Friday, April 3, 2015

Interview of Director Ravi Babu

హీరోయిన్లు నాపై ఆసక్తి చూపరు
ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌, రిలేషన్స్‌ పాటిస్తూ వస్తున్నవాణ్ణి. అందువల్ల హీరోయిన్లు నాపై ఆసక్తి ప్రదర్శించరు. నేను టాలెంట్‌ని చూస్తానే కానీ, గ్లామర్‌ను చూడను. పూర్ణతో నేను మూడు సినిమాలు చేశానంటే, కేవలం ఆమె అభినయాన్ని దృష్టిలో పెట్టుకొనే - అన్నారు రవిబాబు. అవును చిత్రానికి రెండో భాగంగా ఆయన రూపొందించిన చిత్రం అవును 2. డి. సురేశ్‌బాబుతో కలిసి ఆయన స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్రవారం అవును 2 ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా పత్రికలవారితో సంభాషించారు రవిబాబు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
రెండో భాగం అంటే చాలా సినిమాల్లో మొదటి భాగానికి భిన్నమైన కథ కనిపిస్తుంది. కేరక్టర్‌ మాత్రం కొనసాగుతుంది. ఏ షాట్‌తో అవునును ఆపామో, ఆ షాట్‌తోటే ‘అవును 2’ మొదలవుతుంది. అంటే ఇది నిజమైన కొనసాగింపు. మొదటి భాగంలోని పాత్రలతో పాటు కథ కూడా కొనసాగుతుందన్న మాట.
థ్రిల్లర్లకు సీక్వెల్‌ ఛాన్స్‌
ఏ సినిమాలోనైనా మంచి, చెడు మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. ‘అవును’లో చెడు పాత్ర మీద గెలిచానని మంచి పాత్ర అనుకుంటుంది. నిజానికి చెడు చావలేదు, మంచికి కష్టాలు తొలగలేదన్నట్లు ఆ క్లైమాక్స్‌లో చూపించాం. ‘అవును 2’లో చెడు అనేది మంచితో ఎలా పోరాడిందనే విషయాన్ని చూపించాం. ‘అవును’ చేసేప్పుడే దాన్ని రెండు, మూడు భాగాలుగా తియ్యాలని అనుకున్నా. ‘అవును 2’ బాగా ఆడితే, దీనికి మూడో భాగం కూడా రావచ్చు. హారర్‌, థ్రిల్లర్‌ సినిమాలకు సీక్వెల్స్‌ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆమెలాంటి నటిని చూడలేదు
నేను చాలా మంది ఆర్టిస్టులతో పనిచేశాను. పూర్ణలా హావభావాలతో అభినయాన్ని ప్రదర్శించే నటిని ఇంతవరకు నేను చూడలేదు. ‘ఒన్‌ మోర్‌’ అని అడగడానికి స్పాట్‌లో సిగ్గుపడేవాణ్ణి. అంత కాన్‌సన్‌ట్రేషన్‌తో, అంత పర్ఫెక్షన్‌తో ఆమె హావభావాలు ప్రదర్శిస్తుంది. ‘అవును’ విజయానికి పూర్ణ నటన, ఆమె ప్రెజెన్స్‌ 99 శాతం కారణమని నేననుకుంటాను. దానికి మించి ‘అవును 2’లో అత్యుత్తమంగా నటించింది. హర్షవర్థన్‌ రాణేకు ‘అవును’లో పెద్దగా పర్‌ఫామ్‌ చెయ్యడానికి స్కోప్‌ లేదు. ఇందులో అతని పర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్‌ లభించింది. రెండు రీళ్లు పూర్తిగా అతని నటనమీదే ఆధారపడి ఉంటాయి.
ఎల్‌ఈడీ బల్బులతో షూటింగ్‌
లైటింగ్‌ పాటర్న్‌లో కూడా పూర్తి భిన్నమైన పంథాలో వెళ్లాం. మేం ఒక్కసారి కూడా మేం స్టాండర్డ్‌ లైటింగ్‌ ఉపయోగించలేదు. పూర్తి సినిమాని ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించి తీశాం. ఔట్‌డోర్‌లో నేచురల్‌ లైటింగ్‌నే ఉపయోగించుకున్నాం. సినిమా షూటింగ్‌ ప్రారంభానికి ముందే సినిమాలోని 60 సీన్లకూ లైటింగ్‌ను ఫిక్స్‌ చేసేశాం.
రూల్‌ పెట్టుకున్నా
నేను భూమికతో మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు పూర్ణతో మూడు సినిమాలు చేశాను. నేనో రూల్‌ పెట్టుకున్నా. షూటింగ్‌కు పేకప్‌ చెప్పాక ఏ రోజూ నేను నా సినిమాలో చేసిన ఏ హీరోయిన్‌కూ కాల్‌ చెయ్యలేదు. అంతేకాదు. ఆ టైమ్‌లో హీరో హీరోయిన్ల నుంచి కానీ, నా అసిస్టెంట్‌ దగ్గర నుంచి కానీ ఫోన్లు వస్తే రిసీవ్‌ చేసుకోను. ఈ రూల్‌ను నేను మొదట్నించీ పాటిస్తూ వస్తున్నా. నా లైఫ్‌ ఓపెన్‌ బుక్‌ లాంటిది. నేనలాంటి వాణ్ణయితే, ఆ హీరోయిన్లు నాతో రెండో సినిమా చెయ్యరు కదా.
అలాంటి పాత్రలు రావట్లేదు
నాకెవరూ వేషాలు ఇవ్వట్లేదు. తొలి చిత్ర దర్శకులు, చిన్న సినిమాల దర్శకులు నాతో చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద దర్శకులెందుకనో నాకు వేషాలు ఆఫర్‌ చెయ్యట్లేదు. వాళ్ల పాత్రలకు నేను సరిపోనో, ఇంకేంటో నాకు తెలీదు. అయితే నేను కూడా నాకు ఆఫర్‌ చేసిన అన్ని పాత్రలూ చెయ్యను. ఆ పాత్రలో ఆసక్తికరమైన విషయమేదైనా ఉండాలి. ఆర్టిస్టును దృష్టిలో పెట్టుకుని ఎవరూ పాత్రలు రాయట్లేదు. ఎవరు దొరికితే వాళ్లతో పాత్రలను చేయించేస్తున్నారు. అలాంటి వాటిని నేను వేసినా, వెయ్యకపోయినా ఒక్కటే.

- ఆంధ్రజ్యోతి డైలీ, 1 ఏప్రిల్ 2015

No comments: