Tuesday, January 6, 2015

Short Story: Arundhati

కథ:                                    అరుంధతి


ఆగస్టు 26న తమ్ముడు సురేంద్ర పెళ్లి అనీ, నాలుగు రోజుల ముందుగానే రావాలనీ అమ్మ రాసిన ఉత్తరమూ, శుభలేఖా అందాయి మహేంద్రకు. తప్పకుండా వెళ్లాల్సిందే. లేకపోతే అమ్మ చాలా బాధ పడుతుంది. సురేంద్ర వేరేగా యోచించే అవకాశం ఉంది. బంధువులు సైతం అమ్మని తలోరకంగా మాటలనవచ్చు. 'ఏమైనా భరించవచ్చు కానీ చుట్టాల ఎత్తిపొడుపు మాటలు అస్సలు భరించలేం' అనే అమ్మ మాటలు జ్ఞాపకానికొచ్చాయి. అయితే సమస్యల్లా అరుంధతిని కూడా తీసుకెళ్లాలా, వొద్దా అనే.
అరుంధతిది వాళ్ల కులం కాదు. మహేంద్రవైపు వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ల పెళ్లి జరిగింది. అన్నదమ్ముల ఒత్తిడికి భయపడి కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేదు మహేంద్ర వాళ్లమ్మ. కనీసం సురేంద్రయినా వొస్తాడనుకున్నాడు. తను టూర్‌లో ఉండటం చేత పెళ్లికి రాలేకపోయానని తర్వాతెప్పుడో ఉత్తరం రాశాడు. కొంతన్నా నయం. అతడివైపు వాళ్లెవరూ లేకుండానే అరుంధతితో మహేంద్ర పెళ్లయిపోయింది. అందుచేత ఆమెని సురేంద్ర పెళ్లికి తీసుకొనిపోతే ఏమైనా ఇబ్బందులు వొస్తాయేమోనని సందేహం కలిగింది. అక్కడ ఆమెకు బాధ కల్గించే సంగతి ఏమైనా జరిగితే తనదే బాధ్యత. ఈ సంగతి చెబితే అరుంధతి ఏమంటుందో? తనని అర్థం చేసుకుంటుంది. తన కారణాన మాటలుపడే బాధ అరుంధతికీ తప్పుతుంది.
ఇట్లా యోచించాక భార్యని పిలిచాడు మహేంద్ర. అప్పుడామె తొట్లోకి నీళ్లు పెడుతోంది. పని మధ్యలో ఆపి వొచ్చింది. పిలిచాడే కానీ చెప్పేందుకు సందేహిస్తున్నాడు. ఎన్నడూ లేంది అతడట్లా యేదో చెప్పేందుకని వెనుకాడ్డం చూసి ఆశ్చర్యపోయింది అరుంధతి.
"ఏమిటి సార్?"
నోరు విప్పక వేరే దారి లేకపోయింది.
"చెబితే బాధపడవు కదా."
"బాధపడే సంగతయితే చెప్పకండి."
కొన్ని సెకన్ల నిశ్శబ్దం.
"కానీ చెప్పక తప్పని సంగతి."
ఆమె మాట్లాడకుండా అతడి వొంకే చూస్తోంది.
"సూరి పెళ్లికి వొక్కణ్ణే వెళ్లొద్దామనుకుంటున్నాను. సంగతేమిటంటే - నిన్ను కూడా తీసుకువెళ్తే వాళ్లు నిన్నెట్లా చూస్తారోనని సంకోచంగా ఉంది. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అందుకని..."
"ఇది చెప్పేందుకేనా ఇబ్బంది పడుతోందీ. నీ ఇష్టం. అయినా నేను బాధపడతానని ఎందుకనుకుంటున్నావ్. అక్కడి పరిస్థితి ఆ మాత్రం గ్రహించుకోలేనా. నువ్వు రమ్మంటే వొస్తా. లేకపోతే లేదు." అంటూ లోనికి వెళ్లిపోయింది - తీసుకెళ్లాలో, వొద్దో, ఆ బరువంతా అతడి మీదనే వొదిలి.
*    *    *
మహేంద్ర ఎమ్మెస్సీ పరీక్షలు రాసీ రాయడంతోటే అతడి తండ్రి గుండె జబ్బుతో చనిపోయాడు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్లో హెడ్ అసిస్టెంటుగా చేస్తూ పోవడం చేత మహేంద్రకి ఆ శాఖలోనే క్లర్కుగా ఉద్యోగం వచ్చింది. మొత్తం కుటుంబ భారమంతా అతడి మీదే పడింది. చెల్లెలు గౌతమి ఇంటర్మీడియేట్‌లోనూ, తమ్ముడు సురేంద్ర స్కూలు ఫైనల్లోనూ ఉన్నారు - తండి పోయినప్పుడు. ఒంగోలులో లెక్చరర్ ఉద్యోగం రావడంతో చేస్తున్న ఉద్యోగానికి రిజైన్‌చేసి ఒంగోలుకు వెళ్లిపోయాడు మహేంద్ర. అన్నవరప్పాడులో మంచి ఇల్లే దొరికింది. ఓనర్ల తాకిడి ఉండదు. రెండు పోర్షన్లు ఉన్న ఇంట్లో వేరే పోర్షన్లో కలెక్టరాఫీసులో ఆఫీసర్ హోదా ఉద్యోగం చేస్తున్న రామచంద్రరావు కుటుంబం ఉంటోంది. పక్క పోర్షన్లో బ్యాచిలర్ చేరబోతున్నాడని తెలిసి రామచంద్రరావు ఫ్యామిలీ అంతా ముందు భయపడ్డారు. అయితే కొద్ది రోజుల్లోనే వాళ్ల భయం అర్థం లేనిదని అర్థమయింది. అతడు చేస్తున్న ఉద్యోగం, అతడి హుందాతనం వాళ్లకి నచ్చాయి. భార్యా, కూతురూ - ఇదీ రామచంద్రరావు కుటుంబం. రామచంద్రరావు భార్య మంచితనానికి ప్రతిబింబం మల్లే అవుపించింది.
మహేంద్ర ఆ ఇంట్లోకి వొచ్చిన రెండో రోజే ఆయన కూతురు చిన్ని ఉదయమే ప్లేటుతో ప్రత్యక్షమయింది. ప్లేటులో పెసరట్టు!
"సార్! తీసుకోండి."
ఆశ్చర్యపడ్తూ "ఏమిటి?" అన్నాడు.
"ఇది పెసరట్టు. ఇవాళే కాదు, ఇంకా ఎన్నోసార్లు మీకీ బాధ తప్పదు. మా అమ్మ పంపించింది. ఊ.. తీసుకోండి" అంటూ అతడి చేతికి అందించింది. వెంటనే ఏమనేందుకూ తోచక అప్రయత్నంగా ప్లేటు అందుకున్నాడు. ఆమె ఇటూ, అటూ చూస్తూ వెళ్లబోతూ ఉంటే "ఏం చదువుతున్నావు?" అనడిగాడు.
"జూనియర్ ఇంటర్ బైపీసీ" అని నవ్వుతూ పరిగెత్తింది.
మహేంద్ర జువాలజీ లెక్చరర్ అని తెలిసినాక "మాస్టారూ నాకు జువాలజీ పాఠాలు చెబుతారా సాయంత్రాలు?" అనడిగిందో రోజు. కుదరదంటే బాధపడుతుందేమోనని "చూద్దాం" అన్నాడు, ఎటూ తేల్చకుండా. కానీ ఆ సాయంత్రమే పుస్తకంతో హాజరైన ఆమెని చూసి కాదనలేకపోయాడు. అప్పట్నించీ ప్రతీ సాయంత్రం ఆమెకు జువాలజీ సబ్జెక్ట్ చెప్పడం అతని దినచర్యల్లో ఒకటి. ఎక్కువమంది ఆడపిల్లల్లా మగాళ్లంటే, వాళ్లతో మాట్లాడటమంటే సిగ్గుపడే రకం కాదు చిన్ని. అట్లా అని అనవసరంగా కలగజేసుకొని మాట్లాడే వాగుడుకాయా కాదు. ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. ఆ ఇంటికి అందమూ, కళా ఆమె వొల్లే వొచ్చాయని మహేంద్ర నమ్మాడు. ఆమె ఇంట్లో లేనంత సేపూ ఆ ఇంట్లో అసలు మనుషులు ఉంటున్నారా అన్నంత నిశ్శబ్దం తాండవిస్తూ ఉంటుంది. దేనికోసమే దిగులుపడ్డదానికి మల్లే కళావిహీనంగా అవుపిస్తుంటుంది.
ఒకానొకరోజు కాలేజీకి సెలవు కావడంతో ఉదయం సాంబశివ టిఫిన్ కార్నర్‌లో టిఫిన్‌చేసి గదికి వచ్చాడు మహేంద్ర. సాహిత్యమంటే ఉన్న పిచ్చితో చలం 'కవి హృదయం' ఏ తొమ్మిదోసారో, పదోసారో చదువుతూ కూర్చున్నాడు. తలుపు తట్టిన చప్పుడికి "గడి తీసే ఉంది" అన్నాడు.
తలుపు తోసుకొని లోనిని వొచ్చింది చిన్ని - ఎప్పటిమల్లే చేతిలో ప్లేటుతో.
"నేను టిఫిన్ చేసొచ్చాను చిన్నీ. అవి తీసుకెళ్ళు."
"ఏం ఫర్వాలేదు. ఈ కాస్త తిన్నందునే మీ పొట్టేమీ పగిలిపోదు."
ప్లేటు వొంక చూశాడు. పులిహోర, నైవేద్యం, బఠాణీ గుగ్గిళ్లు, మినపగారెలు - యిన్ని రకాలు అందులో వున్నాయి. వాటిని చూసి అతడికి బెదురుపుట్టింది. "ఇవన్నీ తినడానికే!" తనలో అనుకుంటూ అప్రయత్నంగా పైకే అనేశాడు.
"అవును. ఇవన్నీ తినే పదార్థాలే. కాదనకూడదు. ఈ రోజు పండగని చేశాం."
"వొద్దు చిన్నీ, బలవంత పెట్టకు."
"అమ్మకి ఈ సంగతే చెప్పనా?"
అదడేమీ బదులియ్యకుండా 'కవి హృదయం' వొంక చూస్తున్నాడు.
ఆమె కూడా అటు చూసి "పోనీ నాకోసం తీసుకోలేరా?" అంది.
చప్పున ఆ పిల్ల ముఖం వొంక చూడకుండా ఉండలేకపోయాడు, యెందుకట్లా అన్నదని. యేమిటి ఆ కళ్లల్లో కన్పిస్తోంది? అభిమానమా? ఆరాధనా? అంతకంటే ఎక్కువ ఆలోచించడానికి యిద్దరి మధ్యా వున్న వయసు తేడా అడ్డమైనిల్చింది.
మౌనంగా చేయిచాపి ప్లేటు అందుకున్నాడు. ఆమె ప్రేమగా అతడి కళ్లలోకి చూస్తూ వెళ్లిపోయింది.
ఇంకో రోజు అతడు ఉదయం లేవడం బాగా ఆలస్యమయింది. లెట్రిన్‌కి పోయొచ్చి, పళ్లు తోముకోవడం అయ్యేప్పటికి కాలేజీకి బయలుదేరాల్సిన సమయం దాటింది. అతడు పళ్లు తోమేటప్పుడే బాత్‌రూంలో దూరింది చిన్ని. రెడు వాటాలకీ అదొక్కటే బాత్‌రూం కావటాన ఆమె వచ్చేదాకా అతడు ఆగాల్సిందే. కిటికీ పక్కనే బాత్‌రూం ఉంటాన ఆమె వెళ్లడం అతడు చూశాడు. కావాలని అన్నట్టేమో ఆమె దాదాపు అరగంట తర్వాత బాత్‌రూంలోంచి బయటకొచ్చింది. వచ్చి కిటికీ వైపు చూసి వెక్కిరించి ఇంట్లోకి పరిగెత్తింది. అతడికి కోపం నసాళానికంటింది. గబబగా నీళ్లు వొంటి మీద గుమ్మరించుకొని కాలేజీకి పరుగులు తీశాడు. ఎన్నడూ లేంది అరగంట ఆలస్యంగా వెళ్లాడా రోజు. అప్పటికే అటెండెన్స్ రిజిస్టర్ ప్రిన్సిపాల్ టేబుల్‌మీదకు వెళ్లిపోయింది.
"యేంటోయ్ మాకు తెలీకుండా పెళ్లిగానీ యేవన్నా చేసుకున్నావా యేం? లేటుగా వొచ్చావివాళ." - ప్రిన్సిపాల్ నవ్వుతూ అన్నా అందులో అపహాస్యమే కనిపించింది. నవ్వలేక చిర్నవ్వు విసిరి ఉసూరుమంటూ క్లాస్‌రూంలోకి నడిచాడు.
ఆ సాయంత్రం సబ్జెక్టు చెప్పించుకునేందుకు చిన్ని రాదని అనుకున్నాడు. అతడి ఊహ తప్పని నిరూపిస్తూ వచ్చింది. అయితే వొట్టిగా, పుస్తకమేమీ లేకుండా వొచ్చి తలవొంచుకు నిల్చుంది. ఉదయపు పనికి శిక్ష యేంవేస్తారన్నట్లు. మహేంద్ర ఆమెను పలకరించలేదు. కోపంగా ఉన్నాడని భావించి "మీకు కోపం పోలేదా?" అంది తలెత్తకుండా, కళ్లు మాత్రం పైకెత్తి.
"ఈ రోజు లెసన్ చెప్పించుకోడానికి రాలేదా యేం?" అనడిగాడు రూటు మారుస్తూ.
అదేమీ పట్టనట్లే "కోపం లేనట్టేనా?" అడిగింది మళ్లీ.
"నాకు కోపం వచ్చిందని ఎట్లా తెలుసు నీకు?"
"మరి పొద్దున..." ఆపి నవ్వుతోంది చిన్నగా.
కోపమంతా పోయి అతడికీ నవ్వు వచ్చింది, ఆమె ముఖం చూశాక.
"మరీ అల్లరెక్కువైపోతోందమ్మాయ్ నీకు. నీ వల్ల ప్రిన్సిపాల్ ముందు దోషినయ్యా ఈ రోజు."
"సారీ మాస్టారూ. ఇంకెప్పుడూ అట్లా చెయ్యను" అంది బుద్ధిమంతురాలికి మల్లే ఫోజు ఇస్తూ.
"మరి పాఠం సంగతి?"
"ఇవాళ వేరే సబ్జెక్ట్ చెప్పండి."
"చచ్చాను. ఏం సబ్జెక్టూ?"
"క్లాసుది కాకుండా వేరేదైనా."
"అది కూడా నువ్వే చెప్పు."
"హృదయం గురించి చెప్పొచ్చు కదా."
"నేను జువాలజీ పంతుల్ని. గుండె గురించైతే చెప్పగల్ను కానీ హృదయం గురించి యేం చెప్పగల్ను నేను."
"ఆహా.. ఉత్త అమాయకులు మాస్టారూ."
*   *   *

ఇట్లా సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు గడిచిపోయాయి. పెళ్లి చేసుకొమ్మని అమ్మ ఒత్తిడి చేస్తున్నా యేదో సాకుతో కాలం గడిపేస్తూ వొస్తున్నాడు. గౌతమి డిగ్రీ చదువు పూర్తయింది. సురేంద్ర ఇంజనీరింగ్ చదువులోకి వొచ్చాడు. గౌతమికి మంచి సంబంధం ఒకటి వొచ్చిందనీ, రెండు లక్షలు కట్నం అడుగుతున్నారనీ, అబ్బాయికి బ్యాంకు ఉద్యోగమనీ అమ్మ ఉత్తరం రాసింది. మంచి సంబంధమైతే, గౌతమికి కూడా అతడు నచ్చితే ఖాయం చెసుకొమ్మని సమాధానం రాశాడు. ఆఖరుకి ఆ సంబంధమే సెటిలయ్యింది. కట్నం డబ్బుల కోసం ఎకరం పొలం అమ్మాల్సి వొచ్చింది. ఐదేళ్ల నుంచీ తాను కూడబెట్టినదంతా పెళ్లి ఖర్చుల నిమిత్తం అమ్మకు ఇచ్చేశాడు మహేంద్ర. ఆమె బాధపడుతూనే తీసుకుంది. మహేంద్ర మాత్రం అందుకేమీ విచారపడలేదు. చెల్లి పెళ్లికి ఉపయోగపడింది కదా అనుకున్నాడు.
చిన్ని బీయస్సీ ఫస్ట్ క్లాసులో పాసయ్యింది.
"ఎమ్మెస్సీ చేయనా?" అనడిగింది మహేంద్రను.
"నేను చెప్పేదేముంది. నీ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటే అట్లా చెయ్యి" అన్నాడు.
"ఇంట్లో వొప్పుకోడం లేదు. మీరు చెప్పండి నాన్నకి."
"అదేం?"
"పెళ్లి చేసేస్తామంటున్నారు."
"ఇంకేం లక్షణంగా చేసుకోక" - ఆటపట్టించే ఉద్దేశంతో అన్నాడు.
వెంటనే జవాబు రాలేదు. ఆమె వొంక చూశాడు. పెదాలు బిగించి చూస్తోంది అతడి మొహంలోకి. ఆమె ఆశించిన భావం అతడి కల్లల్లో కనిపించలేదు. ఆమె కల్లలోని దీనత్వం మాత్రం అతడికి తెలిసింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ కళ్లు అట్లా ఎందుకైనాయి? దానికి జవాబు తట్టలేదు మహేంద్రకు.
"మీకేమీ బాధగా లేదా?" అడిగింది చివరకు. అప్పటికైనా అర్థమవుతుందేమోననే ఆశతోటి. ఎందుకు బాధ తనకు? దేనికి బాధ? ఇంకా అతడి బుర్రకు అర్థం కాలేదు. అయోమయంగా చూస్తున్నాడు.
"ఐ లవ్యూ మాస్టారూ." అంతే. అతడు తేరుకునే లోపునే, ఆమె మాటలు బుర్రకెక్కి అతడు రియాక్ట్ అయ్యే లోపునే అక్కణ్ణించి మాయమైంది.
హృదయం స్వాంతన పడినాక యోచిస్తూ ఉండిపోయాడు. తన జీవితం ఇంతదాకా ఎట్లా నడిచిందో నెమరేసుకున్నాడు. తనేం సాధించాడో అర్థం కాలేదు. తన ఒంటరి బతుక్కి అర్థమేమిటి? పెళ్లి విషయమై ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచించలేదు. ఆర్థికంగా సెటిలై ఐదేళ్లయినా తన దృష్టి అటేపు పోలేదు. ఇప్పుడనిపిస్తోంది, తనకో తోడు - అదీ స్త్రీ కావాలని. ఒక్కసారి తన క్లాస్‌మేట్లనీ, స్నేహితుల్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. తెలిసినంతవరకూ అందరికీ పెళ్లిళ్లయిపోయి కాపురాలు చేస్తున్నారు. అందులో చాలామందికి పిల్లలు కూడా. ఎలుగుబంటిలా ఉండే ఓ స్నేహితుణ్ణి 'వీడికి పిల్లనెవరిస్తార్రా' అని యెగతాళి చేసేవాళ్లు. అతనికీ పెళ్లయి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. తాను మాత్రం ఇంకా బ్రహ్మచారిగానే మిగిలున్నాడు.
*   *   *
చిన్ని పట్టుబట్టి ఎమ్మెస్సీలో చేరింది.
'ఐ లవ్యూ' అన్నప్పట్నించీ చిన్ని అతని కంటికి కొత్తగా అవుపిస్తోంది. స్త్రీలోని అందాలు తెలుస్తున్నాయి. పూర్ణాకృతి పొంది ఉండటంతో నడుస్తున్నప్పుడు ఊగే వక్షమూ, పచ్చగా వొంపు తిరిగిన నడుమూ అతడి ఆలోచనల్లో కొత్తదనాన్ని తీసుకొస్తున్నాయి.
ఓసారి అడిగాడు - "మన మధ్య వయసు తేడా సంగతి ఆలోచించావా?"
"మహా అయితే పదేళ్లు. అంతేగా. ఈ మధ్య ముప్పై ఆరేళ్లు ఉన్న మగాళ్లు సైతం పదహారేళ్ల పిల్లల్ని చేసుకుంటున్నారు తెలుసా! ఇరవయ్యేళ్లు తేడా ఉన్నా మిమ్మల్ని ప్రేమిస్తాను."
"ఈ ప్రేమలో నాకంత నమ్మకం లేదు."
"నమ్మకం కలగాలంటే ఏం చేయాలి?"
దీనికి అతడి వద్ద సమాధానం సిద్ధంగా లేదు.
"పెళ్లి చేసుకునేందుకు నేను పనికిరానా?" - మళ్లీ తనే అడిగింది.
'నేనే పనికిరాను నీకు' - అందామనుకున్నాడు. అనలేకపోయాడు. అట్లాంటి రత్నం దూరమైపోతుందనే భయం కలిగి తనకు తెలీకుండానే చప్పున ఆమెను కావలించుకున్నాడు. నున్నగా జారిన మెడవొంపులో ముద్దు పెట్టుకున్నాడు. అతడి మొహాన్ని పట్టుకొని తన వొంతుగా పెదాలతో అతడి మొద్దు పెదాల్ని కప్పేసింది. మొదటిసారిగా కలిగిన స్త్రీ స్పర్శలోని సౌఖ్యానికి మైకం కమ్మిన మహేంద్ర రక్తం మరిగిపోయింది. నరాలన్నీ గిలగిలా కొట్టుకున్నాయి. నిశ్చయమైపోయింది - చిన్నీని తను వొదలలేడని.
చిన్నీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాక వాస్తవం మహేంద్రను కొంచెం భయపెట్టింది. ఇద్దరి కులాలూ ఒకటి కావు. సాంఘికంగా మహేంద్ర వాళ్ల కులం కంటే చిన్ని వాళ్ల కులం తక్కువ స్థాయిది. చిన్ని వాళ్లింట్లో పెద్ద అభ్యంతరమేమీ అవుపించలేదు. పై కులం వాడు తనకు అల్లుడు కాబోతున్నందుకు రామచంద్రరావు ఆనందపడ్డాడనేది నిజం. ఆయన భార్య అయితే కూతురి గురించిన దిగులేమీ అవసరం లేదన్న నిశ్చింతతో తబ్బిబ్బయ్యింది. అయితే తన వైపు వాళ్లనుంచే చిక్కంతా వొచ్చింది. ఈ విషయమై అమ్మకు ఉత్తరం రాశాడు మహేంద్ర. ఆమె కట్టుబాట్లు, సంప్రదాయాలకు బానిస. బంధుగణం అంతా తనను ఎగతాళి చేస్తున్నట్లూ, పరువంతా మట్టిగొట్టుకు పోతున్నట్లూ ఊహించుకుని హడలిపోయింది. డబ్బు లేకపోయినా బతుకు సాగుతుంది కానీ పరువు లేకుండా బతికేది ఏట్లా? తన జీవిత భాగస్వామిని తన కొడుకే నిర్ణయించుకున్నాడని ఆమె యోచించలేకపోయింది. పరువుకీ, బంధువులకీ ఆమె బందీ.
అమ్మకు ఇష్టం లేకుండా చిన్నీని పెళ్లి చేసుకోడానికి ముందు సందేహించాడు మహేంద్ర. కానీ చిన్నీని వొదులుకునేందుకు హృదయం కాస్త కూడా వొప్పుకోలేదు. అతడు అమ్మను ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. అందుచేత అమ్మకు బాధ కలిగిస్తున్నాననే విచారం ఉన్నా దిగమింగి, తర్వాత ఎట్లానైనా ఆమెను కన్విన్స్ చేయొచ్చుననే విశ్వాసంతో చిన్నీని తన జీవితంలోకి ఆహ్వానించాడు. పిలుపు అందినా పెళ్లికి ఎవరూ రాలేదు. తమ్ముడు కానీ, చెల్లెలు కానీ.
*   *   *
కృష్ణా ఎక్స్‌ప్రెస్ వేగం అందుకుంది. కిటికీ పక్కనే కూర్చుని తలని మహేంద్ర భుజానికి ఆనించింది అరుంధతి. మహేంద్ర యోచిస్తూ ఉన్నాడు. పెళ్లిలో చిన్నీని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అక్కడి జనం, ముఖ్యంగా అమ్మ అని భయపడ్డాడు. కానీ అక్కడకు వెళ్లాక అట్లాంటిదేమీ ఎదురుకాలేదు. అందుకతడికి చాలా ఆశ్చర్యం వేసింది. కాలమే అన్ని సమస్యల్నీ పరిష్కరిస్తుందనే సూక్తి దీనికీ వర్తిస్తుందనిపించింది. లేకపోతే అరుంధతిని పెళ్లిచేసుకున్నందుకు తన మీద కోపం వహించిన అమ్మ అట్లా ఆప్యాయంగా ఎట్లా దగ్గరకు తీసుకుంది - చిన్నీని.
సురేంద్ర పెళ్లికి ఒకరోజు ముందుగా వెళ్లాడు మహేంద్ర. ముందు తనొక్కడే వెళ్లాలని అనుకున్నా ఆఖరుకి చిన్నీని కూడా వెంట తీసుకువెళ్లాడు. ఆమె లేకుండా తనొక్కడే వెళ్లడం తప్పని తోచింది. చాలా కాలం తర్వాత చిన్నితొడుగా తొలిసారిగా సొంత ఇంట్లోకి అడుగుపెడ్తుంటే ఆనందమూ, తృప్తీ కలిగాయి. స్వాగతం ఎట్లా లభిస్తుందోనని పడ్డ ఆందోళనంతా అమ్మ ఆప్యాయంగా పలకరించడంతో పోయింది. చాన్నాళ్ల తర్వాత కలుసుకోడం చేత తల్లీకొడుకుల ఇద్దరి కళ్లల్లోనూ నీళ్లే.
"నీ కోడలు అరుంధతి" అని పరిచయం చేశాడు చిన్నీని.
తల్లి రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె కళ్లల్లో కోడలి పట్ల ఎట్లాంటి ద్వేషమూ కనిపించలేదు. ఒక్క నిమిషం పరీక్షగా చూసి కొడల్ని దగ్గరకు తీసుకుంది. అందరికీ కోడల్ని తనే పరిచయం చేసింది. పెద్ద కోడల్ని చూసిన తర్వాత ఆమె మొహంలో ఊహించనంత వెలుగుని చూసి బంధువులు ఆశ్చర్యపోయారు. మహేంద్ర హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. చాలామంది చిన్నీ గురించి మాట్లాడుకోవడం అతను విన్నాడు. ఒక చుట్టమైతే "మహేంద్ర పెళ్లాం చిలకలాగా ఉంది" అనడం విన్నాడు. గర్వంతో నవ్వుకున్నాడు. సురేంద్ర సైతం ఒదినని ఆత్మీయంగా పలకరించాడు. పెళ్లయినాక భార్యకు ఒదినని పరిచయం చేశాడు. నిమిషాల్లోనే తోడికోడళ్లు స్నేహితులైపోయారు. కోడళ్ల స్నేహం చూసి మహేంద్ర వాళ్లమ్మకు ఎన్నడూ కలగనంత ఆనందం కలిగింది.
పెళ్లి సందడంతా పూర్తయినాక సెలవులు అయిపోవడంతో తిరుగు ప్రయాణమయ్యారు మహేంద్ర, అరుంధతి. మరికొన్ని రోజులు ఉండమని బతిమలాడింది అమ్మ. ఆమెని ఒప్పించి, కొంతకాలం తనవద్దకు వొచ్చి ఉండేట్లుగా మాట్లాడి రైలెక్కారు. అరుంధతి అయితే అత్తయ్యను రమ్మని మరీ బలవంతం చేసింది. వీళ్లు వెళ్లేప్పుడు కోడల్ని కావలించుకుని కన్నీళ్లు పెట్టుకుందామె.
"చిన్నీ, నేను ఊహించలేదు, అమ్మ అట్లా స్వాగతమిస్తుందని. ఏం మహత్యం ఉంది నీలో" అన్నాడు మహేంద్ర. కూపేలో వాళ్లిద్దరే ఉన్నారు.
"మరి చిన్నీ అంటే ఏమనుకున్నావ్?" అంటా చిటికవేసి, నవ్వి "ఊరికే అన్నా" అంది. మళ్లీ తనే "నా మహత్యమేం లేదు. కొడుకు మీద ఏ తల్లికైనా కోపం ఎంతకాలం ఉంటుందనీ. ఎంతటి బాధనైనా కాలం మాన్పేట్టు చేస్తుంది. నీ విషయమైనా అంతే అయ్యింది."
"నా సంగతి సరే. నిన్ను  మరీ అట్లా అతుక్కుపోయిందేమిటా అనేదే నాకు వింతగా ఉంది."
"ఆ సంగతి నేనూ ఖచ్చితంగా చెప్పలేను. ఆయితే ఆమె ఊహలకు తగ్గట్లుగా ఉన్నానేమో అనిపించింది నాకు. పైగా అత్తయ్య నన్నో కోరిక కోరింది."
"ఏమిటది?" అతడి గొంతులో కుతూహలం.
"తనని నాయనమ్మని ఎప్పుడు చేస్తున్నారంది."
చప్పున ఆమెని కావలించుకుని "నువ్వు నా బంగారానివిరా" అంటా పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు మహేంద్ర.

-------------- x --------------

- 'సుప్రభాతం' వారపత్రిక, 5 అక్టోబర్ 1997.

No comments: