Wednesday, February 18, 2015

Literature: Women's Telugu Monthly Anasuya

ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ'

తెలుగులో స్త్రీల కోసం స్థాపించిన మొదటి పత్రిక సతీహితబోధిని. దాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం పంతులు. గొప్ప సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్న ఆయనకు స్త్రీలపట్ల ఉన్నవన్నీ గొప్ప భావాలు కావు. ఆయన దృష్టిలో స్త్రీ అవలక్షణాల పుట్ట. అలాంటి స్త్రీని బాగుచేసి ఆదర్శ గృహిణిగా నిలపడం గొప్ప సంస్కరణ కింద ఆయన భావించారు. అప్పట్లో సంస్కర్తలమనుకునే వాళ్లకి ఇలాంటి అభిప్రాయమే ఉండేదని తోస్తుంది.
స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడటం గొప్ప విషయమైతే అందులో కొన్ని పత్రికలు స్త్రీవిద్య కోసం, తద్వారా స్త్రీలలో చైతన్యం పెంపొందటం కోసం కృషి చేయడం మరింత విశేషమనే చెప్పాలి.
'హిందూసుందరి' స్త్రీ సంపాదకత్వంలో వెలువడిన తొలి తెలుగు పత్రిక. శ్రీమతి మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో 1902లోనే ఈ పత్రిక ప్రారంభమైంది. అప్పట్లో 'హిందూసుందరి' పత్రిక వెలువడటం తెలుగుదేశంలో పెద్ద సంచలనం. ఇంతటి పేరు తెచ్చుకోకపోయినా స్త్రీ విద్యపైనా, సమాజంలో ఆనాడు ఉన్న సంఘ దురాచారాలపైనా వచ్చిన మరో పత్రిక 'అనసూయ'. 1917లో ప్రారంభమైన ఈ పత్రికకు సంపాదకురాలు శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మ. 'అనసూయ' కంటే ముందు వచ్చిన స్త్రీల పత్రికలు 'హిందూసుందరి' కాక 'సావిత్రి', 'జనానా', 'గృహలక్ష్మి' అనేవి. వీటిలో 'హిందూసుందరి' మినహా మిగతా మూడూ 'అనసూయ' వచ్చేనాటికి మాయమయ్యాయి.
"స్త్రీలెచ్చట నుచ్ఛస్థితిలో నుందురో యాదేశ మభివృద్ధిలోనున్న మాటయే. అట్లుండుటకు వారి యజ్ఞానాంధకారము పారద్రోలబడవలయును. వారు పురుషులతో సర్వవిధముల సమానలని యెన్నుకొనబడు నవస్థ రావలయును." (వింజమూరి వెంకటరత్నమ్మ, 1920 జనవరి సంచిక) అనే భావాన్ని వ్యక్తం చేయడం నిజంగా అప్పట్లో సంచలమే. సాహిత్యలోకంలో గొప్ప సంచలనాన్నీ, ప్రకంపనల్నీ పుట్టించిన 'స్త్రీ'ని చలం రచించింది 1925 ప్రాంతంలో కాగా, అంతకు అయిదు సంవత్సరాల మునుపే పురుషులతో పాటు స్త్రీలు అన్ని విధాలా సమానమనే సమాజం రావాలని వీరు పేర్కొనడం విశేషమే.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో సర్ నారాయణచంద్ర వార్కర్ రచించిన ఒక వ్యాసాన్ని వెంకటరత్నమ్మ 'ఇరువురు మాలకన్నియలు' పేరుతో అనువదించి 1919 జూలై-ఆగస్టు సంచికలో ప్రచురించారు. అందులో మాలకన్య హూవి, తండ్రి తనకి పెళ్లి చేస్తాననీ, పెళ్లివలన సుఖంగా ఉండొచ్చనీ చెబితే, తండ్రితో "సుఖమా? భర్తలకును సుఖమునకును ఎంతో సంబంధముండునట్లు మాట్లాడుచున్నావే" అంటుంది. హూవి తల్లి భర్తను విడిచిపెట్టి వెళ్లిపోతుంది. అందుకని తండ్రి హూవితో "నీ తల్లిని నేను విడిచిపెట్టలేదనియు, అదియే నన్ను విడిచిపోయేనియు నీవెరుగుదువా?" అని అన్నప్పుడు "అట్లామె నిన్ను విడిచినదని విని నేను గర్వపడుచున్నాను. మా యాడువాండ్రు నీవు త్రోలి డబ్బును గడియించు గుర్రమువంటి వారు కాదని నిదర్శనపూర్వకముగా నీకామె చూపినది" అని సమాధానమిస్తుంది హూవి. మరో సందర్భంలో "కులము నారికి నాయందముతో జోక్యము లేదు. నేనడగుటయే తడవుగ వరులు నాకు లభింతురని నీవనుచుంటివి. కాని వధువులంత చులకనగ లభ్యము కారని నేను జూపింపదలచుకున్నాను" అనేందుకు సాహసిస్తుంది హూవి. ఇప్పటి పరిస్థితుల్లోనూ హూవిలా ధైర్యంగా చెప్పగలిగే యువతులు లేరు. కాని అప్పట్లోనే అలాంటి భావాల్ని పత్రికలో వ్యక్తం చేయడం అంటే సామాన్యం కాదు.
పూర్వకాలంలో మనదేశంలో ఉన్న ఘోషాపద్ధతి మూలంగా పురుషుల మాదిరిగా స్త్రీలు బయటకి వచ్చి చదువుకోడానికి వీల్లేకుండా ఉండేది. అయితే అవకాశమిస్తే మేధాపరంగా వారు పురుషులకేమాత్రం తీసిపోరు అన్న అంశంతో వెంకటరత్నమ్మ ఒక వ్యాసంలో బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయినిలుగా స్త్రీలను మాత్రమే నియమించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థినులు తయారవుతారని ఆమె భావన. 20వ శతాబ్దంలో మొదటి మూడు దశాబ్దాల కాలం వరకూ బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. వితంతువుల కష్టనష్టాలను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ దురాచారాలపై యుద్దం ప్రకటిస్తూ గోపిశెట్టి సూర్యనారాయణమ్మ తన 'స్త్రీవిద్య' వ్యాసంలో "ఏమాత్రము వివేకమున్నను స్త్రీలు తమ బిడ్డలకు బాల్య వివాహము చేయనిత్తురా? బిడ్డలకు జేయు పెండ్లిండ్ల వ్యయములో నాల్గవవంతు స్త్రీవిద్యకి వెచ్చించిన, నమూల్యమగు సంతతిని దేశమున నిల్పవచ్చునే" అని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఏ మాత్రం విలువలు పాటించని రాజకీయ నాయకులు మైకుముందు ఎలా మాట్లాడతారో, మైకు దాటి బయటకు వచ్చి ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలుసు. అట్లాంటి నాయకుల్ని ఆనాడే వసంతరావు అమ్మన్న ఒక వ్యాసంలో ఎండగట్టారు. అప్పటి వారసత్వం రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది కదా!
ఆ నాటి సంఘంలో స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే.. "ఆ కాలంలో స్త్రీల స్థితి చాలా హైన్యంగా ఉండేది. మూర్ఖత్వానికి స్త్రీలు పుట్టినిండ్లుగా ఉండేవారు. వితంతువుల నిర్బంధనలు, కోడంట్రికములు చాలా ఎక్కువగా ఉండేవి.. ఇంతలో వరకట్నాలొకటి వచ్చి పడ్డాయి. వీటి మూలంగా ఆడపిల్లల అభివృద్ధి ఆగిపోయింది. ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి ఎలా చేస్తుమాని విచారిస్తున్నారు.. మా కాలంలో ఆడపిల్లలను కన్న దరిద్రులెవరన్నా ఉంటే ఏ ముసలికో, ముతక్కో ఇచ్చి చేసేవారు. అంతే కానీ ఈ మాదిరిగా బేరంపెట్టి మర్యాదస్తులు, ధనవంతులు, పరువు గలవారు కూడా మగపిల్లలను అమ్ముకోవడం యెరగం. ఆత్మగౌరవం గల విద్యార్థులు ఈ అమ్ముడుబోవడానికి ఎలా ఒప్పుకుంటున్నారో తెలియదు." ('అప్పుడు-ఇప్పుడు'- వృద్ధురాలు - 1920 మార్చి సంచిక). ఇప్పుడూ ఆ విద్యార్థుల ఆత్మగౌరవంలో మార్పేమీ లేదు కదా!
స్త్రీలలో ఎప్పటికీ మారని గుణం ఒకటుంది. అది తమ జాతిని తామే దూషించడం. ఇట్లాంటివి వద్దంటుంది గుడిపూడి ఇందుమతీ దేవి తన 'బ్రాహ్మణ కన్యా వివాహ ప్రహసనము'లో. ఇందులో ఓ చోట చారుమతి అంటుంది - "మన జాతిని మనమే దూషించితే, పురుషులేమనవలె? మనకు సరియైన విద్య లేకనే మనకీ మూర్ఖత్వము వదలకున్నది". ఇదే కథానికలో మంగమ్మ "తెలియక మనవాళ్లు పోట్లాడుతారు గాని మూర్ఖాచారం వదిలితే దేశమే బాగుపడును. ముందొక నాచారమును కొత్తగా నాచరణలోనికి దెచ్చువారు ప్రథమమున చాలా ఇక్కట్లకు తలయొగ్గవలె. తర్వాత అందరూ చేస్తారు" అంటుంది.
మొత్తానికి 'అనసూయ'లో స్త్రీలను చైతన్యవంతులను చేయాలనే తాపత్రయం కనిపిస్తుంది. విద్యవలనే అది సాధ్యమవుతుందనే అభిప్రాయం అందులో స్పష్టమవుతుంది. 'అనసూయ'కు కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా రచనలు పంపేవారు. కృష్ణశాస్త్రి కవితలు కూడా కొన్ని వచ్చాయి. 'అన్వేషణము', 'అనుతాపము' లాంటి కవితలు వాటిలో ఉన్నాయి. విజ్ఞానదాయకమైన వ్యాసాలెన్నింటినో వెంకటరత్నమ్మ తన పత్రికలో ప్రచురించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యమధ్యలో పత్రిక రావడం ఆలస్యమైనా భరించి రెండు నెలలకు కలిపి ఒక సంచికను తీసుకువచ్చేవారామె.
1917లో మొదలైన పత్రిక ఎప్పటివరకూ వచ్చిందో కచ్చితంగా తెలీదు కానీ 1924 జూలై సంచిక వరకు లభ్యమవుతున్నది. ఆర్థిక ఇబ్బందుల మూలంగానే ఆ పాత్రిక ఆగిపోయిందనుకోవచ్చు. ఏదేమైనా స్త్రీవిద్య, సమానత్వం కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే ఓ స్త్రీ సంపాదకత్వంలో వచ్చిన ఓ గొప్ప మాస పత్రికగా 'అనసూయ'కు స్థానం ఉంటుంది.

- బుద్ధి యజ్ఞమూర్తి

- ఆంధ్రభూమి డైలీ, 12 ఏప్రిల్ 1996.

No comments: