Tuesday, January 18, 2011

మూసధోరణులు ఇంకెంతకాలం?

గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు తెలుగులో టీనేజ్ హీరోలు రంగప్రవేశం చేస్తుండటంతో పాతుకుపోయిన హీరోల ఇమేజ్ పునాదులు నెమ్మదిగానైనా కదులుతున్నాయి. పాత కథలు, కొత్తదనంలేని కథనాలు, పాత ముఖాలు  చూసీచూసీ జనానికి కూడా విసుగొస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే కొత్తదనం కోసం, కొత్త కథల కోసం, కొత్త ముఖాల కోసం ఆబగా ఎదురుచూస్తున్నారు.తరుణ్, ఉదయ్‌కిరణ్, సాయికిరణ్ వంటి టీనేజ్ హీరోలు తమకి వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతుంటే అగ్రహీరోలు, ఆ తర్వాతి స్థాయి హీరోలు తమ స్థానాల్ని పడిపోకుండా చూసుకోడానికి నానా పాట్లూ పడుతున్నారు.
కొత్త కథలు సృష్టించడం మనవాళ్లకి ఒక అరుదైన సందర్భంగా మారిపోయింది కాబట్టి కనీసం కథనంలోనైనా కొత్తదనాన్నీ, చాకచక్యాన్నీ చూపించి 'సినిమా భలేగా ఉంది' అనిపించగల సత్తా కూడా మనవాళ్లలో మృగ్యమై పోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాల్లో కథలు సహనానికి పరీక్ష పెట్టడం సాధారణ విషయమైపోయింది. వాటిల్లో కృత్రిమత్వం తప్ప సహజానుభూతులు ఏమాత్రం వుండటంలేదు. వాటికి భారీ నేపథ్యాలూ, డబ్బూ ఖర్చుపెట్టి ప్రేక్షకుల మీదికి వదిలేస్తున్నారు. ఆ చిత్రాల్లో పాటల చిత్రీకరణగానీ, వాటి ట్యూన్లుకానీ మరీ నాసిరకంగా వుంటున్నాయి. కొన్ని పాటల్ని చూస్తే- అవేం పాటలో, ఎందుకలా వున్నాయో అసలు అర్థంకాదు. సాక్ష్యం కావాలంటే 'ప్రేమతో రా', 'భలేవాడివి బాసూ', 'ఆకాశవీధిలో' పాటల్ని చూడవచ్చు.
పెద్ద హీరోల చిత్రాల్లో డాన్సులూ, ఫైట్లూ లేకపోతే జనం చూడరనే ఓ 'గట్టి' నమ్మకం మనవాళ్ల మెదళ్లలో పీటవేసుకు కూర్చుంది. అందుచేత కథకులు కూడా కథ డిమాండ్ చేసినా, చేయకపోయినా మధ్యమధ్యలో ఫైటింగ్ వచ్చే సీన్లని 'క్రియేట్' చేస్తుంటారు. మన డైరెక్టర్లకి కథమీద పట్టున్నా ఒక్కోసారి అదుపుతప్పి పడిపోయి హైటెక్ యాక్షన్ సీన్లని సృష్టించే భారం స్టంట్ డైరెక్టర్ల మీద వొదిలేస్తారు. ఆ చాన్స్ కోసమే చూసే సదరు 'డిష్యుం.. డిష్యుం' డైరెక్టర్లు హీరోగారి హీరోయిజాన్ని ఎక్స్‌పోజ్ చేయించడానికి రకరకాల ఫైట్లు చేయిస్తారు. అయితే ఈ ఫైట్లతో ఎంత అదరగొడితే ఏం లాభం? జనం ఫైట్లు చూడ్డానికి మాత్రమే వచ్చే రోజులు ఎనిమిదో దశకం తొలిభాగంతోనే పోయాయి. ఇవాళ టీవీ అతి చౌక వినోద సాధనంగా రూపుదాల్చింది. సినిమాలేమో జేబుకి బరువవుతున్నాయి. దీన్ని కొంతవరకు భరించగలరేమో కానీ బుర్రలకి కూడా భారంగా తయారైపోతే ఎలా భరిస్తారు? ప్రేక్షకుల అభిరుచులు గతంలోలా లేవు. చిత్రంలో సత్తా లేకపోతే మొహమాటం లేకుండా తిప్పికొట్టడం అలవాటు చేసుకున్నారు వాళ్లు. అందుకే దర్శకులు మరింత ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో అలనాటి మేటి దర్శకుడు బి.ఎన్. రెడ్డి ఇప్పటి దర్శకులకి మార్గదర్శకునిగా నిలుస్తారు. ఎప్పటికప్పుడు ఇతివృత్తాల్లో నూతనత్వం చూపించి ప్రయోగాలు చేయడంలో ఆయనను మించినవారు లేరు. ప్రయోజనాల్ని ముందుకుతెచ్చి సినిమాని ప్రతిభావంతమైన మాధ్యమంగా నిరూపించే ప్రయత్నం చేశారాయన. ఆయన చిత్ర నిర్మాణ పద్ధతికి స్క్రిప్టు ఆయువుపట్టుగా వుండేది. ప్రతి చిన్న వివరంతో సహా కెమెరా మూవ్‌మెంట్, నటీనటుల కదలికలు అన్నీ ప్రతిషాట్‌కు సంబంధించి స్క్రిప్టులో రాసుకునేవారు. అందుకే ఆయన చిత్రాల్లో పరిపక్వత అడుగడుగునా గోచరిస్తుంది. ఇప్పటి దర్శకుల్లో ఆ ఓపిక ఏమాత్రం కనిపించదు.
సినిమా అనేది శక్తివంతమైన ఓ కళాసాధనం. దాన్ని ఉపయోగించడం తెలీకపోతే అది వికృతంగా తయారవుతుందని ఎన్నో చిత్రాలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఈ నిజాన్ని మనం గమనించాం. ఎప్పటికప్పుడు మూసధోరణి సినిమాల వల్లే చిత్రసీమకు సంక్షోభాలు వస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ మూసధోరణిని చీల్చుకుంటూ ఓ కొత్తచిత్రం వస్తే అదే ట్రెండులో మళ్లీ మూసచిత్రాలు తయారవడంతో పరిశ్రమకు గడ్డుకాలం స్థిరపడిపోయింది. ఇప్పుడు నడుస్తోంది ప్రేమ చిత్రాల ట్రెండు - అదీ టీనేజ్ ప్రేమ కథాచిత్రాల వరకే. అందరూ ఒకే మూసలో సినిమాలు తీస్తుంటే జనం ఎన్ని ప్రేమల్ని చూస్తారు? వాటిలో కొత్తగా అనిపించిన 'నువ్వు-నేను', 'సంపంగి', 'ఖుషి' వంటి కొన్ని చిత్రాల్నే ఆదరించి మిగతా వాటిని డబ్బాలు సర్దేసుకొమ్మని చెప్పేశారు. కథనే నమ్ముకుని పకడ్బందీగా చిత్రాన్ని రూపొందిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారని గత ఏడాది వచ్చిన 'క్షేమంగావెళ్లి లాభంగా రండి' రుజువుచేసింది. కథ పాతదే అయినా అందులోని పాత్రల్లో తమని ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఆ చిత్రానికి ఊహించనంత విజయాన్ని చేకూర్చిపెట్టారు. ఈ ఏడాది ఇలాంటి డిఫరెంటు చిత్రం (ప్రేమ మూసలో) రాలేదు.
నవతరం నటులు ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ ముందుకు సాగిపోతుండబట్టే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నవవసంతంలా వెల్లివిరుస్తోంది. పవన్‌కల్యాణ్, మహేశ్ ఇదివరకే తమని తాము ప్రూవ్ చేసుకుంటే తరుణ్, ఉదయ్‌కిరణ్ కూడా రెండేసి హిట్లు ఇచ్చి తమనీ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నవతరం నటుల మధ్యే ఎంత కాదనుకుంటున్నా పోటీవచ్చి చేరుతుంటే అగ్ర కథానాయకులు తమ స్థానాన్నీ, ఇమేజ్‌నీ నిలబెట్టుకోవాలంటే మరింత కష్టపడక తప్పదు. ఒకే తరహా పాత్రలవల్ల, కథలవల్ల జనం మొనాటనీ ఫీలవుతుండటం చేతనే ఇటీవల పెద్ద హీరోల చిత్రాలు ఎక్కువ శాతం అపజయం పాలయ్యాయి. ఈ ఏడాది అగ్రహీరోల చిత్రాలు పది విడుదలైతే అందులో రెండు మాత్రమే ('నరసింహనాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్') విజయం సాధించాయ్. అంటే విజయ శాతం కేవలం 20 మాత్రమే. 80 శాతం చిత్రాలు అపజయం పొందాయన్నమాట. పరిశ్రమకి ఇదెంతమాత్రమూ క్షేమకరం కాదు. ఎందుకంటే ఇవి భారీ బడ్జెట్‌తో తీసే చిత్రాలు. అవి ఫెయిలైతే నిండా మునిగిపోయేది బయ్యర్లు. అందుచేతనే ఇప్పుడు బయ్యర్ల దృష్టి స్టార్లమీద కాకుండా క్రేజీ హీరోల మీదనే ఎక్కువగా పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తదనానికే ప్రాముఖ్యమిచ్చే విధంగా పెద్ద హీరోలు తమ కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలి. కొత్తదనమంటే అనవసరపు రిస్క్ తీసుకొమ్మని కాదు. కొత్తదనమంటే అందరికీ అహ్లాదాన్ని పంచే టానిక్‌లాగుండాలి తప్ప చేదు మాత్రలా వుండకూడదు. ఇక్కడే పెద్ద హీరోలు తమ దృష్టిని కేంద్రీకరించి సహజంగా అనిపించే కథల్ని ఎంచుకుని అందులో నవ్యతకి ప్రథమ స్థానం కేటాయిస్తే పరిస్థితులు మెరుగవుతాయి. వాళ్లమీద ఆధారపడ్డ అనేకమంది సర్వైవ్ అవుతారు.
-ఆంధ్రభూమి డైలీ, 28 సెప్టెంబర్ 2001

No comments: