస్థ తాలూకు జీవం నరనరాన ప్రవహిస్తున్న వరలక్ష్మి తన మాటల్ని అర్థం చేసుకుంటుందా?
"కులం గురించి మీకంత పట్టింపు ఎందుకో తెలుసుకోవచ్చా?"
శ్వేత ప్రశ్నకి విసురుగా చూసింది వరలక్ష్మి. 'ఇంత పెద్దదాన్ని పట్టుకొని తన్నే ఎదురు ప్రశ్న వేస్తుందా ఈ బుడత, బొత్తిగా గౌరవం లేకుండా' అన్నట్లు చూసింది.
"అదేంటమ్మాయ్. ఏ కులం వాళ్లకైనా ఆ కులం గురించి పట్టింపు ఉండదా. మన పెద్దవాళ్లు పెట్టిన కట్టుబాట్లని కాదనడానికి మనమెవరం? వాళ్లు పిచ్చివాళ్లా?". వరలక్ష్మి అన్నదానికి నవ్వుతూ చూసింది శ్వేత.
"అసలు కులం ఎందుకు పుట్టిందో తెలిసి ఉంటే మీరిలా అనేవాళ్లు కాదండీ. కులాలు ఏర్పడక ముందు సమాజంలో వర్ణ వ్యవస్థ ఉండేది. బుద్ధుణ్ణి మీరు గొప్పవాడని ఒప్పుకుంటారు కదా. ఆయనే ఈ వర్ణ వ్యవస్థని వ్యతిరేకించాడు."
"కులాలు తెలుసు కానీ వర్ణ వ్యవస్థేమిటి?"
"వర్ణాలంటే - బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని అప్పుడు నాలుగు వర్ణాల వాళ్లుండేవాళ్లు. మిగతా మూడు వర్ణాలవాళ్లూ శూద్రుల్ని హీనంగా చూసేవాళ్లు - ఇప్పుడు హిందువులు దళితుల్ని చూస్తున్నట్లు. ఎవరు ఏ వర్ణానికి చెందుతారనేది పుట్టుకనిబట్టి నిర్ణయించే ఈ వర్ణ వ్యవస్థని బుద్ధుడు ఖండించాడు. అయితే అందుకు విరుద్ధంగా బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థని జనంలో ప్రచారంలోకి తెచ్చారు."
"బుద్ధుడు ఒప్పుకోకపోతే ఆయన్ని దేవుడిగా కొలిచే జనం మాత్రం ఎందుకు ఈ వర్ణాల్ని పట్టుకున్నారు?" అడిగింది వరలక్ష్మి, ఈ ప్రశ్నకి జవాబు ఉందా? అని చూస్తూ.
"దానికి పెద్ద చరిత్రే ఉందండీ. కొద్ది మాటల్లో చెప్తాను. ఆ రోజుల్లో సమాజంలో స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడింది. దీనివల్ల అంతదాకా సాగుతూ వచ్చిన దూరప్రాంత వర్తకం దెబ్బతింది. స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ అంటే తమ అవసరాల్ని తామే తీర్చుకొనే వ్యవస్థ అన్నమాట. అందుచేత ఈ వర్తకంతో ముడిపడివున్న బౌద్ధ విహారాలనేవి క్షీణించిపోయాయి. బౌద్ధ మతానికి ఉన్న సామాజిక పునాది కూడా పోయింది. ఇక వర్ణాలనేవి స్వయంపోషక గ్రామీణ వ్యవస్థకి అతికాయి కాబట్టే వర్ణ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది."
"వర్ణాల గురించి చెబుతున్నావే కానీ కులాల సంగతి చెప్పవేం?"
"వాటి దగ్గరకే వస్తున్నాను. కాలక్రమంలో వర్ణాల స్థానంలోనే కులాలు వచ్చాయి. నాలుగు వర్ణాల మధ్య వర్గ సంకరం జరిగినందువల్ల కులాలన్ని ఏర్పడ్డాయని మనువు అనే ఆయన ఒక కల్పన చేశాడు. ఆయన కల్పనని తర్వాత బ్రాహ్మణులు ఓ శాస్త్రంగా కొనసాగించారు. ఫలితంగా ఇప్పుడున్న కుల వ్యవస్థ సాగుతూ వస్తోంది" చెప్పి టీ కలిపింది శ్వేత.
ఆమె చెప్పినదంతా ఆశ్చర్యంగా వింది వరలక్ష్మి. ఆమెకి కొంత అర్థమైంది, కొంత కాలేదు. అయినా ఇంత చిన్న వయసులో ఈ సంగతులన్నీ ఎట్లా తెలిశాయి ఈ పిల్లకి? అదే అడిగింది.
"చదువుకోవడం చేత" చెప్పింది శ్వేత.
నిజమే. తను చదువుకోలేదు. అందుకే ఈ సంగతులేవీ తెలీదు. అయితే చదువుకున్న వాళ్లందరికీ ఈ సంగతులు తెలుసు కదా. ఈ కులాల్లో మంచంటూ లేకపోతే వాళ్లెందుకు ఊరుకుంటున్నారు? కులాల మధ్య పోట్లాటలు ఎందుకు సాగుతున్నాయి? తమ ఊళ్లోనే రెండు కులాల మధ్య గొడవలు వచ్చి ఒకళ్లనొకళ్లు కత్తులతోటీ, కటార్లతోటీ పొడిచి చంపుకోడం తనకు తెలుసు. మరెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి?
ఆమె సందేహం తెలుసుకొని "ముందు టీ తీసుకోండి" అని ఆమెకో కప్పు ఇచ్చి, ముందుగదిలోకి వచ్చి జగన్నాథానికో కప్పు ఇచ్చింది.
వసంత్ స్నానం చేసి బట్టలేసుకు వచ్చాడు.
"నువ్వు కూడా రెడీకా" అన్నాడు శ్వేతను ఉద్దేశించి.
"ఈ రోజు నేను సెలవు పెడుతున్నాను."
శ్వేత వంక ఆశ్చర్యంగా చూశాడు వసంత్. కళ్లతోనే సందేహ నివృత్తి చేసింది.
"అబ్బాయికి కూడా టీ ఇవ్వమ్మా" అంది వరలక్ష్మి.
"లేదండీ. తను ముందు టిఫిన్ చేశాకే" చెప్పింది శ్వేత.
ఈ పిల్ల అప్పుడే వసంత్ మీద పెత్తనం చేస్తోందా అన్నట్లు చూసింది వరలక్ష్మి. ఆమె తన గురించి ఏమనుకుంటుందో గ్రహించుకొని చిన్నగా నవ్వుకుంది శ్వేత.
వసంత్ ఆఫీసుకు వెళ్లిపోయాడు. జగన్నాథం టాయిలెట్‌లోకి వెళ్లాడు. అప్పుడు వరలక్ష్మితో అంది శ్వేత - "మీరిందాక ఓ ప్రశ్న అడిగారు కదా. చెప్తాను. ప్రతి కులం వారూ తమ కులం మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. తరతరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. వాళ్లలో చదువుకున్న వాళ్లకు కులాలు ఎందుకు పుట్టాయో తెలుసు. అయినా తెలీనట్లే ఉంటారు. అహంభావం అనేది వాళ్లనట్లా చేస్తుంది. 'ముందు ఎదుటివాడ్ని సంస్కరణకు ఒప్పుకోమను. అప్పుడు నేనూ ఒప్పుకుంటాను' అనే మనస్తత్వం మనది. ఇక కుల నిర్మూలన ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వాలు కూడా కులాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఇక అది అసాధ్యమనే అనుకోవాలి."
చెప్పి వరలక్ష్మి ముఖంలోకి చూసింది. తాను చెప్పింది ఆమెకు కొంచెం కూడా అర్థమై ఉండదని అనిపించింది. ఆమెతో ఇట్లా సంభాషించడం వృథా అని తోచింది.
"ఏమోనమ్మాయ్. నువ్వెనయినా చెప్పు. మా ఆయన కంటే నీకెక్కువ తెలుసుంటుందని నేననుకోను. ఎందుకొచ్చిన తగలాటం. పరువుపోవడం తప్ప. మీరిట్లా ఉండటం ఏం బావుంటుంది? మావాడంటే మూర్ఖుడు. మగాడు కాబట్టి వాడికొచ్చే నష్టంతో పోల్చుకుంటే నీకొచ్చే తిప్పలు చాలా ఎక్కువ. శుభ్రంగా మీ వాళ్ల దగ్గరకి వెళ్లిపో. అందరికీ బావుంటుంది."
వచ్చే కోపాన్ని బలవంతాన అదిమిపెట్టింది శ్వేత.
"ఎ మాటే వసంత్ వచ్చాక అతనితో చెప్పండి" అంది.
* * *
కొద్దికాలం గడిచాక జగన్నాథం నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది వసంత్‌కి.
"ఒరేయ్. నువ్వు చేసిన పనికి ఇక్కడందరూ ఉమ్మేస్తున్నారు. మా పెంపకం సరిగాలేదు కాబట్టే నువ్విట్లా తయారయ్యావంటున్నారు మీ బాబాయిలూ, మీ మావయ్యలూ. తెలిసిన ప్రతివాడూ వచ్చి 'మీవాడు హైద్రాబాద్‌లో ఎవతెనో ఉంచుకున్నాడంటగా' అంటుంటే నా నెత్తురు ఎట్లా మరుగుతుంటుందో అర్థం చేసుకో. వాళ్ల తాకిడికి బయటకి వెళ్లాలంటేనే దడగా ఉంటోంది. నువ్వు చేసిన వెధవ పని మీ బావకీ తెలిసి నీ చెల్లెల్ని నానా మాటలూ అంటూ, మన వంశాన్నంతా తిడుతూ కొడుతూ ఉంటే భరించలేక అది పుట్టింటికి చేరింది. ఎట్లాగో నచ్చెజెప్పి మళ్లీ అత్తగారింటికి తీసుకుపోతే అల్లుడు నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. ఈ జన్మలో మొదటిసారిగా ఒకరి కాళ్లు పట్టుకోవాల్సొచ్చింది.
దయచేసి నువ్వు ఈ ఛాయలకి రామాకు. ఏ కూస్తో ఉన్న శాంతి కూడా పోతుంది. నువ్వు పాటిస్తావన్న నమ్మకం లేకపోయినా నాదో సలహా. 'ఎవతెనో ఉంచుకున్నాడు' అనే మాట నీకు బాగానే ఉంటుందేమో కానీ జనానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి కనీసం ఆ పిల్లని పెళ్లయినా చేసుకుంటే కొంత నయంగా ఉంటుంది.
నీ దయవల్ల మీ అమ్మకి అదే నా భార్యకి అనారోగ్యం అమోఘంగా ఉంటోంది.
- ఇట్లు, జగన్నాథం."


- ఆంధ్రభూమి ఆదివారం, 27 ఏప్రిల్ 1997



No comments: