Sunday, April 28, 2013

బంగారు మనసులు (1973)- రివ్యూ


విధి వక్రిస్తే, అంతవరకు అనుకూలించినవి కూడా అవరోధాలుగా మారి లేనిపోని అనర్థాలకూ, అవమానాలకూ దారితీస్తాయనీ, ఎదురీదడానికి ఎంత యత్నించినా, ఫలితం శూన్యమనీ, నీతికీ, నిజాయితీకీ కట్టుబడి కష్టాల్ని ఓర్పుతో స్వీకరిస్తే ఒకనాటికి మంచి జరుగుతుందనీ తెలిపే సినిమా 'బంగారు మనసులు'.
చిక్కటి సంఘటనలు నిండిన చక్కటి కథ రాసిన కృష్ణమోహన్ సంభాషణల్నీ ప్రతిభావంతంగా రాశారు. 'కొరడా రాణి' దర్శకుడూ, 'బంగారు మనసులు' దర్శకుడూ ఒక్కరే అంటే నమ్మబుద్ధి కాదు. కథను సాఫీగా నడిపించి, తికమకలు లేకుండా చిత్రాన్ని రూపొందించారు కె.ఎస్. రెడ్డి. సత్యం సంగీతం, కన్నప్ప ఛాయ ఆకట్టుకుంటాయి.
కథానాయకిగా జమున ఆద్యంతం డామినేట్ చేసింది. పరికిణీ పిల్లగా ఆమె చాలా అందంగా కనిపించింది. ఉత్తమ పాత్రపోషణ కూడా ఆమెదే. కృష్ణకుమారి గెస్టుగా నటించింది. అంతవరకు విలన్, క్యారెక్టర్ రోల్స్ వేస్తూ వచ్చిన సత్యనారాయణ సానుభూతి పొందే కథానాయకుడి పాత్రని కూడా చక్కగా చేయగలడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సహాయ భూమికలు చేసిన వారంతా పరిధుల మేరకు రాణించారు.

No comments: