Saturday, February 5, 2011

హిట్.. హిట్.. హుర్రే...!: ఖుషి

తారాగణం: పవన్‌కల్యాణ్, భూమిక, అలీ, సుధాకర్, శివాజీ, విజయ్‌కుమార్, నాజర్, రాజన్ పి. దేవ్, సుధ, ముంతాజ్, జానకి, డింపుల్, ఎస్.జె. సూర్య (అతిథి పాత్ర)
మాటలు: రాజేంద్ర కుమార్
పాటలు: పింగళి, ఎ.ఎం. రత్నం, చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, అబ్బాస్ టైర్‌వాలా
సాంగ్స్ కాన్సెప్ట్: పవన్‌కల్యాణ్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
కూర్పు: బి. లెనిన్, వి.టి. విజయన్, కోలా భాస్కర్
యాక్షన్: విజయ్
యాక్షన్ సీక్వెన్సెస్ రూపకల్పన: పవన్‌కల్యాణ్
కొరియోగ్రఫీ: బృంద, హరీశ్‌పాయ్
ఆడియోగ్రఫీ: హెచ్. శ్రీధర్
ఆర్ట్: ఆనంద్‌సాయి
పబ్లిసిటీ డిజైనర్: లంక భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అళహరి రఘురాం
నిర్మాత: ఎ.ఎం. రత్నం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె. సూర్య
బేనర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 27 ఏప్రిల్, 2001

చిరంజీవికి అసలు సిసలు వారసుడు వచ్చాడు.. అందరినోటా ఈ మాట అనిపించేట్లు చేసిన సినిమా 'ఖుషి'. అప్పటికే  'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి' చిత్రాల విజయాలతో మంచి జోష్ మీదున్న పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ని అమాంతం శిఖరం మీద నిలిపిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాతో యువతరంలో తిరుగులేని ఆరాధ్యతారగా రాపుదాల్చాడు పవన్‌కల్యాణ్.  
నిజం చెప్పాలంటే మెగాస్టార్‌గా నెంబర్‌వన్ హోదాని అనుభవిస్తోన్న చిరంజీవినే సవాలుచేసే స్థాయికి ఆయన్ని చేర్చింది ఈ సినిమా. 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'ఖుషి', ఐదు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. వాణిజ్యపరంగా కానీ, అభినయపరంగా కానీ కల్యాణ్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ చిత్రం ఇదే. పైగా ఇది ఆయనలోని సృజనాత్మక ప్రతిభని కూడా బయటపెట్టిన తొలి సినిమా. ఇందులోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డిజైన్ చేసింది ఆయనే. అంతేనా, ఆరింటిలో మూడు పాటల కాన్సెప్ట్ ఆయనదే. మామూలుగా మనం చూసే ఫైట్లకీ, పాటలకీ అవి ఎంత భిన్నంగా ఉన్నాయో, అంత బాగానూ అవి ఆకట్టుకున్నాయి. అలరించాయి. ఇక పవన్‌కల్యాణ్, భూమిక జోడీ 'క్యూట్ పెయిర్'గా పేరు తెచ్చుకుని యువతలో అపూర్వమైన క్రేజ్ సంపాదించుకోవడం మనలో చాలామందికి తెలిసిందే. అలాగే ఆ రోజుల్లో ఎక్కడ విన్నా 'ఖుషి' పాటలే. ఆరుకి ఆరూ సూపర్ హిట్. 'మిస్సమ్మ'లోని 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట రీమిక్స్ సైతం ఇన్‌స్టంట్ హిట్. 
అలాంటి ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం. దీని మాతృక తమిళంలో విజయ్, జ్యోతిక జంటగా నటించగా 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన 'ఖుషి' చిత్రం. చెప్పుకోదగ్గ విశేషమేమంటే ఒరిజినల్ సాధించిన విజయన్ని మించి తెలుగు రీమేక్ మరింత పెద్ద విజయం సాధించడం. మాతృకని రూపొందించిన ఎస్.జె. సూర్య ఈ రీమేక్‌నీ డైరెక్ట్ చేశాడు. శ్రీ సూర్యా మూవీస్ బేనర్‌పై ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాల్ని అందించిన ఎ.ఎం. రత్నం ఈ సినిమాకి నిర్మాత. సినిమా ఆద్యంతం 'రిచ్'గా కనిపించిందంటే - అందుకు కారణం సూర్య దర్శకత్వ ప్రతిభకి రత్నం ఉన్నతస్థాయి నిర్మాణ విలువలు తోడవడమే. పేరుకి రీమేక్ అయినా మాతృకని మించిన 'నవ్యత' తెలుగు 'ఖుషి'లో అడుగడుగునా గోచరిస్తుంది. ఫైట్లు, పాటల విషయంలోనే కాక సన్నివేశాల కల్పనకూ ఇది వర్తిస్తుంది. అందుకే "ఇది తమిళ వెర్షన్‌ని మక్కీకి మక్కీ కాపీ చేసిన సినిమా కాదు. తమిళం కంటే తెలుగు సినిమా మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుంది" అని చెప్పారు పవన్‌కల్యాణ్. చాలామందికి తెలీని సంగతి ఇంకోటుంది. సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ మాటల్లో చెప్పాలంటే "తమిళ వెర్షన్‌లో కోల్‌కతా ఎపిసోడ్ లేదు. అక్కడ ఆ ఎపిసోడ్ వేరేవిధంగా ఉంటుంది. కోల్‌కతా నేపథ్యంలో ఆ ఎపిసోడ్ తెచ్చింది కల్యాణే".
'ఖుషి' యువతరాన్ని ఇంత గొప్పగా ఆకట్టుకోవడానికి కారణమేంటి? కథ పరంగా చూస్తే చెప్పుకోడానికి ఏమీలేదు. అతి సన్నని లైను మీద అల్లుకున్న సన్నివేశాల సమాహారం మాత్రమే. ఏమిటా లైను. మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఇద్దరు యువతీ యువకుల మధ్య సున్నితంగా నడిచే ప్రేమ వ్యవహారం. అదీ కూడా చివరి రీలులో తప్ప ఇద్దరూ తమ ప్రేమని ఎదుటివాళ్ల వద్ద వ్యక్తం చేయరు. ఎప్పుడూ 'అహం' (ఇగో) ప్రదర్శిస్తూ గొడవపడుతూనే ఉంటారు. అయినా ఒకరంటే ఒకరికి ఎనలేని అనురాగం. అలాంటి ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సున్నితంగా సాగే రొమాన్స్‌ని ఇంకెంత సున్నితంగా నడపాలి! పాత 'మిస్సమ్మ' గుర్తుంది కదా. ఎన్‌టీఆర్, సావిత్రి పాత్రలు గుర్తున్నాయి కదా. అందులో ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత అనురాగం. కానీ దాన్ని బయటపెట్టడానికి ఇద్దరికీ 'అహం' అడ్డు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ఖుషి'లో పవన్‌కల్యాణ్, భూమిక పోషించిన సిద్ధార్థ్‌రాయ్, మధుమతి పాత్రలు వాటికి కొనసాగింపు. నాటి పాత్రల స్వభావాన్ని అందిపుచ్చుకుని నేటి పాత్రల్ని మలచాడు సూర్య. అదీ, అత్యంత ఆకర్షణీయంగా. అందుకే ఆ పాత్రల్లో తమని తాము చూసుకున్నారు కాలేజీ యువత. ఆ పాత్రలతో సహానుభూతి చెందారు. 'ఖుషి' చేసుకున్నారు. వాళ్లని అంతగా ఆకట్టుకున్న సిద్ధార్థ్‌రాయ్, మధుమతి కథేమిటో ఓసారి చూద్దాం. 

కథాసంగ్రహం:
కోల్‌కతాలో సిద్ధార్థ్‌రాయ్ అలియాస్ సిద్ధు (పవన్‌కల్యాణ్), కైకలూరులో మధుమతి అలియాస్ మధు (భూమిక) దాదాపు ఒకే సమయంలో పుడతారు. కాలేజీలో సిద్ధుకి బెంగాల్ టైగర్ అని పేరు. అతని తండ్రి తెలుగువాడైతే, తల్లి బెంగాలీ. మాస్టర్స్ డిగ్రీ కోసం కెనడాకి వెళ్లాలనేది సిద్ధు కోరిక. తల్లికి ఇష్టముండదు. ఎమ్మెస్ చదవాలనేది మధు లక్ష్యం. తండ్రి బాపిరాజు (విజయ్‌కుమార్) ఒప్పుకోడు. 'మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవాలి' అంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తండ్రిని చూసి పెళ్లికి సరేనంటుంది మధు. పెళ్లిరోజు 'ఇంతకు ముందే నేనో అమ్మాయిని ప్రేమించా. ఆమె ఆత్మహత్యకు సిద్ధపడింది. ఆమె వద్దకి వెళ్తున్నా. నన్ను క్షమించండి' అంటూ ఆ కనిపించని వరుడు ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.
కెనడాకని కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సిద్ధు రోడ్డు మీద సిగ్నల్స్ వద్ద అడ్డం వచ్చిన ఓ యువకుణ్ణి (ఎస్.జె. సూర్య) తప్పించబోయి, ఇంకో కారుని గుద్దేస్తాడు. హాస్పిటల్లో తేలతాడు. రెండు నెల్లు బెడ్ రెస్ట్ తప్పదంటారు డాక్టర్లు. పెళ్లి తప్పిన మధు, కెనడా ప్రయాణం ఆగిన సిద్ధు హైదరాబాద్ నిజాం కాలేజీలో అడుగుపెడతారు. అక్కడ సిద్ధుకి స్నేహితుడైన బాబు (శివాజీ), మధుకి ఫ్రెండయిన శాంతి (డిపుల్) ప్రేమలో పడతారు. బాబు అనాథ అయితే శాంతి పేరుపొందిన గూండా గుడుంబా సత్తి (రాజన్ పి. దేవ్) కూతురు. ఆ ఇద్దరికీ సిద్ధు, మధు సాయపడుతుంటారు. ఆ రకంగా ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితమవుతారు. ఓసారి చదువుకుంటున్న మధు వద్దకు వచ్చి పలకరిస్తాడు సిద్ధు. 'డోంట్ డిస్టర్బ్. చదువుకుంటున్నా' అంటుంది మధు. కొద్ది దూరంలో కూర్చుని సిద్ధు ఆమె వంక చూస్తే గాలికి పైట తొలగి అనాచ్చాదితమైన ఆమె నడుము, నాభి.. చూపు తిప్పుకోలేకపోతాడు. మధు తనవైపు చూడగానే తల తిప్పుకుంటాడు. ఇలా మూడు నాలుగుసార్లు జరగడంతో సిద్ధు ఏం చూస్తున్నాడో అర్థమై అతడితో గొడవపెట్టుకుంటుంది మధు. 'నువ్వు నా నడుం చూశావు' అని మధు అంటే 'లేదు' అంటాడు సిద్ధు. ఇద్దరి మధ్యా వాదన జరుగుతుంది. "అసలిలాంటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చెయ్యను. ఒకవేళ చేసినా అది లవ్‌దాకా రాదు. వచ్చినా అది మ్యారేజ్ దాకా వెళ్లదు. ఖర్మకాలి నన్ను బలవంతంగా పెళ్లికి దింపినా కానీ, ఇలాంటమ్మాయి వొద్దని లెటర్‌రాసి పారిపోతా" అనికూడా అంటాడు. దాంతో ఏడుస్తూ "సిద్ధు అనేవాణ్ణి లైఫ్‌లో కలవలేదనే అనుకుంటా. నథింగ్ బిట్వీన్ యు అండ్ మి" అంటా వెళ్లిపోతుంది మధు. 
బాబు, శాంతికి సిద్ధు సాయపడుతుండటంతో అతడిమీద సత్తి మనుషులు ఎటాక్ చేస్తారు. ఒకడు సిద్ధుని కత్తితో పొడవబోవడం చూసిన మధు ఆ కత్తిని చేతితో గట్టిగా పట్టుకుని గాయపడుతుంది. ఆమెని హాస్పిటల్లో చేరుస్తాడు సిద్ధు. ఇద్దరూ మళ్లీ దగ్గరవుతున్నట్లే వుంటారు కానీ ఇగోలు తగ్గవు. శాంతికి పెళ్లి నిశ్చయం చేస్తాడు సత్తి. దాంతో శాంతి, బాబుకు గుళ్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు సిద్ధు. సత్తి, అతని అనుచరులు అక్కడికి వస్తుంటే మధ్యలో అటకాయించి, వాళకి తన కత్తి పదును రుచి చూపిస్తాడు. స్నేహితులమైన మేమే వాళ్ల పెళ్లికి సాయపడుతుంటే, తండ్రివైన నీవెందుకు వాళ్ల పెళ్లిని అడ్డుకుంటున్నావని అడుగుతాడు సత్తిని. అతని మంచి మాటలతో రియలైజ్ అయిన సత్తి మంచివాడిగా మారిపోయి, వధూవరుల మీద అక్షింతలు చల్లుతాడు. ఎవరిదారిన వాళ్లు ఆనందంగా వెళ్లిపోతారు. చదువులు అయిపోతాయి. విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. సూట్‌కేసులు సర్దుకుంటుంటే మధు, సిద్ధు హృదయాలు ఆవేదనాభరితం అవుతాయి. ఒకరి మనసులోని భావం మరొకరికి చెప్పుకోవాలనుకుంటారు. కుదరదు. సిద్ధు ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తున్నాడని మధుకీ, మధు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లబోతున్నదని సిద్ధుకీ తెలుస్తుంది. స్టేషన్‌లో మధు కోసం గౌతమిలో సిద్ధు, అతని కోసం ఫలక్‌నామాలో మధు వెతుకుతారు. కనిపించకపోయేసరికి మధుకివ్వమని సిద్ధు, సిద్ధుకివ్వమని మధు పక్క సీట్లలో ఉన్నవారికి ఓ లెటర్ ఇచ్చి వాళ్లు వచ్చాక ఇవ్వమంటారు. రైలుబళ్లు కదులుతాయి. ఉత్తరాలు అందుతాయి. 'ఐ లవ్ యు మధు' అని సిద్ధు, 'ఐ లవ్ యు సిద్ధు' అని మధు రాసుకుంటారు. 'నన్ను ప్రేమించడానికీ, నాతో గొడవపడ్డానికీ నువ్వు కావాలి సిద్ధూ' అని కూడా రాస్తుంది మధు.

తెలుగు 'ఖుషి' మరింత సృజనాత్మకం
-పవన్‌కల్యాణ్
రీమేక్ అంటే రీమేకే. కథ విషయానికి వస్తే 'ఖుషి' ఒరిజినల్ కాకపోవచ్చు. కానీ చాలా సన్నివేశాల్లో, ఫ్రేముల్లో ఒరిజినాలిటీ ఉంది. పాటలు, ఫైట్లు కొత్తగా డిజైన్ చేశాం. రెండు భాషల్లోనూ 'ఖుషి' చూస్తే ఆ సంగతి మీకు అర్థమవుతుంది. అంటే తమిళ మాతృకని మేం మక్కీకి మక్కీ కాపీ చేయలేదు. సృజనాత్మకత పరంగా చూస్తే చిత్రంలో చాలా కొత్త ఐడియాలు ప్రవేశపెట్టాం. మాతృక కంటే తెలుగు వెర్షన్ మరింత సృజనాత్మకంగా, మరింత వైవిధ్యంగా ఉంటుందనే సంగతి తెలుస్తుంది.
దర్శకుడు సూర్యలో ఏదైనా కొత్తగా చేయాలనే తపన అధికం. నేనూ అలాంటి నావెల్టీనే కోరుకుంటా కాబట్టి మామధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరింది. అందువల్లే ఫైట్స్‌నీ, కొన్ని పాటల్నీ నేను డిజైన్ చేశా. కొన్ని సన్నివేశాల్నీ సమన్వయంతో చేసుకుపోయాం. ఈ సినిమాకి రత్నం నిర్మాత కావడం పెద్ద ప్లస్ పాయింట్. దేనికీ ఆయన 'నో' చెప్పలేదు. 

(వచ్చేవారం 'ఖుషి' ఘనవిజయానికి దోహదం చేసిన అంశాలు) 

No comments: