Wednesday, June 11, 2014

Short Story: Amrutham Varshinchina Megham

అమృతం వర్షించిన మేఘం


వీపు కింద ఇసుక జారుతుంటే గిలిగా ఉండటంతో పాటు నీళ్లలోకి అంతకంతకూ జారిపోతున్నామా అనిపిస్తోంది. చల్లటి సాయంకాలపు సముద్రపు గాలి ముఖాన్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా స్పృశిస్తోంది. చీకటి పడ్డానికి ఇంకా సమయముంది. ఆకాశంలో వలస పక్షులేమో - సర్రున దూసుకుపోతున్నాయి.
తల పక్కకి తిప్పి చూశాను. గజం దూరంలో నా కోసమే వెతుక్కుంటూ వచ్చిన వసంతుడికి మల్లే తలకింద చేతులు పెట్టుకొని పడుకొని ఉన్నాడు కేశవ, పరవశంగా కళ్లు మూసుకొని. అతడి పెదాల మీద చిరునవ్వు లాస్యం చేస్తున్నట్లే ఉంది. అలలు తీసుకొస్తున్న నీళ్లు తాకుతున్నా - అంత వేగానికీ చలించక దృఢంగా అందమైన శిలమల్లే అవుపిస్తోంది అతడి దేహం.
అతడి దగ్గరగా జరిగాను.
వాలుగా పడుకొని కుడిచేతిని అతడి పొట్టమీద వేసి.. నా ముఖాన్ని అతడి ముఖం మీదుగా తీసుకొస్తుంటే చప్పున ఓ చేత్తో నన్ను తన మీదికి లాక్కున్ని, పడుకొని ఉన్నవాడల్లా లేచాడు.
ఇప్పుడు నా ముఖంపైన అతడి ముఖం...
కేశవ బలంగా.. చాలా బలంగా నా పెదాలను ముద్దు పెట్టుకొని నా కళ్లలోకి తీవ్రమైన ఆరాధనతోటి, నేనెంత మాత్రమూ ఓర్చుకోలేని గొప్ప ప్రేమతోటీ చూశాడు.
అట్లా చూస్తే ఏ స్రీకి గుండె చలించదు? కేశవ సాధారణ వ్యక్తి కాదు నాకు. నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని నేనంటూ లేకుండా చేసిన నా ఆరాధ్య పురుష పుంగవుడు. నేనెవరి కోసం మా అమ్మ కడుపులోంచి బయటికొచ్చానో.. నేనెవరి కోసం ఈ పరిపూర్ణ యవ్వనాన్ని పదిలపరచుకున్నానో.. ఆ గొప్ప ప్రేమికుడు - కేశవ. ఇప్పుడు ఇక్కడ ఇలా.. నన్ను.. అబ్బ! ఈ ప్రపంచం ఆగిపోతే ఎంత బాగుండును.. మా ఈ ప్రేమ తప్ప మిగిలిన ఈ 'వేస్ట్' అంతా లేకుండా ఉంటే ఎంత బాగుండును.. కానీ.. మా ప్రేమ ఎంత నిజమో, ఈ ప్రపంచం కూడా అంతే నిజం. అయినా ఈ వేదాంతులు 'సర్వం మిథ్య' అని ఎందుకంటారో అర్థంకాదు. మిథ్య కాని ఆరోజు...
*   *   *
బోర్డు మీద ముప్పై నిమిషాలు లేటు అని రాసినా గంట ఆలస్యంగా వచ్చింది కృష్ణా ఎక్స్‌ప్రెస్. గేటు దగ్గర నిల్చొని బండిలోంచి దిగుతోన్న వాళ్లని చూస్తున్నాను. ఏదీ వాసంతి? వాసంతి బండిలోంచి దిగలేదు. వాసంతి రాలేదసలు. వస్తానన్న మనిషి ఇట్లా ఎందుకు చేసింది? వచ్చిన బండి వెళ్లిపోవడం కూడా అయ్యింది. వాసంతిని తిట్టుకుంటూ వెనక్కి తిరుగుతుంటే.. అప్పుడే "హలో వినీలా" అని ఎవరో అనేసరికి చప్పున అటు తలతిప్పాను. నవ్వుతూ చేతిలో సూట్‌కేసుతో నిల్చుని ఉన్నాడు కేశవ!
"నువ్వా.. నువ్వేనా? అన్నాను అపనమ్మకంగా.
"నేను నేనుకాక మరొకర్ని అవుతానా?"
"కానీ ఇంత కాలానికి ఇలా ప్రత్యక్షమవుతావని అస్సలు అనుకోలేదు."
"జ్ఞాపకం ఉన్నానన్నమాట అయితే."
"నాకు తారసపడ్డ వ్యక్తుల్ని మరవడం నాకు చేతకాదు మరి."
"ఏం చేస్తున్నావిప్పుడు మరి?"
"మగవాడినైనందున ఉద్యోగం తప్పదు కదా."
పక్కపక్కనే నడుస్తూ ఇట్లా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మధ్యలో ఉన్నట్లుండి "నీ గురించి ఈమధ్య ఓ సంగతి విన్నాను" అన్నాడు.
"ఏమిటి?" అన్నాను అతని ముఖంలోకి లోతుగా చూస్తూ.
"రాజేంద్రని నువ్వు ఎందుకు కాదనాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. తప్పు నీదేనని అనుకుంటున్నా."
"అవును. తప్పే ఛేశాను. రాజేంద్రని ప్రేమించడమే తప్పు."
"కొంచెం వివరంలోకి రాకూడదూ" అంటూనే రెస్టారెంట్‌లోకి దారి తీశాడు.
"టిఫినేమీ వొద్దు. వొచ్చేటప్పుడే చేశాను. కాఫీ ఓకే" అన్నా.
"ఓకే. నాకైతే బాగా ఆకలిగా ఉంది" అంటూ చపాతీకి ఆర్డరిచ్చి "కానీ" అన్నాడు.
"రాజేంద్రకి నాకన్నా డబ్బు ముఖ్యమైంది. ప్రేమదారి ప్రేమదే కట్నందారి కట్నందే అన్నాడు. మా వాళ్లు కాదనలేదు. కానీ నా మనసుకు దెబ్బ తగిలింది. 'ఇదేం ప్రేమ?' అనిపించింది. అతడు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించలేదని తెలిసిన తర్వాత కూడా అతడ్ని చేసుకోవడం నన్ను నేను వంచించుకోవడమే అవుతుంది. టైంపాస్ కోసమో, క్షణికమైన థ్రిల్ కోసమో అతడు నన్ను ఉపయోగించుకున్నాడు. అంతే!"
"రాజేంద్ర ఇట్లా చేశాడా? రాస్కెల్. మా ముందు ఎన్ని ఆదర్శాలు పోయేవాడు. ఎప్పటికైనా లవ్ మ్యారేజే చేసుకుంటాననీ, కులాలూ, మతాలూ పట్టించుకోననీ, పెద్దలు ఒప్పుకోకపోతే ధిక్కరిస్తాననీ.. ఎన్ని చెప్పేవాడో.. తర్వాత మీ ఇద్దరూ ప్రేమలో పడటం.. వాడు 'లక్కీఫెలో' అని మేం అనుకోవడం.."
ప్లేటు ఖాళీ అయ్యింది. కాఫీలు వచ్చాయి.
"నువ్వెవరినీ చూసుకోలేదా కేశవా" అన్నాను నెమ్మదిగా కాఫీ తాగుతూ, అతడి కళ్లలోకి చూస్తూ.
చప్పున అతడూ నా కళ్లలోకే చూశాడు. ఆ చూపుల్లోని భావానికి నా కళ్లు కిందికి వాలాయి.
"నాది వన్‌సైడ్ లవ్ వినీలా" అంటుంటే కేశవ కంఠం స్పష్టంగా వొణికింది.
నాకు మాటలే దొరక్కుండా పోయాయి. ఏమని అడగ్గలను? గతం తలచుకున్నంత మాత్రం చేతనే అతడి ఈ మాటలకి అర్థం తెలిసొస్తుంది.
కాలేజీ రోజుల్లో నన్నారాధించే వాళ్లలో కేశవ నెంబర్‌వన్. ఎప్పుడూ తన నోటితో చెప్పకపోయినా అతడికి నా మీద అంతులేని ప్రేమ ఉందని ఎట్లానో తెలిసింది. కానీ నా మనసు అప్పటికే రాజేంద్రని నింపుకోవడంతో దూరంగానే ఉండిపోయాడు కేశవ. తారసపడినప్పుడల్లా చప్పున తలదించుకొని వెళ్లిపోయేవాడు. నేను నవ్వుకునేదాన్ని. రాజేంద్ర తప్ప మిగతా మగాళ్లంతా 'జోకర్లు'గానే కనిపించేవాళ్లు అప్పుడు. అమ్మాయిల దృష్టిలో పడ్డానికి వాళ్లు ఎన్ని వేషాలు వేసేవాళ్లు.. ఇప్పటికీ నవ్వొస్తుంటుంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. కేశవ నా దృష్టిలో పడేందుకు ఎట్లాంటి వేషమూ వెయ్యలేదు. కళ్లు ప్రదర్శించే ఎక్స్‌ప్రెషన్ చాలు, హృదయం తెలుసుకోవాలంటే.
కాఫీ తాగడం పూర్తయింది. తిరిగి ఇద్దరమూ రోడ్డుమీద నడుస్తున్నాం. ఎటు పోతున్నామో స్పృహే లేదు నాకు. ఏవో ఆలోచనలు తొలిచేస్తున్నాయ్ నన్ను. ఆ స్కౌండ్రల్ రాజేంద్ర జ్ఞాపకం వొచ్చి మనసంతా పాడయ్యింది.
"ఇదే మా ఇల్లు" అని కేశవ చెప్పడంతో "ఊ" అని దిక్కులు చూశాను. అతడేమన్నాడో స్ఫురించి చూశాను. ఆలోచనల్లో పడి అతడింటిదాకా వొచ్చానన్న మాట. వాళ్లింట్లో అందరికీ పరిచయం చేశాడు కేశవ. వాళ్ల కలుపుగోలుతనం, నవ్వుతోన్న వాళ్ల ముఖాలు, ఎట్లాంటి అనుమానమూ లేకుండా స్వచ్ఛంగా చూస్తోన్న వాళ్ల కళ్లు నన్ను అమితంగా ఆకర్షించి ఆకట్టుకున్నాయి. అప్పుడే అనుకున్నాను - నా జీవితంలోని గొప్ప మార్పుకు అది ఆరంభం అవుతుందని. అంతే అయ్యింది.
కేశవతో చనువు స్నేహాన్ని దాటింది. వాళ్లంట్లోనూ నేను చనువుగా మెదిలే స్థితికి చేరుకున్నాను. కేశవ వాళ్లమ్మ నాకు బాగా దగ్గరయ్యింది. ఇక్కడ మా అమ్మకీ, కేశవ వాళ్లమ్మకీ ఎంతో తేడా ఉంది. మా స్నేహాన్ని కేశవ వాళ్లమ్మ అంగీకరించినట్లు మా అమ్మ అంగీకరించలేదు. ఒక్క విషయంలోనే స్త్రీలలో ఎందుకిట్లా వైరుధ్యాలుంటాయి? వాళ్లు జీవించే స్థితిగతులూ, వాతావరణ ప్రభావం వల్లనేనా?
కేశవ వాళ్లింటికి నేను తరచూ వెళ్తున్నా, అతను మాత్రం రెండు సార్లే మా ఇంటికి వొచ్చాడు. తొలిసారి అతణ్ణి నేనే తీసుకొచ్చాను. అమ్మకీ, అన్నయ్యకీ అతణ్ణి పరిచయం చేసినప్పుడు వాళ్ల ముఖాల్లో జీవం చచ్చిపొయ్యింది. అన్నయ్య ముఖమైతే కందగడ్డే అయ్యింది.
కేశవ వెళ్లిన తర్వాత "వాడితో స్నేహమేమిటే నీకు?" అన్న అమ్మకి అన్నయ్య కూడా వంత పాడేసరికి అతడి మీద అంతులేని అసహ్యం కలిగింది. ఆయనగారికి ఎంతమంది 'స్నేహితురాళ్లు' ఉన్నారో నాకు తెలియంది కాదు. ఆయనకో నీతి, నాకో నీతీనా? తామేం పనులు చేస్తున్నారో అవే పనులు తమకి సంబంధించిన స్త్రీలు చేస్తే ఈ మగవాళ్లు హర్షించరెందుకో అర్థంకాదు. ఈ గుణం వాళ్లకి పుట్టుకతోనే వొస్తుంది గావును.
అయినా నేను వాళ్లని లక్ష్యపెట్టదలచుకోలేదు. వాడి ద్వంద్వ వైఖరి గురించి అన్నయ్యతో నేను వాదించదలచుకోలేదు. అటువంటి వాళ్లతో వాదించడం కంటే వ్యర్థమైన పని ఇంకోటి ఉండదనిపించింది.
కేశవ రెండోసారి వొచ్చినప్పుడు అన్నయ్య లేడు కానీ నాన్న ఉన్నాడు. ఆయన మా స్నేహానికి ఆందోళన చెందినట్లుగా నాకు కనిపించలేదు.
తర్వాత అమ్మ ఈ విషయం ప్రస్తావించినప్పుడు నాన్న మాటలు నాకు ఎంతో శక్తినిచ్చాయి. "వినీ చెడ్డపని చేయదని నాకు నమ్మకముంది. ఒకవేళ దానికి అతన్నే చేసుకునే ఉద్దేశముంటే, అప్పుడు కూడా దాన్ని నేను కాదనను."
ఈ విషయంలో అమ్మ అంత తేలిగ్గా నాన్నకి లొంగిపోకూడనుకుందేమో అనుకుంటాను.
"దాన్నట్లా తయారు చేసింది మీరే. ఆడదనే స్పృహ లేకుండా ఊళ్ల మీదికి అట్లా తిరగడం చేతనే దానికి నేనన్నా, అబ్బాయన్నా బొత్తిగా లక్ష్యం లేకుండా పోయింది. అది చేసే వెధవ పనులకి మీరు తందానా అంటం చేతనే అదింత జగమొండిగా తయారయ్యింది. ఆ ముందు స్నేహమేమో పెళ్లిదాకా లాక్కొచ్చి అబ్బాయి కట్నం కాదనలేదని ఆ పెళ్లి వొద్దంది. మరిప్పుడెట్లా తగలడుతుందో.. ఏమో..? అయినా ఇట్లాంటి స్నేహాలు ఎప్పుడూ మా వంశంలో వినలేదూ, కనలేదూ - అట్లాంటిది దీనికి ఈ బుద్ధి ఎట్లా వొచ్చిందో తెలీకుండా ఉంది" అని ఎంతగా గింజుకున్నా అమ్మ మాటల్ని నాన్న గానీ, నేను గానీ ఖాతరు చేయలేదు.
*  *  *
"వినీ! ఇంక పోదాం పద" అని రెక్క పట్టుకొని కేశవ పైకిలేపుతుంటే ఆలోచనలాపి, లేచాను.
అప్పుడప్పుడే చీకటి పడబోతోంది.
ఇద్దరమూ అట్లా సముద్రం ఒడ్డున ఒకరి పక్కగా ఒకరం నడుస్తావుంటే చేపలు పట్టేవాళ్లు మా వొంక చిత్రంగా చూస్తున్నారు. గాలికి జుట్టు ముఖాన పడుతోంది. తడిగా ఉంటంతో జుట్టు ముఖానికి తగిలినప్పుడల్లా జివ్వుమంటోంది.
తలతిప్పి చూస్తే కేశవ గంభీరంగా నడుస్తున్నాడు, చేతులు రెండూ ప్యాంటు జేబులో పెట్టి.
కేశవతో నా జీవితం ముడిపడబోతోందని నాకు స్పష్టమైపోతోంది. ఏమంటాడు కేశవ? అట్లాంటి ఆలోచన లేదంటాడా? ఊహు.. ఎప్పటికీ అననే అనడు నా కేశవ అట్లా. నాకు కేశవ ఎంతో, నేనూ కేశవకి అంతేనన్న సంగతి నాకు తెలియదూ!
"కేశవా!" అన్నాను.
"ఊ.. ఏమిటి?" అన్నాడు తల నావేపు తిప్పి.
చెప్పాలి. చెప్పేయాలి.. అనుకుంటున్నాను. పెదాలు కదులుతున్నాయే కానీ గొంతు పెగలడం లేదు.
"ఏమిటి వినీ. ఏదో చెప్పాలనుకుంటున్నావులా ఉంది. ఇంకా ఆ దాపరికాలేమిటి?" అని భుజం మీద చేయివేసి, నా దగ్గరగా జరిగి నడుస్తున్నాడు. అట్లా నడుస్తూనే తల అతడి భుజం మీద వాల్చేశాను.
"నీది ఒన్ సైడెడ్ లవ్ అన్నావు జ్ఞాపకముందా?" అన్నానప్పుడు.
"అది అప్పటి మాట. ఇప్పుడెందుకంటాను? నాది.. కాదు.. మనది.. బోత్ సైడెడ్ లవ్.. అవునా?"
చప్పున కేశవ ముఖాన్ని లాక్కుని పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను.
"అయితే పెళ్లెప్పుడు?" అడిగాను.
"ఇప్పుడే రానా మీ నాన్నని అడగటానికి?" క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు కేశవ.
ఇద్దరమూ కలసి జీవితం సాగిద్దాం అన్నట్లు చేయి చేయి కలిపి నడక సాగించాం.

- ఉదయం ఆదివారం, 26 సెప్టెంబర్ 1993

No comments: