Tuesday, June 24, 2014

Cinema: The Evergreen Item Girl Jyothi Lakshmi

ఎవర్‌గ్రీన్ ఐటం గాళ్

ముప్పై అయిదేళ్ల క్రితం.. అంటే 1973లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 'ఇదా లోకం' సినిమాలోని 'గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు..' పాట ఆంధ్ర ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాటకు నర్తించింది.. అప్పటి మేటి శృంగార తార జ్యోతిలక్ష్మి. ఇన్నేళ్ల తర్వాత ఆ పాట 'కుబేరులు' అనే సినిమాలో రీమిక్స్ అవుతోంది. పల్లవిని యథాతథంగా ఉంచి, చరణాలు మార్చి భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఆ పాటకు నర్తించింది.. వేరెవరో కాదు.. మళ్లీ జ్యోతిలక్ష్మే. 'అదెలా సాధ్యం!' అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. పాతికేళ్ల వయసులోని అప్పటి జ్యోతిలక్ష్మి ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ వొంటి విరుపులతోనూ, నాట్య విలాసంతోనూ ఆ పాటకు నర్తించింది. ముంబైకి చెందిన తస్లీమా షేక్ అనే అందమైన డాన్సర్‌తో ఈ పాటకు ఆమె నర్తిస్తుంటే సెట్స్ మీద ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. కొంత కాలం గ్యాప్ తర్వాత తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఆ స్టార్ డాన్సర్ తన అంతరంగాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలో 'నవ్య' ఎదుట ఆవిష్కరించింది. ఆసక్తికరమైన ఆ విశేషాలు...

నేను తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టా. మా అమ్మా నాన్నలకు మొత్తం ఎనిమిది మంది సంతానం. నేనే పెద్దదాన్ని. అందరికంటే జయమాలిని చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురం ఆడపిల్లలం. చిన్నతనంలోనే నన్ను మా మేనత్త ఎస్.పి.ఎల్. ధనలక్ష్మి పెంపకం తీసుకుంది. ఆమె వద్దే పెరిగా. ఆమె అప్పటికే మంచి హీరోయిన్. ఆ తర్వాతే జ్యోతిని కాస్తా జ్యోతిలక్ష్మినయ్యా. పేరుపొందిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ టి.ఆర్. రామన్న మా అన్నయ్యే (పెద్దమ్మ కొడుకు). నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనే ఎంజీఅర్ సినిమా.. పేరు గుర్తులేదు.. అందులో ఒక పాటలో డ్యాన్స్ చేయించాడు. ఎనిమిదేళ్లప్పుడు శివాజీ గణేశన్ సినిమా 'కార్తవరాయన్ కథ'లో డ్యాన్స్ చేశా. ఆ తర్వాత పెద్దయ్యాక 1963లో విడుదలైన తమిళ చిత్రం 'పెరియ యిడత్తు పెణ్'తో మళ్లీ సినిమాల్లోకి వచ్చా. ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో. అందులో నగేశ్ సరసన వల్లి అనే పాత్ర చేశా. అది కామెడీ రోల్. ఆ పాత్ర నాకు బాగానే గుర్తింపు తెచ్చింది. నాకు గుర్తున్నంత వరకు తెలుగులో చేసిన తొలి సినిమా 'పెద్దక్కయ్య'. అది 1967లో వచ్చింది. అందులో డ్యాన్సర్‌గా చేశా. చిన్నప్పుడే నేను రామయ్య పిళ్లె దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. అందువల్ల సినిమా డ్యాన్సులు నాకు కష్టమనిపించలేదు. వాటికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోకపోయినా భరతనాట్యమే అందుకు ఉపకరించింది. అందుకే ఎటువంటి క్లిష్టమైన డ్యాన్స్‌నైనా చేయగలిగా.

నాకు పోటీ నా చెల్లెలే

ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి మించి పాటల్లో నర్తించా. వీటిలో హీరోయిన్‌గా చేసిన సినిమాలు ఇరవై వరకు ఉంటాయి. తమిళంలో హీరోయిన్‌గా పది సినిమాల వరకు చేశా. ఎంజీఆర్‌తో 'తలైవా'లో జయలలితతో పాటు హీరోయిన్‌గా చేశా. అలాగే శివజీ గణేశన్‌తో సెకండ్ హీరోయిన్‌గా నటించా. తెలుగులో కృష్ణ గారితో 'మొనగాడొస్తున్నాడు జాగ్రత్త', 'హంతకులు దేవాంతకులు' సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. హరనాథ్‌తో 'పుణ్యవతి', రామకృష్ణతో 'పిల్లా? పిడుగా?' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. సంఖ్యాపరంగా చూసుకుంటే ఎక్కువగా కృష్ణగారి సినిమాల్లో చేశాను. డైరెక్టర్ల విషయానికి వస్తే ఎక్కువగా కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో నటించా. అప్పట్లో ఫైటింగ్ సినిమాలంటే నేను తప్పకుండా ఉండేదాన్ని. ఫైటింగ్ సీన్లలో నేనే స్వయంగా నటించేదాన్ని. డూప్‌ని ఎప్పుడోగానీ ఉపయోగించేవాళ్లు కాదు. విజయలలిత, హలం వంటి వాళ్లున్నా నాకు ప్రధాన పోటీ నా చెల్లెలు జయామాలినియే. అప్పట్లో నేను గర్భవతిగా ఉండి, కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యా. ఆ టైంలోనే జయమాలిని సినిమాల్లోకి వచ్చి సక్సెసయ్యింది. అందం తనకు ప్లస్ పాయింట్. కొన్ని నెలలకు నేను తిరిగి సినిమాల్లోకి వచ్చేశా. అప్పట్నించీ మా మధ్య పోటీ ఉండేది. అయితే ఈ విషయంలో మేమిద్దరమూ ఒకరి పట్ల ఒకరం అసూయ చెందింది లేదు. చాలా సినిమాల్లో కలిసే డాన్సులు చేశాం. ఒకర్ని మించి ఒకరం బాగా డాన్స్ చేయాలని తపన పడేవాళ్లం. అందుకే మా పాటలు అంతగా పాపులర్ అయ్యాయి. మా డాన్సులు అంతగా పేరు తెచ్చుకున్నాయి. నేనింకా సినిమాల్లో కొనసాగుతున్నా, తను మాత్రం ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకొని చెన్నైలోనే ఉంటోంది. సమయాన్నంతా కుటుంబానికే కేటాయిస్తోంది. తనకు ఒక మనవడున్నాడు.

ఎక్స్‌పోజింగ్‌కు ఇబ్బంది పడలేదు

నా కూతురు జ్యోతిమీనా కూడా జయ బాటే పట్టింది. నా వారసురాలిగా డాన్సర్‌గా అడుగు పెట్టినప్పటికీ, మీనాకు ఈ ఫీల్డ్ అంతగా నచ్చలేదు. అందుకే తనకు పెళ్లి చేసేశా. హాయిగా కాపురం చేసుకుంటోంది. తనకు ఒక పాప. ఇటీవలి కాలంలో నాకు తెలుగులో గ్యాప్ వచ్చిందన్నది నిజం. అయితే తమిళంలో అడపాదడపా చేస్తూనే ఉన్నా. తమిళ టీవీ సీరియల్స్‌తో పాటు తెలుగులో 'మా ఇంటి మహాలక్ష్మి', 'ఓం నమో వెంకటేశాయ' వంటి సీరియల్స్ చేశా. రాజశేఖర్ హీరోగా నటించిన 'శేషు' తర్వాత మళ్లీ తెలుగులో నటించడం ఇదే. నేను డాన్స్ చేసిన పాటలన్నీ నాకిష్టమైనవే కానీ, ఎన్టీఆర్ సినిమా 'సర్దార్ పాపారాయుడు'లోని 'జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. ఆ చీరకే సిగ్గేసింది' పాటంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చీరకట్టడమనేది ఒక సెన్సేషన్. ఆ పాట అప్పట్లో బాగా పాపులర్. ఏ మూలకు వెళ్లినా ఆ పాట చాలా కాలం వినిపించింది. "ఐటం సాంగ్స్ అంటే ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి కదా.. ఇన్ని పాటలు ఎలా చేయగలిగారు?" అని మీతో పాటు ఒకరిద్దరు నన్నడిగారు. డాన్సర్‌గా చేయడమంటే ఎక్స్‌పోజింగ్ తప్పదని తెలుసు. మొదటే ప్రిపేరయ్యాను కాబట్టే తొలినాళ్ల నుంచీ ఇప్పటిదాకా ఎక్స్‌పోజింగ్‌కు కానీ, కురచ దుస్తులు వేసుకోవడానికి కానీ నేనెన్నడూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే డాన్సింగ్‌ని నేను వృత్తిగా, పనిగా భావించాను కాబట్టి. అందుకే నాలుగు దశాబ్దాలుగా కెరీర్ కొనసాగించగలిగా. అదే హీరోయిన్‌గా అయితే ఇప్పుడు మీకు కనిపించేదాన్నా!

అదే నా ఆరోగ్య రహస్యం

ఆ రోజుల్లోని ట్రెండు ప్రకారం ఆ క్లబ్ సాంగ్స్ ఎలా బాగుండేవో, ఇప్పటి ట్రెండు ప్రకారం ఈ ఐటం సాంగ్సూ బాగుంటున్నాయి.  మధ్యలో కొంత కాలం ఐటం సాంగ్స్ వెనుకపట్టు పట్టినా, మళ్లీ ఇప్పుడు వాటికి మంచి రోజులు నడుస్తున్నాయి. అందుకే నాకు మళ్లీ అవకాశాలొస్తున్నాయి. 'ఈ వయసులోనూ ఎందుకు ఈ డాన్సులు చెయ్యడం?' అని మీరడగవచ్చు. చేసే ఓపిక ఉంది కాబట్టే చేస్తున్నా. చేస్తూనే ఉంటా. ఓపిక లేనప్పుడు మానేస్తా. అదెప్పుడనేది చెప్పలేను. హీరోయిన్ సహా అన్ని రకాల పాత్రలూ చేశా. హీరో మాదిరిగా ఫైట్లు, డాన్సులు చేశా. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేశా. అందువల్ల ఫలానా రకం పాత్ర చేయలేదనే అసంతృప్తి నాలో లేదు. ఆహారాన్ని మితంగా తీసుకోవడమే నా ఆరోగ్యం వెనుక ఉన్న రహస్యమంటాను. ఇంటి పనులు నేనే చేసుకుంటా. అందుకే ఒంటిని ఇప్పటికీ కాపాడుకోగలుగుతున్నా. రాజా హీరోగా నటిస్తున్న 'జగన్మోహిని'లో నమిత తల్లిగా నటిస్తున్నా. నమిత జగన్మోహిని అన్నమాట. ఈ సినిమా తెలుగు, తమిళం.. రెండు భాషల్లోనూ తయారవుతోంది. అలాగే శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'కుబేరులు'లో ఐటం సాంగ్ చేశా. ఒకప్పుడు నేను 'ఇదా లోకం' సినిమాలో డాన్స్ చేయగా, బ్రహ్మాండంగా పాపులర్ అయిన 'గుడి యెనక నా సామి గుర్రమెక్కి పోతున్నాడు'కు ఇది రీమిక్స్ సాంగ్. ముప్పై ఐదేళ్ల తర్వాత అదే పాటకు మళ్లీ నేనే డాన్స్ చెయ్యడం కొత్తగానూ, ఆనందంగానూ ఉంది. అలాగే దాసరి నారాయణరావుగారి సినిమా 'మేస్త్రి'లో హీరో బామ్మగా నటిస్తున్నా.
ఇప్పటి తరానికి నా గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు రెండు దశాబ్దాల పైగా నా ఆట పాటతో దక్షిణాది ప్రేక్షకుల్ని మురిపించాను, మైమరపింపజేశాననే తృప్తి ఉంది. 'ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఉందా?' అని మగవాళ్లు అడిగేవాళ్లంటే.. అంతకంటే ఒక సినిమా డాన్సర్‌గా నాకు కావలసిందేముంది! ఈ తరం ప్రేక్షకుల హృదయాల్లోనూ స్థానం పొందాలనేది ఇప్పటి నా లక్ష్యం.

- నవ్య వీక్లీ, డిసెంబర్ 3, 2008

No comments: