Sunday, October 5, 2014

Society: Are Women Consumer Goods?

స్త్రీ వినియోగ వస్తువా?

ఇవాళ స్త్రీ సౌందర్యం పెద్ద వినియోగ సరుకు అయ్యింది మార్కెట్లో. సినిమాల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ స్త్రీ శరీరాన్ని అసభ్యంగా, అశ్లీలంగా చూపించడం అప్పుడప్పుడూ చర్చకు వస్తున్నా ఫలితం మాత్రం శూన్యమే. అయితే కొన్ని పెద్ద పత్రికలుగా ముద్ర వేయించుకొన్న ఇంగ్లీష్ పత్రికలతో పాటు సెక్స్‌మీదే ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న కొన్ని తెలుగు పత్రికల ముఖచిత్రాల మీద అర్ధనగ్నంగా, అంతకంటే ఎక్కువగా కూడా స్త్రీ దేహం ప్రత్యక్షమవుతోంది. దిన, వార, మాస పత్రికలు అమ్మే అన్ని బుక్‌షాపుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. ఏదైనా మంచి పత్రిక కొందామని అక్కడకి వెళ్లే స్త్రీలు ఎదురుగా కనిపిస్తున్న ఆ పత్రికలను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది.
స్త్రీకి సౌందర్యం ప్రకృతి సహజంగా వచ్చింది. అంతమాత్రం చేత నిస్సంకోచంగా పత్రికల ముఖచిత్రాల కోసం ఆ సౌందర్యాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సరైనది? తమ చర్య కేవలం పురుషుల్లోని మృగవాంఛను తృప్తి పరచడానికే తప్ప మరోరకంగా ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రస్తుతం మన దేశ మార్కెట్ 'తిలకించు.. ఆనందించు..' అనే భావనలో కొట్టుకుపోతోంది. దీన్ని డబ్బు చేసుకోవడం కోసం కొంతమంది చేసే ప్రయత్నంలో యువతులు మార్కెట్ సరుకు కింద మారిపోతున్నారు. కవ్వింపు ఫోజుల్లో, లేస్ చేసిన లో దుస్తుల్లో, బిడియం, సిగ్గు లేకుండా అతి తక్కువ దుస్తుల్లో దర్శనమివ్వడాన్ని కొంతమంది యువతులు ధీరత్వంగా భావించడం ఏ సంస్కృతికి నిదర్శనమో అర్థంకాదు.
దిగంబర మోడలింగ్ అనేది చాలాకాలం క్రితమే పుట్టింది. అప్పట్లో దేహాన్ని అమ్ముకొనే వ్యభిచారిణులు మాత్రమే ఆ తరహా మోడలింగ్‌కు ఒప్పుకొనేవాళ్లు. పైగా వాళ్ల ఆర్థిక స్థితి అందుకు దోహదం చేసేది. అయితే ఇప్పుడు సంపన్న యువతులు సైతం ఈ మోడలింగ్‌కు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. డెబొనైర్, ఫాంటసీ వంటి పేరున్న పత్రికలు తమ పత్రికల్లో నగ్నంగా ఫోజు ఇస్తే రూ. 15,000 నుంచి రూ. 20,000 దాకా పారితోషికం ఇస్తుండగా, చాస్టిటీ, గయ్స్ ఎన్ గాళ్స్, బిఎం యాడ్స్, గ్లాడ్‌రాగ్స్, బాంబే ఎయిట్ వంటి పత్రికలు రూ. 10,000 దాకా ఇస్తున్నాయి. గృహిణులు, విద్యార్థినులు, ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు కూడా ఆ రకమైన ఫోజులిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. సాంఘిక రీతి రివాజులపై తిరుగుబాటు చేయాలన్న తపన, సంప్రదాయ విరుద్ధంగా, కొత్తగా కనిపించాలన్న ఆత్రుత తమను శారీరక ప్రదర్శనకు పురికొల్పాయని వాళ్లు చెబుతున్నారు. అయితే తమ చర్యవల్ల లబ్దిపొందేది పురుష పుంగవులేననే స్పృహను వాళ్లు విస్మరిస్తున్నారని చెప్పాలి.
సెక్స్‌ను మించిన సరకు లేదనే వ్యాపార వ్యూహంతో రంగంలోకి దిగిన ఆయా పత్రికల యాజమాన్యాలు మాత్రం తమ ఊహలకు మించి యువతులు నగ్నఫోజులిచ్చేందుకు ముందుకు వస్తుండటంతో తెగ ఆనందపడుతున్నారు. ఇరవై మప్పై వేల కాపీల నుంచి లక్ష కాపీలపైనే వాళ్ల పత్రికలు అమ్ముడవుతుండటం సమాజంలోని విలువల పతనానికి నిదర్శనం. 50 రూపాయల ధర ఉండే సంచిక వల్ల ఈ పత్రికలు తమ మనుగడ కోసం, ఆదాయం కోసం వ్యాపార ప్రకటనలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అయినా వ్యాపార ప్రకటనలు కూడా వీటికి బాగానే వస్తున్నాయి. ఈ రకంగా ఆర్థికంగా గట్టి పునాదులపై నిల్చిన ఈ పత్రికలు ముందుకు దూసుకెళ్లడంలో ఆశ్చర్యం లేదు. అయితే తమ వలువలు విడిచి ఫోజులివ్వాలన్న ఆలోచనని యువతులు మానుకునేలా చేయాల్సిన బాధ్యతను విలువలకు విలువనిచ్చే స్త్రీలు చేపట్టాలి. దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీ సంఘాలు ఈ విషయమై కార్యాచరణ రూపొందించి ముందుకు నడవాలి. లేదంటే స్త్రీని కేవలం భోగవస్తువుగా మాత్రమే చూసే ధోరణి మరింత పెచ్చరిల్లుతుంది.

- ఆంధ్రభూమి డైలీ, 14 డిసెంబర్ 2002


No comments: